Kammarpalli
-
వివాహానికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి
సాక్షి, కమ్మర్పల్లి(బాల్కొండ): వివాహానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని బషీరాబాద్ కాడి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో మోర్తాడ్ మండలం వడ్యాట్‌కు చెందిన పెండెం మురళి(66) మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ మనోజ్‌కుమార్ కథనం ప్రకారం.. వడ్యాట్‌కు చెందిన మురళి ఆదివారం మధ్యాహ్నం తోటి కార్మికుడి కూతురు వివాహ కార్యక్రమానికి టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై భీమ్‌గల్ వెళ్లాడు. అయితే, సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మొబైల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆచూకీ కోసం వెతికారు. సోమవారం ఉదయం రోడ్డు వెంబడి వెతుకుతూ వెళ్లగా కాడి చెరువు సమీపంలో రోడ్డు పక్కన పొదల్లో వాహనం కనిపించింది. వెళ్లి చూడగా, పక్కనే మురళి శవమై కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బషీరాబాద్ కాడి చెరువు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయి గుంతలో పడిపోయి ఉండడం, మురళికి ముఖం, నోటి దగ్గర, చాతీ భాగాల్లో గాయాలను బట్టి ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుడికి భార్య రాధ, కూతురు రమ ఉన్నారు. -
బీసీ రుణాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఏప్రిల్‌లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కమ్మర్పల్లి(బాల్కొండ) : బీసీ కార్పొరేషన్ 2018–19 సంవత్సరానికి గాను రుణాల మంజూరు కోసం ఏప్రిల్ 4 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా, జిల్లాలో 11,542 మంది నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తు ఫారం, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీల మూడు సెట్లను అభ్యర్థులు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సమర్పించాలని, గ్రామసభల తీర్మానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ వారం రోజుల కిత్రం అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేని, అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. వివరాలను మండల పరిషత్తు కార్యాలయంలో ఆన్లైన్ చేశారు. అయితే గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేపట్టలేదు. దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయి అధికారులు అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్న దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. గతంలో సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తికాగానే వాటి ని పరిశీలించి 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించేవారు. ప్రస్తుతం నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన హడావుడిలో ఉన్న అధికారం యంత్రాంగం కార్పొరేషన్ రుణాల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అందని రాయితీ రుణాలు.. 2015–16 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు పూర్తిస్థాయిలో రాయితీ రుణాలు అందలేదు. 80 శాతం రాయితీ ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, బీసీ కార్పొరేషన్, బ్యాంక్, ఎంప్లాయిమెంట్, ఇతర అధికారులు కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావులేకుండా ప్రక్రియ అంతా బీసీ సంక్షేమ శాఖ ఆన్లైన్లోనే పూర్తి చేసింది. కాని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. చాలామంది అభ్యర్థులకు రాయితీ రుణాలు అందలేదు. రుణాలు మం జూరైన లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిపించడంతో పాటు, డాక్యూమెంట్ ప్రక్రియ పూర్తి చేయించారు. కాని రుణాలు మంజూరు కాకపోవడంతో అభ్యర్థులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలించుకున్నారు. మరుసటి ఏడాదైనా రాకపోతాయా అని 2017–18 సంవత్సరంలో వేచి చూశారు. కాని ఆ సంవత్సరంలో రుణాల కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదు. రెండేళ్ల నుంచి రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈయేడు బ్యాంకు అంగీకారం లేకుండానే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించడంతో అభ్యర్థులు చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాయితీ పెంచడంతో డిమాండ్... కార్పొరేషన్ రుణాలకు రాయితీ పెంచడంతో డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. రుణాలను మూడు కేటగిరిలుగా విభజించారు. 1వ కేటగిరిలో రూ. 1 లక్ష వరకు రుణ సదుపాయానికి 80 శాతం రాయితీ, 2వ కేటగిరిలో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయానికి 70 శాతం రాయితీ, 3వ కేటగిరిలో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు రుణానికి 60 శాతం రాయితీ ప్రకటించారు. రుణాలకు రాయితీ అధికంగా ఉండడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కులాల వారీగా, బీసీ ఫెడరేషన్ ప్రకారం యూనిట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉందని ప్రచారం ఉండడంతో ఆశావహులు తమకు రుణాలు మంజూరవుతాయని నమ్మకంతో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా..? రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుందనేది అయోమయం నెలకొంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి ఇంటర్వ్యూల కోసం తేదీని ప్రకటించి అధికార బృందం లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలు రుణాలు వచ్చే వరకు అంతా ఆన్లైన్ ప్రక్రియనే కొనసాగిస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇంతవరకు మండలానికి ఎన్ని యూనిట్లు కేటాయించారో స్పష్టంగా తెలియజేయలేదు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల తీర్మానం ద్వారానే చేపట్టాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయిలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గాలేని, ఆన్లైన్ చేయని దరఖాస్తులను తిరస్కరించి మిగతా అన్ని వాటితో లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఆన్లైన్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరూ అర్హులైతే ఎంతమందికి రాయితీ రుణాలు అందుతాయో వేచి చూడాల్సిందే. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా అనే సంశయం నెలకొంది -
గుడిలో కొబ్బరి చెట్టు మీద పడి బాలుడి మృతి
-
కొబ్బరి చెట్టు మీద పడి బాలుడి మృతి
నిజామాబాద్ : కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కమ్మర్పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఉప్లూర్ గ్రామంలో ఉన్న శ్రీ బాలరాజేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండగా అకస్మాత్తుగా కొబ్బరిచెట్టు విరిగి బాలుడి మీద పడింది. దీంతో మణి తీవ్రరక్త స్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కొబ్బరిచెట్టు మొదలులో పుచ్చిపోవడం వల్లే చెట్టు విరిగి పడిందని స్థానికులు చెబుతున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కమ్మర్‌పల్లిలో వాటర్ ప్లాంట్ల సీజ్
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న వాటర్ ప్యూరిఫైరింగ్ ప్లాంట్లను సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కమ్మర్‌పల్లిలో 4, హాసాకొత్తూర్‌లో 2, బషీరాబాద్‌లో 1, చౌట్పల్లిలో 1, కోనాసముందర్‌లో 1 వాటర్ ప్లాంట్‌ను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భిక్షపతి, వీఆర్వోలు మూసి వేయించారు. వాటర్ ప్లాంట్ల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని ఆర్ఐ తెలిపారు. సీజ్ చేసిన ప్లాంట్లను తెరవకూడదని, తెరిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు. -
రెండు బస్సులు ఢీ
రెండు బస్సులు ఢీ కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు(కుమార్ ట్రావెల్స్) ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. నిజామాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న నిజామాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, జగిత్యాల నుంచి ముంబై వెళ్తున్న కుమార్ ట్రావెల్స్ బస్సు పోలీస్‌స్టేషన్, పెట్రోల్ బంక్ మధ్య ఉన్న మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. కుమార్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి చొచ్చుకుపోగా, ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు వెనక భాగం, ప్రైవేట్ బస్సు ముందు భాగం దెబ్బతిన్నాయి. రెండు బస్సులో కలిపి సుమారు 100 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు. ప్రమాదానికి కారణమైన కుమార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వినయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ చెప్పారు. లారీని ఢీకొట్టిన ప్రైవేటు ఓల్వో బస్సు సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం శివారులో 44 నంబరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో లారీని ఓ ప్రైవేటు ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోతూ లారీని తగులుతూ దూసుకుపోయింది. బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, ఇందులో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థులు 15 మంది ఉన్నారు. బస్సు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు వెళ్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న మనోజ్‌కుమార్ అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
భారీ వర్షం
ఇందూరు : జిల్లాలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఐదు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం, 12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమ్మర్పల్లి మండలంలో 42.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోటగిరి మండలంలో 40.4 మిల్లీ మీటర్లు, కామారెడ్డిలో 35.6, బోధన్‌లో 34.0, సదాశివనగర్‌లో 31.2, జుక్కల్‌లో 29.6, బీర్కూర్‌లో 24.0, రెంజల్లో 23.8, మద్నూరులో 20, వర్నిలో 18.4, బిచ్కుందలో 16.4, మాక్లూర్‌లో 15.8, లింగంపేట్‌లో 15.6, నవీపేట్లో 15.4, ఎడపల్లిలో 12.2, నందిపేట్‌లో 12, తాడ్వాయిలో 11.4, మోర్తాడ్‌లో 11.4, గాంధారిలో 10.4, నిజాంసాగర్‌లో 9, దోమకొండలో 8.2, పిట్లంలో 8, బాల్కొండలో 4.4, నాగిరెడ్డిపేట్లో 3.2, భిక్కనూరులో 3, భీమ్‌గల్‌లో 2.2, ఆర్మూర్‌లో 2.8, మాచారెడ్డిలో 2.2, మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
భృతి కోసం బీడీ కార్మికుల ధర్నా
నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ మెరుగైన జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మంగళవారం బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ మేరకు కార్మికులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మండల పరిషత్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
లారీని ఢీకొన్నఆర్టీసీ బస్సు... డ్రైవర్ మృతి
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రం శివార్లలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్ పల్లి వైపు వెళుతుండగా కమ్మర్ పల్లి శివార్లకి రాగానే బస్సు మందు చక్రం పేలిపోయింది. దాంతో అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. అతికష్టం మీద స్తానికులు అతడిని బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం
కమ్మర్పల్లి : బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు. క్లోనింగ్ చేసిన కార్డుతో వివిధ దుకాణాల్లో షాపింగ్ చేసి రూ. 15,630 డ్రా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ పవార్ బాలాజీకి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఫోన్‌కు ఆదివారం రాత్రి 70338 71737 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. నీ ఏటీఎం పిన్ నంబర్ మారిందని తెలిపాడు. పాత నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో బాలాజీ తన కార్డు నంబర్ తెలిపాడు. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన బాలాజీ.. వెంటనే కమ్మర్‌పల్లిలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటీఎం బంద్ ఉండడంతో మెట్పల్లి ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూశాడు. అనేబుల్ టు ప్రాసెస్ అని రిసిప్ట్ రావడంతో నివ్వెరపోయాడు. సోమవారం కమ్మర్పల్లి ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించి లావాదేవీలు చూడగా ఆదివారం ఒక్కరోజే ఏడు దఫాలుగా రూ. 15,630 డ్రా అయినట్లు తేలింది. కార్డు తన వద్ద ఉండగానే ఖాతాలోని నగదు ఎలా విత్‌డ్రా అయ్యిందని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. పిన్ నంబరు చెప్పడం వల్ల అజ్ఞాత వ్యక్తి షాపింగ్ ద్వారా డబ్బులు డ్రా చేసి ఉంటాడని మేనేజర్ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.