లీజు భూముల రద్దుకు కలెక్టర్‌ను కలిసిన సీపీఐ బృందం
గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం వద్ద ప్రభుత్వ బంజరు భూములను బినామీ పేర్లతో పట్టాలు పొంది ఆ భూములను కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీకి లీజుకు ఇవ్వడంపై సీపీఐ జిల్లా కార్యదర్శి జీ.ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణకు వినతిపత్రం అందచేశారు. శ్రీనివాసపురం వద్ద సర్వేనెంబర్ 1988, 1990లలో కొంత మంది బినామీ పేర్లతో స్థానికేతరులుగా ఉండే వారికి పట్టాలు ఇచ్చారని, ఆ పట్టాలను పొందిన యజమానులు వాటిని సాగుచేయకుండా కేఈసీ ఇంటర్నేషనల్ విద్యుత్తు సంస్థ (పవర్‌గ్రిడ్)కు 3 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ భూములపై గత 20 రోజులుగా సీపీఐ పార్టీ వివిధ ఆందోళనలు చేస్తుంటే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, స్థానిక రెవిన్యూ అ«ధికారులు పట్టించుకోలేదని వారు కలెక్టర్‌కు తెలిపారు. లీజు భూముల వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రద్దుకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. కలెక్టర్‌ను కలిసిన బృందంలో సీపీఐ ఏరియా కార్యదర్శి వి.వీరశేఖర్, జిల్లా సమితి సభ్యులు కె.జకరయ్య, ఎస్.చంద్రశేఖర్, సుబ్రమణ్యం ఉన్నారు.