మరోసారి కాశ్మీర్ వివాదం! | once again Kashmir dispute, | Sakshi
Sakshi News home page

మరోసారి కాశ్మీర్ వివాదం!

Published Sun, Apr 20 2014 1:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

once again Kashmir dispute,

 దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలు కనీసం ఎన్నికల సమయంలోనైనా చర్చకొస్తాయని భావించినవారికి నిరాశే మిగిలింది. ఎన్నికల ప్రచారమంతా యథాప్రకారం వ్యక్తిగత విమర్శలతో, పరస్పర నిందలతో నిండిపోయింది. ఆర్ధిక మాంద్యం, అధిక ధరలు, అవినీతి, కాశ్మీర్, తీవ్రవాదంవంటివి పార్టీల మేనిఫెస్టోల్లో ఉండిపోయాయి తప్ప అరుదుగా కూడా చర్చల్లో చోటుచేసుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ చేసిన ప్రకటన తీవ్ర కలకలం సృష్టించింది.
 
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన వద్దకు ఇద్దరు దూతలను పంపారని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయపడమని కోరారని ఆ ప్రకటన సారాంశం. నరేంద్రమోడీతో నేరుగా మాట్లాడదల్చుకుంటే అందుకు వీలుకల్పిస్తామని కూడా ఆ వచ్చినవారు చెప్పారట. మోడీ వంటి వ్యక్తితో తాను మాట్లాడబోనని చెప్పానని గిలానీ అంటున్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే బీజేపీ నేతలు అప్రమత్తమై అదంతా ఉత్తదేనని ఖండించారు. ఆ వచ్చినవారి పేర్లు, ఇతర వివరాలు గిలానీ బయటపెట్టాలని డిమాండుచేశారు.
 
కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని, దానిపై చర్చించాల్సింది ఏమీ లేదని కూడా చెప్పారు. గిలానీ ప్రకటనలో మరికొన్ని సంగతులున్నాయి. మోడీ దూతలు తనతోపాటు కాశ్మీర్‌కు చెందిన ఇతర నేతలను కూడా కలిశారని వివరించారు. బీజేపీ నేతలు గిలానీని కలవలేదని చెప్పారు తప్ప ఇతర నాయకులను కలవడానికి సంబంధించి ఆయన చేసిన ప్రస్తావనపై మాత్రం మౌనంగానే ఉండిపోయారు. మొత్తానికి గిలానీ మాటల్లోని నిజానిజాల సంగతలా ఉంచి కాశ్మీర్ సమస్య ప్రాధాన్యతను ఈ వివాదం మరోసారి తెరపైకి తెచ్చింది.
 
కాశ్మీర్ గురించి చర్చించాల్సింది ఏమీ లేదని అన్నంతమాత్రాన ఆ సమస్య సమసిపోదు. నిజానికి ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కన్నా వివరంగా తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది బీజేపీయే. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుకు తాము కట్టుబడి ఉన్నట్టు చెబుతూనే ఆ విషయమై సంబంధిత భాగస్వాములందరితో మాట్లాడతామని బీజేపీ వాగ్దానం చేసింది. పాక్ అక్రమిత కాశ్మీర్‌కు శరణార్థులుగా వెళ్లినవారు వెనక్కొస్తామంటే పరిశీలిస్తామని అన్నది.
 
 ఉగ్రవాదం కారణంగా రాష్ట్రాన్ని వదిలివెళ్లిన కాశ్మీరీ పండిట్లు వెనక్కివచ్చేందుకు కృషిచేస్తామన్నది. 370వ అధికరణం తొలగింపు గురించి ఇన్నేళ్లూ మాట్లాడిన బీజేపీ ఆ విషయంలో చర్చిస్తామని మొట్టమొదటిసారి హామీ ఇచ్చింది. మిగిలిన అంశాలు పరిష్కారం కావాలన్నా అందరితోనూ మాట్లాడవలసిందే. మరి గిలానీ చేసిన ప్రకటన సరిగాదని చెప్పడం వరకూ సరేగానీ...అసలు చర్చించేదేలేదని అనవలసిన అవసరమేమిటి? మోడీపై తమకు చాలా ఆశలున్నాయని, కాశ్మీర్ విషయంలో వాజపేయి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన మరింతగా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉన్నదని ఇటీవలే ఉదారవాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ ఫరూఖ్ ప్రకటించారు.
 
తనతోపాటు మిగిలిన కాశ్మీరీ నేతలను కూడా మోడీ దూతలు కలిశారని గిలానీ అన్న నేపథ్యంనుంచి దీన్ని గమనిస్తే బీజేపీ అలాంటి ప్రయత్నాలు ప్రారంభించిందన్న అభిప్రాయం కలుగుతుంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి కాశ్మీర్ మండుతూనే ఉన్నది. అక్రమ నిర్బంధంగురించో, లాకప్ డెత్‌ల గురించో పౌరులు నిరసనలకు దిగితే... ఉగ్రవాదులు ఎక్కడో దాడిచేస్తే మీడియాలో ఆ రాష్ట్రం ప్రస్తావనకొస్తుంది తప్ప మిగిలిన సమయాల్లో ఆ సమస్య ఎవరికీ గుర్తుకు రాదు.
 
 
 కనీసం ఎన్నికల సమయంలోనైనా ప్రధాన జాతీయ పార్టీలకు ఈ సమస్య పట్టదు. తాము అధికారంలోకొస్తే ఏం చేస్తామో విపక్షమూ చెప్పదు. ఇన్నేళ్లుగా చేసిందేమిటో అధికార పక్షమూ వివరించదు. నాలుగేళ్లక్రితం యూపీఏ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యపై ఒక ప్రయత్నం చేసింది. అప్పటి హోంమంత్రి చిదంబరం నేతృత్వంలో అక్కడికి అఖిలపక్ష పార్లమెంటరీ బృందాన్ని పంపింది. ఆ బృందం వివిధ రాజకీయ పక్షాలతో, వేర్పాటువాద నేతలతో సంభాషించింది.సాధారణ ప్రజానీకం ఏమనుకుంటున్నదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించింది. సరిగ్గా అప్పటికి కాశ్మీర్ ఎన్నడూలేనంత స్థాయిలో ఆగ్రహజ్వాలలతో రగులుతున్నది. అటు తర్వాత మధ్యవర్తుల కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ వివిధ వర్గాల ప్రజలను, రాజకీయ పక్షాలనూ కలిసి నివేదిక సమర్పించింది. అది జరిగి మూడేళ్లవుతున్నా దానిపై తీసుకున్న తదుపరి చర్యలు శూన్యం.
 
ఇప్పుడు గిలానీ చేసిన ప్రకటన నిజం కావొచ్చు... కాకపోవచ్చు. మీర్వాయిజ్ చెబుతున్నట్టు అది మిగిలిన కాశ్మీరీ నేతలపై బురదజల్లడా నికి ఉద్దేశించింది కావొచ్చు. కానీ, ఆ సంక్షుభిత రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడాలనీ, అది మళ్లీ భూతల స్వర్గంలా రూపుదిద్దుకోవాలని ఆశించనివారుండరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశిస్తున్నట్టు సైనిక బలగాలకు ప్రత్యేకాధికారాలిచ్చే చట్టాన్ని కొన్ని ప్రాంతాలనుంచి అయినా ఉపసంహరించడం దగ్గరనుంచి తరచుగా జరిగే మానవహక్కుల ఉల్లంఘనలను నిరోధించడంవరకూ ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
కాశ్మీర్ విషయంలో ఉదారవాదులు మొదలుకొని అతివాదుల వరకూ అనేకులు అనేక డిమాండ్లు చేస్తున్నారు. వీటన్నిటినీ పరిశీలించి ఒక మానవీయ పరిష్కారాన్ని అన్వేషించడానికి చిత్తశుద్ధి, దృఢ సంకల్పం అవసరం. అలాంటి పరిష్కారం సాధ్యం కావాలంటే వివిధ పక్షాల నేతలను కలవడం, పరస్పరం అభిప్రాయాలను తెలుసుకోవడం ముఖ్యం. గిలానీ చేసిన ప్రకటనలోని ఆంతర్యమేమైనప్పటికీ ఆ తరహా ప్రయత్నాలు తప్పేమీ కాదని బీజేపీ గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement