అశ్రునయనాలతో ‘అధిష్టానం’
కంచి మఠంలో కన్నీటి ధారలు కురిశాయి. శిష్యబృందం మూగబోయింది. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు కలవరపడింది. కట్టలు తెంచుకునే దుంఖాన్ని ఆపుకోలేక భక్తులు సాగిలపడి బోరున విలపించారు. వేలాది మంది శిష్యులు, వేదపండితులు, సినీ, రాజకీయ ప్రముఖులు వెంట రాగా అశ్రునయనాల నడుమ శ్రీ జయేంద్ర సరస్వతి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం సరిగ్గా 10.30 గంటలకు మఠం ఆచార, సంప్రదాయాల ప్రకారం మహా సమాధి ప్రక్రియ పూర్తయ్యింది.
బుధవారం తెల్లవార్లూ కంచి మఠం కన్నీటి కీర్తనలు ఆలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కంచి కామకోటి పీఠం భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు మండపాల్లో కూలబడి అశ్రునయనాలతో స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రార్థనలు చేశారు. ఆపుకోలేని కన్నీటితో కీర్తనలు ఆలపించారు. ‘మహానుభావా...మళ్లీ రావా’ అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. జయేంద్ర సరస్వతి జీవిత చరిత్ర, ధార్మిక ప్రస్థానాన్ని వివరించే పుస్తకాలను పఠిస్తూ దైవ సంకీర్తన చేస్తూ ముక్తికి మార్గాన్ని అన్వేషించారు. కొంత మంది వేద పండితులు తమ చుట్టూ శిష్యులను కూర్చుండబెట్టుకుని జయేంద్ర సరస్వతి నీతి సూత్రాలను, ధర్మమార్గాలను వివరిం చారు.
మధ్య మధ్యలో మఠం నిర్వాహకులు ఇచ్చే హారతులు స్వీకరిస్తూ, గోవింద నామ సంకీర్తనల్లో గొంతు కలుపుతూ రాత్రంతా గడిపారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతిక కాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాదికాలు ప్రారంభం అయ్యాయి.
బృందావన ప్రవేశం ఇలా...
మొదట స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్దంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, విశేష పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎల్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చుండబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం మహాస్వామిగా చెప్పే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమాధి బృందావన మండపంలోనే ఉంది. దానికి కాస్త దిగువన జయేంద్ర సరస్వతి సమాధికి ఏర్పాట్లు చేశారు.
మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ఇందులో పూలు, చందనం, ఇతర సుగంధ ద్రవ్యాలను నింపారు. ఆపైన ఉదయం 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం జరిపారు. కుర్చీతో సహా అలాగే స్వామివారిని గొయ్యిలో కూర్చుండబెట్టి మట్టితో సమాధి చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. ఈ తంతును చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, శిష్యులు ఆసక్తి చూపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది.
తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు...
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్, మాజీ మంత్రి సదానందగౌడలు కంచి మఠానికి చేరుకుని స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రణమిల్లి ప్రధాని కార్యాలయం భక్తిపూర్వకంగా పంపిన ప్రత్యేక పుష్ఫగుచ్ఛాలను అందజేశారు. తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ స్వామి వారిని కడసారి దర్శించి నివాళులు అర్పించారు. తమిళనాడు బీజేపీ నేతలు సౌందరరాజన్, హెచ్. రాజా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్యన్ తదితరులు స్వామీ వారిని దర్శించిన వారిలో ఉన్నారు.
ఆయన ప్రజ్వరిల్లే ధార్మికజ్యోతి..
ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రభోదాలను వివరించే కంచి మఠం ధార్మిక జ్యోతి జయేంద్ర సరస్వతని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆయన డాలర్ శేషాద్రితో కలిసి కంచి శంకర మఠానికి విచ్చేశారు. జయేంద్ర స్వామి భౌతిక కాయాన్ని దర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భక్తిపూర్వకంగా తెచ్చిన వరివట్టం, చందన కట్టలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జయేంద్ర సరస్వతి తిరుమల వచ్చినపుడల్లా ముఖ్యమైన సూచనలు ఇచ్చేవారనీ, శాంత స్వభావం, మృదుభాషిత్వం ఆయన స్వభావమని కొనియాడారు. ఇటీవల తిరుమల యాగానికి వచ్చినపుడు చివరిసారిగా చూశానని చెప్పారు. భక్తుల హృదయాల్లో చిరస్తాయిగా వెలిగే ధార్మిక జ్యోతిగా జయేంద్ర సరస్వతిని అభివర్ణించారు.
అత్యంత బాధాకరం...
కంచి స్వామి జయేంద్ర సరస్వతి కన్నుమూయడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన కంచి స్వామి భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
(కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)