అడవి తంగేడుతో ఎయిడ్స్‌కు చెక్!
తిప్పతీగకూ ఔషధగుణాలు
ఎయిడ్స్ కారక వైరస్‌లను తగ్గిస్తారు
పరిశోధనలో తేల్చిన కాకతీయ వర్సిటీ బాటనీ విభాగం
నివేదికపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంతృప్తి
మరింత పరిశోధనకు నిధులు మంజూరు
సాక్షి, హన్మకొండ: ఇప్పటివరకు అకడమిక్ విషయాలకే ప్రాధాన్యమిచ్చిన మన యూనివర్సిటీలు ఇప్పుడు పరిశోధనల బాటపట్టాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌ను ఎదుర్కొనే శక్తి మన వనమూలికలకు ఉందంటున్నారు కాకతీయ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు. తెలంగాణలోని అటవీప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అడవి తంగేడు, తిప్పతీగలకు ఎయిడ్స్ వ్యాధికారక వైరస్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. వీరు ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో కొంత ఫలితాలు వచ్చాయి. మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ రూ.21 లక్షలు విడుదల చేయగా.. బయోటెక్నాలజీ విభాగం రూ.47 లక్షలు మంజూరు చేసింది.
ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవీ అనే వైరస్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒక వ్యక్తి శరీరంలోకి ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత దాని వృద్ధి రేటు అనేది ఆ వైరస్‌లో ఉండే ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైములపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైముల చర్యశీలత ఎక్కువగా ఉంటే హెచ్ఐవీ వైరస్ త్వరితగతిన అభివృద్ధి చెంది రోగం ముదురుతుంది. ఫలితంగా మనిషి త్వరగా మరణానికి చేరువ అవుతాడు. అయితే, కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు) ఆకుల్లో, టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) మొక్కలలో ఉండే ఔషధ గుణాలకు ఈ ఎంజైముల చర్యశీలతను తగ్గించే లక్షణం ఉందని కేయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల అంటున్నారు. తమ ప్రయోగాల్లో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన వెల్లడించారు.
పరిశోధన ఇలా..
కాకతీయవర్సిటీ పీహెచ్డీ పరిశోధనలో భాగంగాా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల.. ‘తెలంగాణ అడవుల్లో నివసించే గిరిజనులు - వనమూలిక వైద్యం’ అనే అంశంపై పరిశోధనలు జరిపారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని గిరిజనులు, వనవాసీలు వివిధ వ్యాధులను నయం చేయడానికి 65 జాతులకు చెందిన ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వీటిలో పునర్నవ (బహెరా డిప్యూరా), పిండికూర (ఎర్వాలానేటా), బ్రహ్మమేడి (ఫైకస్ హిస్పెడా), పులిచేరు (ఫిల్లాంథస్ రెటిక్యూలస్), నరమామిడి (లిట్సాగ్లుటిన్మో), సోమిడిచెక్క (సోమిడి ఫిబ్రుజా), కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు), టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) వంటి మొక్కలు ఉన్నాయి. వీటితో సుఖవ్యాధులు, పాముకాటు, రక్తశుద్ధి, వీర్యవృద్ధి, జీర్ణసంబంధిత ఇతర ప్రాణాంతక వ్యాధులను మందులుగా ఉపయోగిస్తున్నారు.
ఆదివాసీ వైద్యం
వనమూలికా వైద్య విధానంలో భాగంగా ఆదివాసీలు, గిరిజనులు సుఖవ్యాధుల నివారణ ఔషధాలుగా తిప్పతీగ, అడవితంగేడు మొక్కలను ఉపయోగిస్తున్నట్లుగా కాకతీయ యూనివర్సిటీ స్కాలర్స్ జరిపిన ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఈ రెండు మొక్కలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారు. తిప్పతీగ మొక్కలో అన్ని భాగాలు రెండు కిలోల పరిమాణంలో ఎండబెట్టి తర్వాత ప్రయోగశాలలో సారం తీయగా 2.9 మిల్లీ గ్రాముల సారం వస్తుంది. అడవితంగేడు మొక్క ఆకులను పూర్తిగా ఎండబెట్టి వీటి నుంచి తీసిన సారాన్ని హెచ్ఐవీ వ్యాప్తికి కారకాలుగా పనిచేసే మూడు ఎంజైములపై ప్రయోగించారు. రెండు కేజీల ఎండిన అడవితంగేడు ఆకుల నుంచి 1.5 మిల్లీ గ్రాముల సారం తీసుకుని హెచ్ఐవీ కారక ఎంజైములైన ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్లపై ప్రయోగించగా వీటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైముల పనితీరు మందగించినట్లుగా గమనించారు. ఈ పరిశోధనల ఫలితాలను ప్రముఖ సైన్స్ మ్యాగజైన్లు ఇంటర్నెషన్ జర్నల్స్ అయిన సైంటిఫిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇన్ఫెక్షియస్ డీసీజెస్ అనే బ్రిటన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనంతరం ఈ ప్రయోగ ఫలితాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాఖలకు పంపించారు.
కేంద్రం నుంచి రూ.68 లక్షలు మంజూరు
అడవితంగేడు, తిప్పతీగలలో ఉన్న ఏ మూలకాలకు ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే ఔషధ లక్షణాలు ఉన్నాయో కనుగొనేందుకు, కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంగీకరించాయి. అడవి తంగేడు, తిప్పతీగలలో హెచ్ ఐవీ వైరస్‌లో ఉండే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైము పనితీరును తగ్గిస్తున్న ఔషధ మూలం (మాలిక్యూల్) ఏదో కనిపెట్టే పనిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇస్తారీ మామిడాలతో నేతృత్వంలో స్కాలర్స్ రాజేంద్రాచారి, రాజేంద్రప్రసాద్, వెంకన్న, సాయినాథ్, ప్రసాద్‌లతో కూడిన బృందం ప్రయోగాలు చేస్తోంది. ఇందుకుగాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2013 అక్టోబరులో రూ.21 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ‘యాంటీ హెచ్ఐవీ ప్రొటేజ్ ఇన్హెలిటరీ ఆక్టివిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఎక్స్‌ట్రాట్స్’ అనే ఆంశంపై పరిశోధన సాగుతోంది. మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ ఏడాది మార్చిలో రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఐసోలేషన్ ప్యూరీఫికేషన్ ఆఫ్ ఆంటీ హెచ్ఐవీ కాంపౌండ్ ఫ్రం మెడిసినల్ ప్లాంట్ ఎక్స్‌ట్రాట్స్ అనే అంశంపై ప్రయోగాలు జరుగుతున్నాయి.