సాక్షి, హైదరాబాద్: చిన్నారులను కిడ్నాప్ చేయడమే కాకుండా వారిని వికలాంగులుగా మార్చి, వారితో భిక్షాటన చేయిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ ఆరోపించిన విధంగా చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా..? మాఫియానే ఇలా చేయిస్తోందా..? అన్న కోణంలో విచారణ జరిపి 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారిని బిచ్చగాళ్లను చేసి, వారి ద్వారా డబ్బు సంపాదించే మాఫియా రోజు రోజుకు తమ పరిధిని విస్తరించుకుంటూ వెళుతోందని, తెలంగాణలో బిచ్చగాళ్లపై నిషేధం విధించి, వారికి పునరావాసం కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.