kids begging
-
తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియలకు చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు పిల్లలు భిక్షాటన చేసిన దారుణఘటన తమిళనాడులో జరిగింది. దిండుగల్ జిల్లాలోని మేటుపట్టికి చెందిన కాళియప్పన్, విజయ దంపతులకు మోహన్(14), వేల్ మురుగన్(13) కుమారులు, కుమార్తె కాళీశ్వరి ఉన్నారు. గతంలోనే కాళియప్పన్ చనిపోయాడు. దీంతో విజయ ఒక్కతే రెక్కల కష్టంతో పిల్లల్ని చూసుకుంటోంది. ఇటీవల ఆమెకు రొమ్ము కేన్సర్ సోకింది. దీంతో కుమారులు బడి మానేసి కూలిపనికి వెళ్తున్నారు. విజయ పరిస్థితిని చూసిన ఓ ఆశ్రమం కుమార్తె కాళీశ్వరి బాధ్యతలు స్వీకరించింది. ఆరోగ్యం క్షీణించిన విజయను దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం కన్నుమూసింది. తల్లి మృతిపై బంధువులకు సమాచారం అందించినా ఎవ్వరూ స్పందించకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియల కోసం ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో భిక్షాటనకు దిగారు. విషయం తెల్సుకున్న ఆస్పత్రి సంక్షేమాధికారి మాలతి అంత్యక్రియల ఏర్పాట్లు చూశారు. చివరికి ప్రభుత్వ దహన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
చిన్నారుల భిక్షాటనపై విచారణ జరపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులను కిడ్నాప్ చేయడమే కాకుండా వారిని వికలాంగులుగా మార్చి, వారితో భిక్షాటన చేయిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ ఆరోపించిన విధంగా చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా..? మాఫియానే ఇలా చేయిస్తోందా..? అన్న కోణంలో విచారణ జరిపి 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారిని బిచ్చగాళ్లను చేసి, వారి ద్వారా డబ్బు సంపాదించే మాఫియా రోజు రోజుకు తమ పరిధిని విస్తరించుకుంటూ వెళుతోందని, తెలంగాణలో బిచ్చగాళ్లపై నిషేధం విధించి, వారికి పునరావాసం కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.