ఉపాధ్యాయిని క్రూరత్వం
స్నానాల గదిలో విద్యార్థినుల నిర్బంధం
ఎ.కొండూరు కేజీవీబీలో ఘటన
విచారణ జరిపిన తహశీల్దారు
ఎ.కొండూరు (తిరువూరు) : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయిని క్రూరంగా ప్రవర్తించారు. తరగతులకు హాజరుకాలేదని ఆగ్రహించిన ఆమె పదో తరగతి విద్యార్థినులను స్నానాలగదిలో నిర్బంధించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మండల కేంద్రమైన ఎ.కొండూరులోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలో జరి గింది.
పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినులు దుర్గాభవాని, రాణి, ఝాన్సి, శ్వేత అనారోగ్యం కారణంగా ఆదివారం తరగతులకు హాజరుకాలేదు. ఆగ్రహించిన తెలుగు ఉపాధ్యాయిని, ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ అంజలీదేవి వారిని స్నానాల గదిలో నిర్బంధించి తాళంవేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ తాళం తీయలేదు. తమను వదిలిపెట్టాలని విద్యార్థినులు వేడుకున్నా ఉపాధ్యాయిని కనికరించలేదు.
దాహం వేస్తోందని, గాలి ఆడట్లేదని, దుర్వాసన భరించలేకున్నామని ఏడుస్తూ కేకలు వేసినా పట్టించుకోకపోగా, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది సైతం అటు వెళ్లకుండా అడ్డుకున్నారు. పాఠశాల వంటమనిషి శ్రీదేవి ఆ విద్యార్థినులకు సీసాతో మంచినీరందించారు. ఆ తరువాత తాళాలు తీయడంతో విద్యార్థినులు బయటకు వచ్చారు. తమను గదిలో నిర్బంధించిన విషయాన్ని విద్యార్థినులు చుట్టుపక్కల వారికి తెలి పారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయిని అంజలీదేవిని నిలదీయడంతో పిల్లలు సరిగా చదవనందునే తాను క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానని బదులిచ్చారు.
తహశీల్దారు విచారణ
సోమవారం పాఠశాలకు వచ్చిన ప్రత్యేకాధికారి వెంకటలక్ష్మి ఈ విషయాన్ని ఎ.కొండూరు తహశీల్దారు ప్రశాంతి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహశీల్దార్ కస్తూరిబాగాంధీ విద్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. బాధిత విద్యార్థినులు, వంటమనిషి, ఉపాధ్యాయినిని వేర్వేరుగా విచారించి జిల్లా ప్రాజెక్టు అధికారి, జీసీడీవోకు నివేదిక పంపారు. ఎంఈవో రాజశేఖర్ సీఆర్పీలతో కలిసి కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులను జరిగిన ఘటనపై విచారణ జరిపారు.
విద్యార్థినుల్లో భయాందోళనలు
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుకోడానికి వచ్చిన విద్యార్థినులపై ఉపాధ్యాయిని వేధింపుల వ్యవహారంతో మిగిలిన విద్యార్థినుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణంతో తరగతులకు హాజరు కాకపోతే దుర్వాసన వెదజల్లే గదిలో అక్రమంగా నిర్బంధించి శిక్షించడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాష్టీకంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.