ketireddy jagadeeswar reddy
-
బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఏముంది?
సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత వంటివి తప్ప ఏమున్నాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే తాము కళ్లు మూసుకుని ఉండలేమని స్పష్టం చేసింది. బిగ్‌బాస్ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తరువాతకు సీజే ధర్మాసనం వాయిదా వేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడం పట్ల పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిజాయితీగా ఈ విషయాన్ని తమకు తెలియచేసి ఉంటే తాము ఈ వ్యాజ్యాన్ని విచారించేవాళ్లమని, అలా చెప్పకుండా దాచిపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తాము విచారణ జరపబోమంది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రసారమవుతున్న వీటిని అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటిని అనుమతించేది లేదు ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్ షో వల్ల యువత చెడిపోతుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోల్లో ఏది పడితే అది చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని అనుమతించేది లేదంది. ఈ సమయంలో బిగ్‌బాస్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇదే పిటిషనర్ బిగ్‌బాస్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారని తెలిపారు. బిగ్‌బాస్ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవల సీజే ధర్మాసనం ముందు అభ్యర్థించారన్నారు. అయితే ధర్మాసనం వేసవి సెలవుల తరువాత చూస్తామని చెప్పిందని వివరించారు. ఈ విషయాలను ప్రస్తుత ధర్మాసనం దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందే తేల్చుకోవాలంటూ విచారణ నుంచి ఈ వ్యాజ్యాన్ని తొలగించింది. -
సినిమా టికెట్ ధరలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి
సాక్షి, అమరావతి: పేదవారికి వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను ఇన్ని రోజులుగా కొందరు దోపిడీ విధానాన్ని అవలంభించారని విమర్శించారు. అటువంటి దోపిడీని అరికట్టడం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచిన కారణంగా అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఖాయమని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో తినుబండారల ధరలు, పార్కింగ్ చార్జీలను నియంత్రించాలని, నాసిరకమైన తినుబండారాలు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
దాసరి నారాయణరావుకి పద్మవిభూషణ్ ఇవ్వాలి
చెన్నై: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడుగా మూడు దశాబ్దాలు వెలుగొందిన స్వర్గీయ దాసరి నారాయణరావుకి నివాళిగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సభ జరిగింది. దాసరి నారాయణరావు గారికి కేంద్రం 2022 కి పద్మవిభూషణ్‌ను ప్రకటించాలని అందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి ఒక లేఖ ద్వారా సిఫార్సు చేయాలని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రాన్ని పంపారు. దానికి ముందు జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసి సమావేశంలో తీసుకొన్న నిర్ణీయాన్ని వారు రెండు ప్రభుత్వాలకు తెలిపారు.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే సినిమా టిక్కెట్ ధరలను పెంచుకొనే అవకాశాన్ని జీవో ద్వారా రద్దు చేయడాన్ని అభినందించారు. -
'మూడో వ్యక్తి సీఎం కావాలి'
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తొలగాలంటే మూడో వ్యక్తి సీఎం కావాలని తమిళ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పన్నీరు సెల్వం, శశికళల స్ధానంలో అన్నాడీఎంకేలోని మరో బలమైన నాయకుడు పగ్గాలు చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా గవర్నర్ చొరవ చూపి అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు. పరిస్ధితులు చక్కబడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇరువురు నేతల మధ్య సాగుతున్న రాజకీయ చదరంగం కారణంగా ప్రజాజీవనం స్తంభించిందని చెప్పారు. దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని అన్నారు. -
జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు. తెలుగు భాషతో పాటు తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు.