Kick Boxing Championship
-
నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్
కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యర్థి ఇచ్చిన పంచ్‌కు కిక్ బాక్సర్ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఈ దురదృష్టకర ఘటన జూలై 10న బెంగళూరులో చోటుచేసుకుంది. కాగా యువ బాక్సర్ మృతికి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన బాక్సర్ 23 ఏళ్ల నిఖిల్ అని తెలిపారు. విషయంలోకి వెళితే..జూలై 10న బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్‌లోని పై ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి మొహంపై పంచ్ ఇవ్వగానే వేగంగా కిందపడిన నిఖిల్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అతన్ని నగరబావిలోని జీఎమ్ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్ తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడంతో బుధవారం రాత్రి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. నిఖిల్ మృతిపై అతని తండ్రి సురేశ్ స్పందించాడు. ' పంచ్ దెబ్బకు నిఖిల్ తలలో బ్లీడింగ్ జరగలేదు. బాక్సింగ్ రింగ్‌పై ఉన్న మ్యాట్ నాసిరకం. మ్యాట్ కింద కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం.. మ్యాట్‌పై తల బలంగా తాకడంతోనే నిఖిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని.. పారామెడికల్ యూనిట్ గాని.. నిఖిల్‌ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతోనే నా కొడుకు మృతి చెందాడంటూ'' ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా మ్యాచ్ నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజర్ నవీన్ రవిశంకర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని.. అతను పరారీలో ఉన్నట్లు సురేశ్ పేర్కొన్నారు. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సెక్షన్ 304-ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు. #Karnataka #Bengaluru Police have registered a negligence case against organisers after boxer Nithin died after he received a blow from opponent in state level kickboxing championship. @IndianExpress pic.twitter.com/PgiwkPK4Tp — Kiran Parashar (@KiranParashar21) July 14, 2022 -
కిక్ బాక్సింగ్: హైదరాబాద్ వాసికి రజతం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో హైదరాబాద్ వాసి పాలవరపు మనోజ్ రజత పతకంతో మెరిశాడు. ఢిల్లీలో జరిగిన వాకో ఓపెన్ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో 19 ఏళ్ల మనోజ్ కిక్ లైట్ ఈవెంట్లో ఓపెన్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ విభాగంలో పతకం సాధించాడు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో బోయినిపల్లికి చెందిన మనోజ్ సిల్వర్ మెడల్ గెలుచుకోవడం పట్ల స్థానికులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం మనోజ్ ఢిల్లీ నుంచి హైదరబాద్‌కు చేరుకున్నాడు. అతడికి క్రీడా అభిమానులు, కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. -
పతకాలు సాధిస్తాడు.. సాయం చేయండి
రాజేంద్రనగర్: వరల్డ్ యూనిఫైట్(కిక్ బాక్సింగ్) చాంపియన్ షిప్ 2019కి అర్హత సాధించిన రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన కుమారుడికి ఆర్థిక సాయం చేస్తే పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తాడని విద్యార్థి తండ్రి కోరుతున్నాడు. వివరాల్లోకి వెళితే...రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన దేవా స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సుమంత్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బాల్యం నుంచే యూనిఫైట్లో అమితాసక్తి చూపించేవాడు. దీంతో తండ్రి అతడిని ప్రోత్సహించాడు. స్థానికంగా ఎక్కడ పోటీలు జరిగినా సుమంత్ పాల్గొని పతకాలు సాధించేవాడు. గత సంవత్సరం హర్యానాలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. ఏప్రిల్ 16 నుంచి 21వరకు రష్యాలో నిర్వహించే వరల్డ్ యూనిఫైట్ చాంపియన్ షిప్ 2019కి విద్యార్థి అర్హత సాధించాడు. పోటీల్లో పాల్గొనేందుకు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 1.60 లక్షలు అవసరం. చిరు ఉద్యోగినైన తనకు అంత స్తోమత లేదని, తెలంగాణ ప్రభుత్వం లేదా దాతలు ముందుకు వచ్చి తన కుమారుడికి సాయం చేస్తే రష్యా వెళ్లి పతకాలు సాధించుకొని వస్తాడని దేవా ధీమా వ్యక్తం చేశాడు. దయార్థ హృదయులు 84990 82474లో సంప్రదించాలని కోరాడు. -
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు రాణించారు. హిమాచల్‌ప్రదేశ్ సోలంకి యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో రెండు రజతాలు, ఒక కాంస్యా న్ని సాధించారు. రాష్ట్రానికి చెందిన నితీశ్ కుమార్, అక్షర రజతాలను గెలుచుకోగా, స్టాలిన్ కాంస్యాన్ని నెగ్గాడు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని రాష్ట్ర కిక్ బాక్సింగ్ బృందం శుక్రవారం కలిసింది. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన బాక్సర్లను శాట్స్ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ రిఫరీ తిరుపతి, తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సి. రామాంజనేయ, కార్యదర్శి మహిపాల్ పాల్గొన్నారు. -
ప్రవీణ్, మౌనికలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ‘వాకో’ ప్రపంచకప్ డైమండ్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు పసిడి పంచ్‌తో సత్తా చాటారు. రష్యా లోని అనపా నగరంలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన ఎం. ప్రవీణ్ కుమార్ సీనియర్ పురుషుల విభాగంలో, కందుల మౌనిక వెపన్ సాఫ్ట్ స్టయిల్ డివిజన్లో చాంపియన్లుగా నిలిచి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. వీటితో పాటు ప్రవీణ్ లైట్ కాంటాక్ట్ ఫైట్ కేటగిరీలో, మౌనిక 50 కేజీల పాయింట్ ఫైటింగ్ విభాగాల్లో కాంస్య పతకాలనూ గెలుచుకున్నారు. ఇదే టోర్నీలో తెలంగాణకే చెందిన ఆర్. సంజు రజతాన్ని దక్కించుకోగా... షేక్ మొహమ్మద్ అశ్వక్, బి. మహేశ్ చెరో కాంస్యాన్ని సాధించారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించిపెట్టిన రాష్ట్ర క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కిక్‌బాక్సింగ్ సంఘం కార్యదర్శి మహిపాల్, రంగారెడ్డి జిల్లా కిక్‌బాక్సింగ్ సంఘం అధ్యక్షులు నర్సింగ్ రావు పాల్గొన్నారు.