ఎన్నికల సమరానికి మోడీ ఎజెండా! | BJP ready to polls with Narendra Modi agenda | Sakshi
Sakshi News home page

ఎన్నికల సమరానికి మోడీ ఎజెండా!

Published Tue, Jan 21 2014 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

BJP ready to polls with Narendra Modi agenda

యుద్ధానికి సన్నద్ధమయ్యేవారికి వ్యూహమూ, ఎత్తుగడలు ఉండాలి. వాటిని సరిగా అమలుపరిచే తెలివితేటలూ ఉండాలి. సమయాన్ని, సందర్భాన్ని చూసుకోవాలి. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ బీజేపీ నిర్వహించిన జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం గమనిస్తే ఆ యుద్ధ సన్నద్ధత ఆయనకు పుష్కలంగా ఉన్నట్టు సులభంగానే బోధపడుతుంది. దేశ ప్రజలకు బంగారు భవిష్యత్తును వాగ్దానం చే స్తూ సాగిన ఆ ప్రసంగంలో అతిశయోక్తులు ఉండవచ్చు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఉండవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతివంటి కీలకమైన అంశాలపై దాటవేత వైఖరినే అవలంబించి ఉండవచ్చు. కానీ, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి, దేశ ప్రజలంతా తమ వెనక కేంద్రీకృతం కావడానికి ఏ ఏ అంశాలను స్పృశించాలో మోడీకి బాగా తెలుసు. ఇన్నాళ్లూ కళ్లల్లో వత్తులు వేసుకుని కాంగ్రెస్ తప్పులను గమనించి, విమర్శలు గుప్పించడంలో ఆరితేరిన మోడీ ఇప్పుడు వాటితోపాటు పాలనకు సంబంధించిన తన విజన్‌ను ప్రజలముందు పరిచారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలనూ, ఇటీవలి కాలంలో చర్చకొస్తున్న అంశాలనూ నరేంద్ర మోడీ ప్రస్తావించారు. వాటిపై తమ పార్టీ అభిప్రాయాలను వెల్లడించారు. ఉదాహరణకు బీజేపీకి అధికారమిస్తే దేశంలో సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేస్తామని మోడీ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం ముఖ్యమైన అంశాలపై రాష్ట్రాలను సంప్రదించిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సంప్రదాయాన్ని ఉల్లంఘించిన ఉదంతాలే ఎక్కువ. ఉదాహరణకు జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సీటీసీ) ఏర్పాటు విషయంలో యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రాలకు ఆగ్రహం కలిగించింది. కేంద్రం పెత్తందారీ పోకడలకూ, ఒంటెత్తు విధానాలకూ కాంగ్రెసేతర రాష్ట్రాలే కాదు... కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రాలకు సంబంధించిన శాంతిభద్రతల అంశంలో చొరబడటానికి మీరెవరని నిలదీశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే పెద్దన్న తరహాలో కాకుండా రాష్ట్రాలతో కలిసి ఒక టీంగా వ్యవహరిస్తామని మోడీ చెప్పారు.
 
  పట్టణీకరణ దేశాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య. పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు నానాటికీ దిగజారుతున్నాయి. పొట్టచేతబట్టుకుని నిత్యం వేలాదిమంది పట్టణాలకూ, నగరాలకూ వలసవస్తున్నారు. వారు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం సాగించవలసి వస్తున్నది. నరేంద్రమోడీ దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామంటున్నారు. పేదలకు సైతం అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా శాటిలైట్ సిటీలనూ, జంటనగరాలనూ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అయితే, ఇంత మాత్రంతోనే సరిపోదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంచగలగాలి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల పర్యవసానంగా దారుణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించాలి. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మోడీ చెబుతున్నా ఆ చర్య మాత్రమే వ్యవసాయ రంగ సంక్షోభాన్ని చల్లార్చలేదు. విత్తనాల దగ్గరనుంచి ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటివన్నీ నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. వాటిని అదుపుచేయగలగాలి. కుటీర పరిశ్రమలకు చేయూతనివ్వాలి. ఇవన్నీ చేస్తే పట్టణాలు, నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామీణప్రాంతాలు కళకళలాడతాయి. ఐఐటీ, ఐఐఎంవంటి ఉన్నతశ్రేణి విద్యా సంస్థలను స్థాపించడం, ఎయిమ్స్‌వంటి సంస్థను ప్రతి రాష్ట్రంలోనూ స్థాపించడంవంటివి మోడీ ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్తమోత్తమ విద్య, వైద్యం అందు బాటులోకి తీసుకురావాలన్న సంకల్పం మంచిదేగానీ, అనేకవిధాల నష్టపోయివున్న పల్లెటూళ్లను ఎలా బతికిస్తారో మోడీ చెప్పాలి. వాజపేయి హయాంలో బీజేపీ స్వర్ణ చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల విస్తరణకు నడుంకడితే ఇప్పుడు మోడీ బుల్లెట్ రైళ్ల ప్రవేశం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి హామీలు పట్టణప్రాంత మధ్యతరగతిని బాగానే ఊరిస్తాయి.
 
  ఇన్నాళ్ల ప్రచారం ఒక ఎత్తయితే, ఇకపై సాగబోయే ప్రచారయుద్ధం మరో ఎత్తు. మోడీకి ఈ సంగతి బాగా తెలుసు. ఎదురుదాడి మాట అటుంచి దెబ్బలు కాచుకోవడానికి కూడా దిక్కులేని స్థితిలో పడిపోయిన కాంగ్రెస్‌పై ఒంటికాలుతో లేవడం అలవాటైన మోడీ ఇకపై ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాలను ఆకర్షిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఆయన ప్రసంగంలోకి స్మార్ట్ సిటీలు, శాటిలైట్ సిటీలు, బుల్లెట్ రైళ్లు వచ్చిచేరాయి. అంతేకాదు... ఇన్నాళ్లూ మోడీ ప్రసంగాల్లో లేశమాత్రమైనా కనబడని సామాజికాంశం కూడా ప్రస్ఫుటంగా దర్శనమిచ్చింది. టీ అమ్ముకున్న వ్యక్తి అంటూ తనను ఎద్దేవాచేసిన కాంగ్రెస్ మొరటు వ్యాఖ్యలపై ఆయన ఓబీసీ కత్తిదూశారు. అగ్రవర్ణాల్లో పుట్టిన వ్యక్తితో వెనకబడిన కులాల వ్యక్తి పోటీపడటమే మిటన్న దుగ్ధ కాంగ్రెస్ వ్యాఖ్యల్లో కనబడుతున్నదని మోడీ అన్నారు. మాట్లాడేటపుడు కాస్త వెనకాముందూ ఆలోచించాలని కాంగ్రెస్‌కు అర్ధమై ఉండాలి. ఏఐసీసీ సదస్సు ఆద్యంతమూ పేలవంగా, నేతల రొటీన్ ప్రసంగాలతో గడిచిపోగా బీజేపీ జాతీయమండలి ఉత్సాహంతో ముగిసింది. కొత్త ఆలోచనలనూ, ప్రతిపాదనలనూ ప్రజలముందుంచింది. అందులోని లోటుపాట్లు ఇకపై విస్తృతంగా చర్చకొస్తాయి. మోడీ మాట్లాడినవే కాదు... వదిలేసిన విషయాలూ పరిశీలనకొస్తాయి. 2014 ఎన్నికలకు అవసరమైన ఎజెండాను అవి నిర్ణయిస్తాయి. పరస్పర నిందారోపణలకంటే భిన్న ఆలోచనల సంఘర్షణ ఎప్పుడైనా మంచిదే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement