ఇద్దరు మద్దుగుమ్మలతో కలరి
తమిళసినిమా: పండిగై చిత్రంతో హిట్ కొట్టిన నటుడు కృష్ణ తాజాగా కలరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విద్యప్రదీప్, సంయుక్త మీనన్ అనే ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్ చేస్తున్నారు. నక్షత్ర మూవీ మ్యాజిక్ పతాకంపై సెనిత్ కెలోత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌చంద్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సందీప్వినోద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఎంఎస్.భాస్కర్, జయప్రకాశ్,బ్లాక్‌పాండి, సెండ్రాయన్, విష్ణు, కృష్ణదేవ్, మీరాకృష్ణన్, అంజలీదేవి ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఆర్బీ.గురుదేవ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా గాయకుడు వీవీ.ప్రసన్న సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కాగా చిత్ర వివరాలను దర్శకుడు కిరణ్‌చంద్ తెలుపుతూ కలరి అంటే పోరుభూమి అని అర్ధం అని తెలిపారు. ప్రతి మనిషి జీవితం ఒక పోరాటమేనని, అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం కలరి అని చెప్పారు. కేరళా రాష్ట్రం, కొచ్చిలో వాత్తురుత్తి అనే ప్రాంతంలో అధిక భాగం తమిళులే నివశిస్తుంటారని, వారి జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రం గా కలరి ఉంటుందని తెలిపారు. నటుడు కృష్ణ ఇందులో సగటు యువకుడిగా నటిస్తున్నారని, జనరేషన్ గ్యాప్ వల్ల ఆయనకు తన తండ్రికి మధ్య అంతరం వల్ల కలిగే సమస్యలు, వాటి పర్యావసానాలే కలరి చిత్రం అని, ఇందులో ప్రేమ, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ వంటి జనరంజక అంశాలన్నీ చోటు చేసుకుంటాయని దర్శకుడు చెప్పారు.