చేదు వార్త.. నైరుతి రుతుపవనాలు ఆలస్యం.. రాక ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకి దేశమంతటా విస్తరించడంతో వానలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాటి రాక వారం దాకా ఆలస్యమవుతుంది. గత అంచనాల మేరకు జూన్ 4 కల్లా రుతుపవనాలు కేరళకు రావాల్సింది.
‘‘వాటి రాకకు అన్నీ అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నాయి. ఆదివారం నాటికి సముద్ర మట్టానికి 2.1. కిలోమీటర్ల పైకి వీస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాం’’ అని ఐఎండీ ప్రకటనలో వివరించింది.