Kia EV6
-
కొరియన్ బ్రాండ్ కీలక నిర్ణయం.. ఇండియాలో 1138 కార్లు వెనక్కి
భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది. -
ధోని కొత్త కారులో కేదార్ జాదవ్, రుతురాజ్‌ల షికారు
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాంచీలో తన నివాసంలో ఉన్న గ్యారేజీలో లెక్కలేనన్ని కార్లు, బైకులు ఉన్నాయి. తాజాగా ధోని ఇంటికి మరో కొత్త కారు వచ్చి చేరింది. ఇటీవలే ధోని కియాకు చెందిన 'EV6'(SUV) కారుని కొనుగోలు చేసాడు. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ధోని కొన్న కియా కంపెనీ EV6 ధర దేశీయ మార్కెట్లో రూ.59.95 లక్షలుగా ఉంది. ఇక ధోని కొన్న కొత్త కారులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లు చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధోనినే స్వయంగా కారును డ్రైవ్ చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పిన ధోని కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు రుతురాజ్, కేదార్ జాదవ్‌లు మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు టోర్నీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్, కేదార్లు సరదాగా ధోని కారులో షికారుకెళ్లారు. New Car in the house babyyy @msdhoni 😎pic.twitter.com/73ZZMxF4hv — Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022 -
కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది, సింగిల్ ఛార్జ్‌తో 520 కి. మీ దూసుకెళ్తుంది!
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఈవీ6 కారును ఆవిష్కరించింది. రెండు వేరియంట్స్‌లో ఇది లభిస్తుంది. ధర శ్రేణి రూ. 59.95 లక్షలు – రూ. 64.95 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. 12 నగరాల్లోని 15 డీలర్‌షిప్‌ల ద్వారా దీన్ని విక్రయించనున్నారు. డీలర్‌షిప్‌లలో 150 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్లు కూడా ఉంటాయి. ఈవీ6 మోడల్ కోసం ఇప్పటికే 355 పైచిలుకు బుకింగ్స్ వచ్చినట్లు కియా ఇండియా ఎండీ టే–జిన్ పార్క్ తెలిపారు. ఒకసారి చార్జి చేస్తే ఈ వాహనం 528 కి.మీ. వరకూ ప్రయాణించగలదు. 350 కేడబ్ల్యూహెచ్ (కిలోవాట్ పర్ అవర్) చార్జర్‌తో 18 నిమిషాల్లోనే 10 శాతం నుండి 80 శాతం మేర చార్జ్ కాగలదని పార్క్ వివరించారు. వేరియంట్‌ను బట్టి ఆల్–వీల్ డ్రైవ్, సన్‌రూఫ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు టే–జిన్ పార్క్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వ్యాపార కార్యకలాపాలపై 22.22 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ మాతృసంస్థ కియా కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌లో ఇన్ఫ్రా ఏర్పాటుకు, స్థానికంగా అనువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇందులో కొంత భాగాన్ని వినియోగించనున్నట్లు పార్క్ తెలిపారు. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే తయారు చేసిన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (బీఈవీ) 2025 నాటికి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చార్జింగ్ ఇన్ఫ్రా కీలకం.. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని పార్క్ పేర్కొన్నారు. అయితే, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రాచుర్యంలోకి రావాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, వ్యక్తిగత వాహనాలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు. స్థానికంగా బ్యాటరీ సెల్ తయారీ ప్రారంభమైతే ఈవీలకు మరింత ఊతం లభించగలదన్నారు. సానుకూల ప్రభుత్వ విధానాలు, వినియోగదారుల ఆలోచనా ధోరణుల్లో మార్పులు తదితర అంశాల తోడ్పాటుతో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగవచ్చని పార్క్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ కియా.. ఆగయా: నటి క్యాథెరిన్, జానీ మాస్టర్ సందడి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్ల కంపెనీ కియా సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం తొలిసారిగా మార్కెట్ లోకి వస్తోంది. త్వరలో వినియోగదారుల కు అందుబాటులో కి రానున్న ఈ కార్ ని హైదరాబాద్ లో ప్రదర్శించారు. · హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటి క్యాథెరిన్, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్ ; షోరూమ్ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ, జీఎం వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్ కియా, హైటెక్ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 3లక్షల రూపాయల టోకెన్ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్ చేసుకో వచ్చు. దేశవ్యాప్తంగా 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేకతలివీ... ఈ కియా ఈవీ6ను ఈ–జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్లో 77.4 కిలోవాట్ హవర్ లిథయం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్ విద్యుత్ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్లో 325పీఎస్ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్రైవర్, ప్యాసెంజర్ రిలాక్సేషన్ సీట్లు, రిమోట్ ఫోల్డింగ్ సీట్లు, ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం మూన్‌స్కేప్, స్నో వైట్ పెరల్, రన్‌వే రెడ్, అరోరా బ్లాక్ పెరల్, యాచ్ బ్లూ –రంగుల లో లభిస్తుంది. -
కియా ఈవీ6 రూ.3 లక్షలతో బుకింగ్: 12 నగరాల్లో మాత్రమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఈవీ6 ఎలక్ట్రిక్ వెహికిల్‌ను వచ్చే వారం భారత్‌లో ఆవిష్కరిస్తోంది. పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ఫార్వార్డ్ కొలీషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్‌తోపాటు 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లను జోడించారు. దేశంలో కంపెనీకి ఇది తొలి ఈవీ. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంది. ఈవీ6 బుకింగ్స్ ప్రారంభించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. పూర్తిగా తయారైన 100 యూనిట్ల ఈవీ6 వాహనాలను తొలుత దిగుమతి చేసుకుంటారు. కియా ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్షిప్ కేంద్రాల్లో మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉంది. కస్టమర్లు రూ.3 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. The wheels of progress must be powered not just by fuel but an inspiration. Presenting the most inspiring Kia ever - the fully electric Kia EV6. Book Now: https://t.co/hXAjX5EVJk#Kia #TheKiaEV6 #MovementThatInspires — Kia India (@KiaInd) May 26, 2022 -
అదిరిపోయే ఫీచర్లతో కియా ఎలక్ట్రిక్ కారు.. బుకింగ్స్ షురూ..
అనతి కాలంలోనే ఇండియన్ కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన కియా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. 2022 జూన్ 2న కారును మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది కియా. దీంతో ఆన్లైన్లో ఆడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. కియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందస్తుగా కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ 6ను బుక్ చేసుకోవచ్చు. టోకెన్ అమౌంట్‌గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కియా సంస్థ ఇటీవల ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈవీ 6 పేరుతో ఈ మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ఈవీ కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కియా చెబుతోంది. 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడును ఈ కారు అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా. 18 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవుతుంది. లార్జ్ బూట్ స్పేస్, పెద్దదైన సన్‌రూఫ్, ఎల్లాయ్వీల్స్, అధునాత టెయిల్ ల్యాంప్ సిస్టమ్, లెటెస్ట ఇన్ఫోంటైన్ సిస్టమ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ హెడ్అప్ డిస్ప్లే, ఆల్‌వీల్ డ్రైవ్, నార్మల్, స్పోర్ట్స్, ఎకో డ్రైవింగ్ మోడ్స్, ఈవీ రిమోట్ ఛార్జింగ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటరింగ్, ఈవీ రిమోట్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. ఈవీ 6 మోడల్లో జీటీ లైన్, జీటీ లైన్ ఏవీడీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..? -
వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. బుకింగ్స్ ప్రారంభం..! భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కొద్ది రోజుల్లోనే లాంచ్ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్ ఆవిష్కరించింది. సూపర్ ఫీచర్స్‌తో..! కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్ఎల్స్తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది. Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే..! అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..!