karate Academy
-
కరాటే వచ్చినా కాపాడుకోలేకపోయాడు..
బంజారాహిల్స్: పాత కక్షలతో ఓ కరాటే కోచ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..దమ్మాయిగూడకు చెందిన ఎండీ జహంగీర్ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న అతను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన పహాడీషరీఫ్‌కు చెందిన హఫీజ్, ఎజాజ్, ఒమర్బిన్, అహ్మద్, షేక్ సల్మాన్ తడితో గొడవపడ్డారు. హఫీజ్ పాత కక్షలతో జహంగీర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. మిగతా వారు కూడా అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జహంగీర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్‌కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్‌తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. -
హైదరాబాద్‌కు ‘పవర్ రేంజర్స్’...
‘పవర్ రేంజర్స్’.. ఈ నెల హైదరాబాద్ నగరంలో రియల్ హీరోలు వీళ్లే.. కరాటే కిక్‌లు మెుదలుకొని తక్షణ ఆత్మరక్షణ విన్యాసాల వరకు.. అద్భుతమైన ప్రదర్శనతో అలరించేందుకు వస్తున్నారు ‘పవర్ రేంజర్స్’. బోలెడంత ఫన్... బోలెడంత అడ్వెంచర్‌తో ‘సిటీ’జనులను అలరించనున్నారు. ఇజ్జత్‌నగర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అక్టోబర్ 11, 12 తేదీల్లో ఏర్పాటవుతున్న ‘కామిక్ కాన్’ కార్యక్రవుంలో ‘పవర్ రేంజర్స్’ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. -
క్రీడల్లో రాణిస్తే ప్రోత్సాహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించిన తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించేలా చూస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఫౌండేషన్, షాట్‌కాన్ కరాటే అకాడమీ, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించిన తైక్వాండో గ్రేట్ కిక్స్ విన్యాసానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది రికార్డు విజేతలకు డిప్యూటీ సీఎం సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండోకు క్రీడల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ సమాజం రేపటి విశ్వంతో పోటీపడుతుందన్నారు. విశ్వవ్యాప్తమైన మార్షల్ ఆర్ట్స్‌లో నగరవాసులు రాణించాలన్నారు. ఒక గంటలో కాళ్లతో 54,127 కిక్స్‌తో గిన్నిస్‌బుక్‌లో కొత్త రికార్డును నమోదు చేశారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి మాట్లాడుతూ తమ క్రీడాకారులు నెలకొల్పిన రికార్డును నమోదు చేసినట్లు గిన్నిస్‌బుక్ ధ్రువీకరణ పత్రాలు పంపారని చెప్పాడు. సభ ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వి.నరేందర్, బి. కృష్ణగౌడ్, ఎ. భరత్, ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.