సాక్షి, చెన్నై: అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియలకు చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు పిల్లలు భిక్షాటన చేసిన దారుణఘటన తమిళనాడులో జరిగింది. దిండుగల్ జిల్లాలోని మేటుపట్టికి చెందిన కాళియప్పన్, విజయ దంపతులకు మోహన్(14), వేల్ మురుగన్(13) కుమారులు, కుమార్తె కాళీశ్వరి ఉన్నారు. గతంలోనే కాళియప్పన్ చనిపోయాడు. దీంతో విజయ ఒక్కతే రెక్కల కష్టంతో పిల్లల్ని చూసుకుంటోంది. ఇటీవల ఆమెకు రొమ్ము కేన్సర్ సోకింది. దీంతో కుమారులు బడి మానేసి కూలిపనికి వెళ్తున్నారు.
విజయ పరిస్థితిని చూసిన ఓ ఆశ్రమం కుమార్తె కాళీశ్వరి బాధ్యతలు స్వీకరించింది. ఆరోగ్యం క్షీణించిన విజయను దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం కన్నుమూసింది. తల్లి మృతిపై బంధువులకు సమాచారం అందించినా ఎవ్వరూ స్పందించకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియల కోసం ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో భిక్షాటనకు దిగారు. విషయం తెల్సుకున్న ఆస్పత్రి సంక్షేమాధికారి మాలతి అంత్యక్రియల ఏర్పాట్లు చూశారు. చివరికి ప్రభుత్వ దహన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment