Kashmir dispute
-
శాంతికి సిద్ధం.. కశ్మీర్ కీలకం!
ఇస్లామాబాద్: భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కీలమైన కశ్మీర్ వివాదం సహా అన్ని అంశాలపై ఇరుదేశాల నేతలు పరిష్కారం కుదుర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. 2016లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఇంతవరకు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అనంతరం కుల్‌భూషణ్ జాధవ్ అనే మాజీ నేవీ అధికారిని భారత నిఘా అధికారి అని ఆరోపిస్తూ.. ఆయనకు పాక్ కోర్టు మరణశిక్ష విధించడంతో పరిస్థితులు జఠిలంగా మారాయి. కశ్మీర్ అంశంపై.. ‘ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి’ అని ఇమ్రాన్ అన్నారు. రెండు దేశాల మధ్య కశ్మీర్ ఒక్కటే కీలకమైన అంశం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరుదేశాలు సిద్ధం కావాలి. 30 ఏళ్లుగా భారత ఆర్మీ ద్వారా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇరుదేశాల ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ఈ సమస్యపై అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటకే వస్తున్నాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సంబంధాలపై ‘ఒకవేళ భారత నాయకత్వం కోరుకుంటే.. ఆ దేశంతో సంబంధాలు బలోపేతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దానికి భారత్‌దే బాధ్యతని.. అలాగే కశ్మీర్లో జరుగుతున్న ఘటనలకు పాకిస్తాన్ బాధ్యతంటూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం సరికాదు. ఇలాంటి ఆరోపణలతో మనం వృద్ధి చెందలేం. ఇవి ఉపఖండానికి చేటుచేస్తాయి. భారత్–పాకిస్తాన్ సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. రెండు దేశాలు ఆర్థికంగా సమృద్ధి చెందుతాయి’ అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. భారత మీడియాపై.. తనపై భారత మీడియా పేర్కొంటున్న కథనాలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్ సినిమాల్లో విలన్ మాదిరిగా చిత్రీకరిస్తోంది. ఆ వార్తలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే ఓ పాకిస్తానీని నేను. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్ అంతా చుట్టేశాను. భారత్, భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మనం కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరికాన్ని పారద్రోలవచ్చు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీర్. ఈ అంశంపై రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలి’ అని అన్నారు. చైనా, అరేబియా దేశాలతో దోస్తీ అమెరికాతో సత్సంబంధాలతో పాక్‌కు మేలు జరుగుతుంది. అమెరికాకు పాక్‌తో బంధాలు కాపాడుకోవడం అవసరం. ఇది పరస్పర ప్రయోజనాల అంశం. ఇరాన్, సౌదీ అరేబియాలతోనూ మా దోస్తీ కొనసాగుతుంది. చైనాతో మా బంధాలను బలోపేతం చేసుకుంటాం. చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి వారు మాకో అవకాశాన్ని కల్పించారు. అవినీతిపై యుద్ధం, ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో చైనా నుంచి మేం చాలా నేర్చుకుంటాం. ఉగ్రవాదంపై పోరు కారణంగా అఫ్గనిస్తాన్ నష్టపోయింది. ఆ దేశంలో శాంతి నెలకొనటమంటే పాక్‌లో శాంతి నెలకొన్నట్లే’ అని అన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా! న్యూఢిల్లీ: ఆర్మీ అండదండలతో ప్రస్తుత పాక్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని నిరసించేవారు. కొద్దికాలానికే సైన్యంపై తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడంతో తాజాగా పాక్ ప్రధాని పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో ఖాన్ మాట్లాడుతూ.. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటాన్ని మీరు చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ 35 సీట్లతో చతికిలపడింది. కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ పాక్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం ఎన్నికల ఫలితాలే కాదు.. ఈ ఐదేళ్లలో ఆర్మీ పట్ల ఇమ్రాన్ అభిప్రాయం, వ్యవహారశైలి మారాయి. ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ ఇంటర్వ్యూలో. ‘అది పాక్ ఆర్మీయే తప్ప శత్రు దేశపు సైన్యం కాదు. నేను ఆర్మీని కలుపుకునిపోతాను’ అని అన్నారు. భారత్‌పైనా ఇమ్రాన్ అభిప్రాయాలు మారాయి. గతంలో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలో భారత్ షరీఫ్‌తో కలసి పాక్ సైన్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రచేస్తోందన్నారు. కశ్మీర్లో భారత సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. మదీనాలా పాక్ పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ పాక్‌ను మదీనా తరహాలో అభివృద్ధి చేస్తానని ఇమ్రాన్ అన్నారు. ‘మహ్మద్ ప్రవక్త స్ఫూర్తితో పాకిస్తాన్‌ను మదీనాగా మారుస్తా. మానవత్వం పరిమళించే దేశంగా మారుస్తా. నేను చేపట్టే సంక్షేమపథకాలు ధనికుల కోసం కాదు. పేద ప్రజలకోసమే. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తాం. విలాసవంతమైన పాకిస్తాన్ ప్రధాని నివాసంలో నేనుండను. దాన్ని విద్యాకేంద్రంగా మారుస్తా’ అని అన్నారు. -
కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చ!
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు. -
కాశ్మీరొక్కటే సమస్య కాదు
భారత్‌తో సంబంధాలపై పాక్ హైకమిషనర్ బాసిత్ హైదరాబాద్: భారత్, పాక్‌ల మధ్య కాశ్మీర్ అంశం ఒక్కటే సమస్య కాదని, పది వివిధ అంశాలపై చర్చలు జరగాల్సిన అవసరముందని భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. గతంలో కాశ్మీర్ వివాదం పరిష్కారమయ్యే వరకు మిగతా చర్చలకు ఆస్కారం లేని పరిస్థితి ఉండేదని, అప్పటితో పోల్చితే ఇప్పుడెంతో ముందడుగు వేశామని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్, పాక్ మధ్య గత ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం రద్దయినప్పటినుంచీ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని గుర్తు చేశారు. పాక్‌ను ఉగ్రవాదపీడిత దేశంగా అభివర్ణించారు. ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ 2015 నుంచి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లోగా ఆరు సిరీస్‌ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, జర్నలిస్టు నాయకుడు దేవుల పల్లి అమర్, ప్రెస్‌కౌన్సిల్ సభ్యుడు అమర్నాథ్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఆతిథ్యాన్ని మరిచిపోలేను హైదరాబాద్ నగరం తానూహించిన దానికంటే ఎంతో అందంగా ఉందంటూ బాసిత్ కితాబిచ్చారు. ‘‘భారత్‌లో బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నగరానికొచ్చాను. ఇక్కడి సంస్కతీ సంప్రదాయాలకు నగరం అద్దం పడుతోంది. మరచిపోలేనంత ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చింది. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాల రుచిని ఎప్పటికీ మరిచిపోలేను’’ అన్నారు. ఆదివారం ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ నివాసంలో ఏర్పాటు చేసిన విందులో బాసిత్ పాల్గొన్నారు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ మాట్లాడారు. -
మరోసారి కాశ్మీర్ వివాదం!
దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలు కనీసం ఎన్నికల సమయంలోనైనా చర్చకొస్తాయని భావించినవారికి నిరాశే మిగిలింది. ఎన్నికల ప్రచారమంతా యథాప్రకారం వ్యక్తిగత విమర్శలతో, పరస్పర నిందలతో నిండిపోయింది. ఆర్ధిక మాంద్యం, అధిక ధరలు, అవినీతి, కాశ్మీర్, తీవ్రవాదంవంటివి పార్టీల మేనిఫెస్టోల్లో ఉండిపోయాయి తప్ప అరుదుగా కూడా చర్చల్లో చోటుచేసుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ చేసిన ప్రకటన తీవ్ర కలకలం సృష్టించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన వద్దకు ఇద్దరు దూతలను పంపారని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయపడమని కోరారని ఆ ప్రకటన సారాంశం. నరేంద్రమోడీతో నేరుగా మాట్లాడదల్చుకుంటే అందుకు వీలుకల్పిస్తామని కూడా ఆ వచ్చినవారు చెప్పారట. మోడీ వంటి వ్యక్తితో తాను మాట్లాడబోనని చెప్పానని గిలానీ అంటున్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే బీజేపీ నేతలు అప్రమత్తమై అదంతా ఉత్తదేనని ఖండించారు. ఆ వచ్చినవారి పేర్లు, ఇతర వివరాలు గిలానీ బయటపెట్టాలని డిమాండుచేశారు. కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని, దానిపై చర్చించాల్సింది ఏమీ లేదని కూడా చెప్పారు. గిలానీ ప్రకటనలో మరికొన్ని సంగతులున్నాయి. మోడీ దూతలు తనతోపాటు కాశ్మీర్‌కు చెందిన ఇతర నేతలను కూడా కలిశారని వివరించారు. బీజేపీ నేతలు గిలానీని కలవలేదని చెప్పారు తప్ప ఇతర నాయకులను కలవడానికి సంబంధించి ఆయన చేసిన ప్రస్తావనపై మాత్రం మౌనంగానే ఉండిపోయారు. మొత్తానికి గిలానీ మాటల్లోని నిజానిజాల సంగతలా ఉంచి కాశ్మీర్ సమస్య ప్రాధాన్యతను ఈ వివాదం మరోసారి తెరపైకి తెచ్చింది. కాశ్మీర్ గురించి చర్చించాల్సింది ఏమీ లేదని అన్నంతమాత్రాన ఆ సమస్య సమసిపోదు. నిజానికి ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కన్నా వివరంగా తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది బీజేపీయే. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుకు తాము కట్టుబడి ఉన్నట్టు చెబుతూనే ఆ విషయమై సంబంధిత భాగస్వాములందరితో మాట్లాడతామని బీజేపీ వాగ్దానం చేసింది. పాక్ అక్రమిత కాశ్మీర్‌కు శరణార్థులుగా వెళ్లినవారు వెనక్కొస్తామంటే పరిశీలిస్తామని అన్నది. ఉగ్రవాదం కారణంగా రాష్ట్రాన్ని వదిలివెళ్లిన కాశ్మీరీ పండిట్లు వెనక్కివచ్చేందుకు కృషిచేస్తామన్నది. 370వ అధికరణం తొలగింపు గురించి ఇన్నేళ్లూ మాట్లాడిన బీజేపీ ఆ విషయంలో చర్చిస్తామని మొట్టమొదటిసారి హామీ ఇచ్చింది. మిగిలిన అంశాలు పరిష్కారం కావాలన్నా అందరితోనూ మాట్లాడవలసిందే. మరి గిలానీ చేసిన ప్రకటన సరిగాదని చెప్పడం వరకూ సరేగానీ...అసలు చర్చించేదేలేదని అనవలసిన అవసరమేమిటి? మోడీపై తమకు చాలా ఆశలున్నాయని, కాశ్మీర్ విషయంలో వాజపేయి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన మరింతగా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉన్నదని ఇటీవలే ఉదారవాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ ఫరూఖ్ ప్రకటించారు. తనతోపాటు మిగిలిన కాశ్మీరీ నేతలను కూడా మోడీ దూతలు కలిశారని గిలానీ అన్న నేపథ్యంనుంచి దీన్ని గమనిస్తే బీజేపీ అలాంటి ప్రయత్నాలు ప్రారంభించిందన్న అభిప్రాయం కలుగుతుంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి కాశ్మీర్ మండుతూనే ఉన్నది. అక్రమ నిర్బంధంగురించో, లాకప్ డెత్‌ల గురించో పౌరులు నిరసనలకు దిగితే... ఉగ్రవాదులు ఎక్కడో దాడిచేస్తే మీడియాలో ఆ రాష్ట్రం ప్రస్తావనకొస్తుంది తప్ప మిగిలిన సమయాల్లో ఆ సమస్య ఎవరికీ గుర్తుకు రాదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా ప్రధాన జాతీయ పార్టీలకు ఈ సమస్య పట్టదు. తాము అధికారంలోకొస్తే ఏం చేస్తామో విపక్షమూ చెప్పదు. ఇన్నేళ్లుగా చేసిందేమిటో అధికార పక్షమూ వివరించదు. నాలుగేళ్లక్రితం యూపీఏ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యపై ఒక ప్రయత్నం చేసింది. అప్పటి హోంమంత్రి చిదంబరం నేతృత్వంలో అక్కడికి అఖిలపక్ష పార్లమెంటరీ బృందాన్ని పంపింది. ఆ బృందం వివిధ రాజకీయ పక్షాలతో, వేర్పాటువాద నేతలతో సంభాషించింది.సాధారణ ప్రజానీకం ఏమనుకుంటున్నదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించింది. సరిగ్గా అప్పటికి కాశ్మీర్ ఎన్నడూలేనంత స్థాయిలో ఆగ్రహజ్వాలలతో రగులుతున్నది. అటు తర్వాత మధ్యవర్తుల కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ వివిధ వర్గాల ప్రజలను, రాజకీయ పక్షాలనూ కలిసి నివేదిక సమర్పించింది. అది జరిగి మూడేళ్లవుతున్నా దానిపై తీసుకున్న తదుపరి చర్యలు శూన్యం. ఇప్పుడు గిలానీ చేసిన ప్రకటన నిజం కావొచ్చు... కాకపోవచ్చు. మీర్వాయిజ్ చెబుతున్నట్టు అది మిగిలిన కాశ్మీరీ నేతలపై బురదజల్లడా నికి ఉద్దేశించింది కావొచ్చు. కానీ, ఆ సంక్షుభిత రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడాలనీ, అది మళ్లీ భూతల స్వర్గంలా రూపుదిద్దుకోవాలని ఆశించనివారుండరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశిస్తున్నట్టు సైనిక బలగాలకు ప్రత్యేకాధికారాలిచ్చే చట్టాన్ని కొన్ని ప్రాంతాలనుంచి అయినా ఉపసంహరించడం దగ్గరనుంచి తరచుగా జరిగే మానవహక్కుల ఉల్లంఘనలను నిరోధించడంవరకూ ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాశ్మీర్ విషయంలో ఉదారవాదులు మొదలుకొని అతివాదుల వరకూ అనేకులు అనేక డిమాండ్లు చేస్తున్నారు. వీటన్నిటినీ పరిశీలించి ఒక మానవీయ పరిష్కారాన్ని అన్వేషించడానికి చిత్తశుద్ధి, దృఢ సంకల్పం అవసరం. అలాంటి పరిష్కారం సాధ్యం కావాలంటే వివిధ పక్షాల నేతలను కలవడం, పరస్పరం అభిప్రాయాలను తెలుసుకోవడం ముఖ్యం. గిలానీ చేసిన ప్రకటనలోని ఆంతర్యమేమైనప్పటికీ ఆ తరహా ప్రయత్నాలు తప్పేమీ కాదని బీజేపీ గుర్తించాలి.