కొన్ని పాత్రలు కొందరికి నప్పవు. వారణాసిలో బీజేపీ ‘బాధితపక్షం’గా గురువారం నిర్వహించిన ధర్నా అలాంటిదే. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న ఆ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ప్రాంజల్ యాదవ్ పట్టణంలో పార్టీ నిర్వహించతల పెట్టిన కార్యక్రమాల్లో ఒకదానికి అనుమతి నిరాకరించడం ఈ ధర్నాకు ప్రధాన కారణం. నగరంలోని బేనియాబాగ్ ప్రాంతంలో పార్టీ ర్యాలీని ఆయన కాదన్నారు. మిగిలిన పార్టీలను అనుమతించిన ప్రాంతంలో తమను ఎందుకు వద్దంటున్నారన్నది బీజేపీ సంధిస్తున్న ప్రశ్న. ఇలా ప్రశ్నించడం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో అసంగతమేమీ లేదు. కానీ, బీజేపీ చేసింది వేరు. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే కాచుక్కూర్చున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, అమిత్ షాల ఆధ్వర్యంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్ని కల సంఘం కార్యాలయం వద్దకూడా నిరసన ప్రదర్శన చేశారు. అంతేకాదు... నరేంద్ర మోడీ బీహెచ్‌యూ వద్ద హెలికాప్టర్‌లో దిగగా అక్కడినుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని బీజేపీ ప్రధాన ఎన్నికల కార్యాలయం వరకూ అనుమతి లేకుండానే, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎంతో పాలనానుభవం ఉన్న బీజేపీ వంటి పార్టీ నిజానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ అడిగిన అయిదు కార్యక్రమాల అనుమతుల్లో ఎన్నికల సంఘం కాదన్నది ఒక్క బేనియా బాగ్ ర్యాలీని మాత్రమే. అనుమతించినవాటిలో ‘గంగాహారతి’ కార్యక్రమం ఉన్నా దాన్ని కూడా ఎన్నికల సంఘం ఒప్పుకోలే దని మోడీ ఎందుకు అనాల్సివచ్చిందో తెలియదు. పార్టీ నేతలు ఆయనకు సరైన సమాచారం ఇచ్చి ఉండకపోవచ్చేమోగానీ బేనియా బాగ్ ర్యాలీని నిరాకరించాక బీజేపీయే గంగాహారతితో సహా అన్నిటినీ రద్దుచేసుకుని నిరసన ప్రదర్శనకు దిగింది. ర్యాలీని నిరాకరించడంలో ప్రాంజల్ యాదవ్ పొరపాటు చేసివుం డొచ్చు. అంతకుముందు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వగైరాలను అనుమతించినప్పుడు మోడీని కాదనడం వివక్ష చూపడమే కావొచ్చు. కానీ, అందుకు దారితీసిన పరిస్థితులగురించి ఆయన చెబుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి. బేనియాబాగ్‌లో అల్లరి జరిగే అవకాశమున్నదని గుజరాత్ ఇంటెలిజెన్స్ విభాగం అందజేసిన సమాచారమూ, 1991లో అదే ప్రాంతంలో బీజేపీ సమావేశం జరిగాక ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులనూ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానన్నది ప్రాంజల్ యాదవ్ వాదన. పైగా 25,000 మంది పట్టే ఆ మైదానం వద్ద బీజేపీ లక్షమందితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నదని ఆయన చెబుతున్నారు. ఆయన అభిప్రాయం ఎలావున్నా బీజేపీకి తన నిర్ణయాన్ని తెలియజేయడంలో ప్రాంజల్ యాదవ్ జాప్యంచేశారు. ఈ జాప్యంపై బీజేపీ వెనువెంటనే ఢిల్లీలోని తమ నేతల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసివుండొచ్చు.
తమకు న్యాయం జరిగేలా చూడమని డిమాండ్ చేయవచ్చు. కానీ, ఫిర్యాదు మార్గాన్ని వదిలిపెట్టి బీజేపీ ఆరోపణలకూ, ‘రోడ్ షో’కూ దిగింది. కేవలం ‘రాజకీయ ఒత్తిళ్ల’పర్యవసానంగానే తమ పార్టీకి అనుమతి నిరాకరించారని చెప్పడమే కాక ‘భద్రత కల్పించలేకపోతే ఎన్నికలు నిర్వహించడం మానేయండ’ని అరుణ్ జైట్లీ అంతటి సీనియర్ నాయకుడు ఎన్నికల సంఘానికి సలహా ఇచ్చారు. కేవలం ఒక ఉదంతం ఆధారం చేసుకుని తమ పార్టీకి తీరని అన్యాయమేదో జరిగిపోయిందని చిత్రించడం మంచిది కాదు. వ్యక్తులుగా కొందరు అధికారులు రాగద్వేషాలతో ఉండొచ్చుగానీ మొత్తంగా ఎన్నికల సంఘం వ్యవహారశైలి మొదటినుంచీ తటస్థంగా ఉంటున్నది. ఏ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందని తేలినా అది తగిన చర్యలకు ఉపక్ర మిస్తూనే ఉన్నది. తన సచ్చీలతను నిరూపించుకుంటున్నది. ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించడానికి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని గుర్తించి, ప్రతి అనుభవంనుంచి ఆ సంస్థ కొత్త కొత్త పాఠాలు నేర్చుకుని తన పనితీ రును మెరుగుపరుచుకుంటున్నది. ఎన్నికల సంఘంవంటి రాజ్యాం గపరమైన సంస్థలను ఏదైనా అనేముందు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. బీజేపీ అతిగా స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీ మదిలో బేనియాబాగ్ వివాదంకంటే ఇతరేతర అంశాలు...ముఖ్యంగా మోడీపై ఎన్నికల సంఘం రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయించడంవంటివి ఉన్నాయనిపిస్తుంది.
ఎన్నికల్లో ఎదుటి పక్షాన్ని అధిగమించి తామే విజేతగా నిలవాలన్న తహతహతో నాయకులు ఒకరిని మించి మరొకరు ఆరోపణలు చేసుకోవడం, పరస్పర నిందలకు దిగడం రాను రాను పెరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనబడింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైగానీ, రాజకీయపక్షాల ఆర్ధిక విధానాలపైగానీ సరైన చర్చ జరగలేదు. ఈ దుస్థితిని సరిదిద్దడమెలాగో తెలియక అందరూ ఆందోళనపడుతుంటే బీజేపీ వంటి బాధ్యతగల పార్టీ ఎన్నికల సంఘా న్ని అప్రదిష్టపాలు చేయాలని చూడటం సరికాదు. ప్రాంజల్ యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టకుండానే, దాన్ని చేరేయడంలో జరిగిన జాప్యంపై ఎన్నికల సంఘం కూడా అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతే కాక, వారణాసికి ప్రత్యేక పరిశీలకుణ్ణి నియమించడం ద్వారా ఆయనను దాదాపు పక్కనబెట్టింది. ఇప్పటికైనా బీజేపీ ‘బాధితపక్షం’గా తనను తాను చిత్రించుకోవడాన్ని, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలకు దిగడాన్ని విరమించుకోవాలి. మోతాదుకు మించి చేస్తే ఏదైనా వికటిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఇంత రాద్ధాంతమా?
Published Sat, May 10 2014 11:35 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement