అది రోడ్డు ప్రమాదమే
దేవి ఉదంతంపై కమిషనర్ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో జరిగిన కట్కూరి దేవి ఉదంతం రోడ్డు ప్రమాదమేనని తేలిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో అత్యాచారం, హత్య తదితర ఆరోపణలు రావడంతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఇద్దరు డీసీపీల నేతృత్వంలో దర్యాప్తు చేయించామన్నారు. వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఎ.వెంకటేశ్వరరావు, బి.లింబారెడ్డి, సైంటిఫిక్ ఆఫీసర్ వెంకన్న నాయక్‌తో కలసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు.
ఫేస్బుక్లో పరిచయం...
బీటెక్ విద్యార్థిని కె.దేవి, సామ భరత్‌సింహారెడ్డి రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా అయిన పరిచయం స్నేహంగా మారింది. గత నెల 30 రాత్రి గచ్చిబౌలి బీపీఎం (బీట్స్ పర్ మినిట్స్) పబ్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని భరత్ అతడి స్నేహితులు నిర్ణయించుకున్నారు. కామన్ ఫ్రెండ్ సోనాలీ అంగీకరించడంతో దేవి సైతం ఆ పార్టీకీ వస్తానని చెప్పింది. దేవి తన తల్లిదండ్రులతో సోనాలీతో వెళ్తున్నానని తెలపడంతో నిరంజన్‌రెడ్డి దేవిని సోనాలీ ఇంట్లో వదిలారు. సోనాలీ ఇంటికి వచ్చిన భరత్ వారిని తీసుకుని తన కారులో పబ్‌కు వెళ్లారు. తన తల్లికి ఫోన్ చేసిన దేవి ఆ రోజు రాత్రి సోనాలీ ఇంట్లోనే పడుకుంటానని చెప్పింది. అందుకు ఆమె అనుమతించలేదు. దీంతో సోనాలీ తనను ఇంటి వద్ద దింపుతుందని దేవి చెప్పారు.
ఒకటో తేదీ తెల్లవారుజామున 2.45 గంటలకు పబ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం దేవిని ఇంటి వద్ద దింపడానికి సోనాలీ సిద్ధమవ్వగా తిరస్కరించిన దేవి... తనను భరత్ డ్రాప్ చేస్తాడని చెప్పింది. భరత్ కారులో బయలుదేరిన దేవికి ఇంటి నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తున్నానంటూ చెప్పింది. తన ఇంటి సమీపంలోని రోడ్ నం.70 వద్దకు చేరుకున్న తర్వాత దేవి తన తండ్రి, సోనాలీకి కాన్ఫరెన్స్ కాల్ చేసి, తాను సోనాలీతో కలిసి వస్తున్నట్లు భావన కలిగించాలని యోచించింది. ఇందుకు తన ఇంటికి కొద్ది దూరంలో కారు ఆపమంది. ఆమె ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడంతో భరత్ ఫోన్ నుంచి ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
రెండు నిమిషాల్లో వస్తున్నా...
అదే సమయంలో తండ్రి నుంచి ఫోన్ అందుకున్న దేవి రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నానని చెప్పింది. నిరంజన్‌రెడ్డి తాను ఫ్లాట్ నుంచి కిందికి వస్తున్నానని చెప్పడంతో... అలా జరిగితే భరత్ ఆయన దృష్టిలో పడతారని, ఆలోపే ఇంటి వద్దకు చేరుకోవాలని భావించారు. దీంతో ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి కిందికి అత్యంత వేగంగా వస్తుండగా... మలుపు తిప్పేందుకు ప్రయత్నించిన భరత్ కారును అదుపు చేయలేకపోయాడు. ఈ ప్రమాదంలో దేవికి బలంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం ఆ సమయంలో ఘటనాస్థలికి సమీపంలోనే ఉంది. ఎస్సై సత్తయ్య అక్కడకు వెళ్లారు. భరత్‌కు అతడి తండ్రి నుంచి ఫోన్ రావడంతో విషయం చెప్పి రమ్మని కోరగా తల్లిదండ్రులు వచ్చారు. అంతా కలసి దేవిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దేవి తండ్రికి విషయం చెప్పారు.
ఆస్పత్రికి తరలించే సమయానికే దేవి చనిపోయింది.
ఈ నెల 3న వాచ్‌మన్ రాములు కథనంతో నిరంజన్‌రెడ్డికి కుమార్తె మరణంపై అనుమానాలు కలిగాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును ఎస్సై నుంచి ఏసీపీకి బదిలీ చేసిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఆరు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పబ్-ఘటనా స్థలి మధ్య ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా వాహనంలో దేవి, భరత్ మాత్రమే ఉన్నారని నిర్థారించారు. అత్యాచారం ఆనవాళ్లు, ఇతర గాయాలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలయ్యే వరకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని సీపీ తెలిపారు.
భరత్ ఫోన్ చేసుంటే దేవి బతికేది...
ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు భరతసింహారెడ్డి ఫోన్ చేసివుంటే తన కుమార్తెను బతికించుకొనే అవకాశం ఉండేదని దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీపీ వివరణతో తమకు ఈ ప్రమాదంపై ఉన్న అనుమానాలు చాలావరకు నివృత్తి అయ్యాయన్నారు. వాచ్‌మన్ రాము కథనం, అలాగే ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాలు ఆగారని చెబుతున్న విషయంలో కొంతైనా స్పష్టత వస్తే బాగుండేదన్నారు.