బాత్రూంలో నక్కిన కుక్క.. ఇంతలో చిరుత ఎంట్రీ
బెంగళూరు: కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో బుధవారం ఓ వీధి కుక్కతో పాటు చిరుత పులి దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి యజమానురాలు బాత్రూం వెళ్దామని డోర్ తీయగా చిరుత, దాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్న వీధి కుక్క దర్శనమివ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె.. డోర్‌కు గొల్లెం పెట్టి, పోలీసులకు సమాచారం చేరవేసింది. ఇంతకీ ఈ రెండు జంతువులు మరుగుదొడ్డిలోకి ఎలా చేరాయని ఆరా తీస్తే.. గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్క, అనుకోని అతిధి చిరుత కంట పడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వీధి కుక్క.. సమీపంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో దాక్కుంది. ఆ కుక్క హమ్మయ్యా అనుకునే లోపు చిరుత దాన్ని వెంబడిస్తూ అదే బాత్రూంలోకి చేరింది.
చిరుతను దగ్గరగా చూసిన కుక్క భయంతో వణికిపోతుండగా, ఇప్పుడెలా తప్పించుకుంటావు అన్నట్టుగా చిరుత గంభీరంగా కుక్క వైపు చూస్తుంది. ఇంతలో ఇంటి యజమానురాలు బాత్రూం డోర్ తీసి, పోలీసులకు సమాచారమిచ్చింది. హుటాహుటిన రంగప్రవేశం చేసిన పోలీసులు.. పులి బారి నుండి కుక్కను రక్షించి, పులిని బంధించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బాత్రూం పైకప్పును తొలగించి రెస్క్యూ అపరేషన్ చేపడుతుండగా.. చిరుత అమాంతంపైకి ఎగిరి, గోడల మీదుగా దూకుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ మొత్తం సన్నివేశాలన్నీ బాత్రూం డోర్ మధ్య సందుల్లో నుంచి స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.