కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు అపహరణకు గురయ్యారు. అఫ్గాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో భారత్‌కు చెందిన ఒక కంపెనీ తరఫున విద్యుత్ కాంట్రాక్ట్ పనుల్ని పర్యవేక్షిస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబన్లు అపహరించారని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ ఉద్యోగులైన వీరంతా ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సులో విద్యుత్ నిర్వహణ పనుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక న్యూస్ చానల్ తెలిపింది. ఇంజనీర్లతో పాటు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌ను బాగ్లాన్ ప్రావిన్స్ రాజధాని పుల్–ఇ–ఖొమ్రిలోని బాగ్–ఇ–షమల్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు అపహరించినట్లు వెల్లడించింది.
కాబూల్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కూడా ఇంజనీర్ల కిడ్నాప్‌ను నిర్ధారించారు. కిడ్నాప్‌కు గురైన ఏడుగురు భారతీయులు అఫ్గాన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కిడ్నాపునకు గురైన వీరంతా ఏ రాష్ట్రం వారో ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆర్‌పీజీ గ్రూపు అనుబంధ కంపెనీయే కేఈసీ ఇంటర్నేషనల్..
మా ఉద్యోగుల్ని కాపాడండి: ఆర్‌పీజీ చైర్మన్
ఈ ఉదంతంపై బాగ్లాన్ గవర్నర్ అబ్దుల్లా నెమటి మాట్లాడుతూ.. ‘భారతీయ ఇంజనీర్లను బందీలుగా పట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులు వారిని పుల్–ఇ–ఖొమ్రిలోని దండ్–ఇ–షహబుద్దీన్ ప్రాంతానికి తరలించారు. స్థానిక ప్రజల సాయంతో తాలిబన్ ఉగ్రవాదులతో అఫ్గాన్ అధికారులు మాట్లాడారు. భారతీయుల్ని అపహరించినట్లు ఉగ్రవాదులు అంగీకరించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు గా భావించి వారిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు’ అని చెప్పారు. స్థానిక గిరిజన నేతల మధ్యవర్తిత్వంతో అపహరణకు గురైన భారతీయుల్ని విడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని నెమటి తెలిపారు. మరోవైపు అపహరణకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. బాగ్లాన్ ప్రావిన్స్ నుంచి భారతీయుల అపహరణపై అఫ్గాన్ అధికారులతో సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేఈసీ కంపెనీ యాజమాన్య సంస్థ ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంక ట్వీట్ చేస్తూ.. మా ఉద్యోగుల్ని కాపాడాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లోని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో దాదాపు 150 మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. 2016లో ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున పనిచేసేందుకు అఫ్గాన్ వెళ్లిన భారతీయ మహిళను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు 40 రోజుల అనంతరం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment