kec intarnational company
-
త్రివేణీ బైబ్యాక్.. కేఈసీ క్యూ1- షేర్లు జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మౌలిక సదుపాయాల కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో షుగర్ తయారీ కంపెనీ త్రివేణీ ఇంజినీరింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో కేఈసీ ఇంటర్నేషనల్ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం తక్కువగా రూ. 2207 కోట్లను తాకింది. కోవిడ్-19 కారణంగా పనితీరు ప్రభావితమైనప్పటికీ పూర్తిఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నట్లు కేఈసీ యాజమాన్యం పేర్కొంది. ఇబిటా 22 శాతం నీరసించి రూ. 251 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేఈసీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం దూసుకెళ్లి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. త్రివేణీ ఇంజినీరింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో త్రివేణీ ఇంజినీరింగ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 146 శాతం దూసుకెళ్లి రూ. 84 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 921 కోట్ల నుంచి రూ. 1222 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. ఒక్కో షేరుకీ రూ. 105 ధర మించకుండా 2.5 శాతం వాటాకు సమానమైన 61.9 లక్షల షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఓకే చెప్పినట్లు త్రివేణీ వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 65 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో త్రివేణీ ఇంజినీరింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 77.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 82 వరకూ ఎగసింది. -
బీఎస్ఈ బాండ్స్ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీపీ
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తన కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేయాలని బీఎస్ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్.. మొత్తం ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేస్తామని బీఎస్ఈ పేర్కొంది. ఈ కంపెనీలతో కలుపుకుంటే బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేసిన కంపెనీల సంఖ్య 16కు పెరుగుతుంది. ఈ కమర్షియల్ పేపర్స్ ద్వారా కంపెనీలు రూ.17,835 కోట్లు సమీకరించాయి. కమర్షియల్ పేపర్స్ అంటే... పెద్ద పెద్ద కంపెనీలు తమ స్వల్పకాలిక రుణాల కోసం ప్రామిసరీ నోట్ల రూపంలో జారీ చేసే మనీ మార్కెట్ సాధనంగా కమర్షియల్ పేపర్స్‌ను చెప్పుకోవచ్చు. వీటి మెచ్యురిటీ కాలం జారీ చేసిన తేదీ నుంచి కనిష్టంగా ఏడు రోజులు గరిష్టంగా ఏడాది కాలం ఉంటుంది. ముఖ విలువ కంటే కొంచెం డిస్కౌంట్‌కు వీటిని జారీ చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
అఫ్గాన్‌లో ఏడుగురు భారతీయుల కిడ్నాప్
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు అపహరణకు గురయ్యారు. అఫ్గాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో భారత్‌కు చెందిన ఒక కంపెనీ తరఫున విద్యుత్ కాంట్రాక్ట్ పనుల్ని పర్యవేక్షిస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబన్లు అపహరించారని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ ఉద్యోగులైన వీరంతా ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సులో విద్యుత్ నిర్వహణ పనుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక న్యూస్ చానల్ తెలిపింది. ఇంజనీర్లతో పాటు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌ను బాగ్లాన్ ప్రావిన్స్ రాజధాని పుల్–ఇ–ఖొమ్రిలోని బాగ్–ఇ–షమల్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు అపహరించినట్లు వెల్లడించింది. కాబూల్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కూడా ఇంజనీర్ల కిడ్నాప్‌ను నిర్ధారించారు. కిడ్నాప్‌కు గురైన ఏడుగురు భారతీయులు అఫ్గాన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కిడ్నాపునకు గురైన వీరంతా ఏ రాష్ట్రం వారో ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆర్పీజీ గ్రూపు అనుబంధ కంపెనీయే కేఈసీ ఇంటర్నేషనల్.. మా ఉద్యోగుల్ని కాపాడండి: ఆర్పీజీ చైర్మన్ ఈ ఉదంతంపై బాగ్లాన్ గవర్నర్ అబ్దుల్లా నెమటి మాట్లాడుతూ.. ‘భారతీయ ఇంజనీర్లను బందీలుగా పట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులు వారిని పుల్–ఇ–ఖొమ్రిలోని దండ్–ఇ–షహబుద్దీన్ ప్రాంతానికి తరలించారు. స్థానిక ప్రజల సాయంతో తాలిబన్ ఉగ్రవాదులతో అఫ్గాన్ అధికారులు మాట్లాడారు. భారతీయుల్ని అపహరించినట్లు ఉగ్రవాదులు అంగీకరించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు గా భావించి వారిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు’ అని చెప్పారు. స్థానిక గిరిజన నేతల మధ్యవర్తిత్వంతో అపహరణకు గురైన భారతీయుల్ని విడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని నెమటి తెలిపారు. మరోవైపు అపహరణకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. బాగ్లాన్ ప్రావిన్స్ నుంచి భారతీయుల అపహరణపై అఫ్గాన్ అధికారులతో సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేఈసీ కంపెనీ యాజమాన్య సంస్థ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంక ట్వీట్ చేస్తూ.. మా ఉద్యోగుల్ని కాపాడాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లోని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో దాదాపు 150 మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. 2016లో ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున పనిచేసేందుకు అఫ్గాన్ వెళ్లిన భారతీయ మహిళను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు 40 రోజుల అనంతరం విడుదల చేశారు. -
లీజు భూముల రద్దుకు కలెక్టర్‌ను కలిసిన సీపీఐ బృందం
గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం వద్ద ప్రభుత్వ బంజరు భూములను బినామీ పేర్లతో పట్టాలు పొంది ఆ భూములను కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీకి లీజుకు ఇవ్వడంపై సీపీఐ జిల్లా కార్యదర్శి జీ.ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణకు వినతిపత్రం అందచేశారు. శ్రీనివాసపురం వద్ద సర్వేనెంబర్ 1988, 1990లలో కొంత మంది బినామీ పేర్లతో స్థానికేతరులుగా ఉండే వారికి పట్టాలు ఇచ్చారని, ఆ పట్టాలను పొందిన యజమానులు వాటిని సాగుచేయకుండా కేఈసీ ఇంటర్నేషనల్ విద్యుత్తు సంస్థ (పవర్‌గ్రిడ్)కు 3 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ భూములపై గత 20 రోజులుగా సీపీఐ పార్టీ వివిధ ఆందోళనలు చేస్తుంటే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, స్థానిక రెవిన్యూ అ«ధికారులు పట్టించుకోలేదని వారు కలెక్టర్‌కు తెలిపారు. లీజు భూముల వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రద్దుకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. కలెక్టర్‌ను కలిసిన బృందంలో సీపీఐ ఏరియా కార్యదర్శి వి.వీరశేఖర్, జిల్లా సమితి సభ్యులు కె.జకరయ్య, ఎస్.చంద్రశేఖర్, సుబ్రమణ్యం ఉన్నారు.