కర్ణాటక అడవుల్లో ముగ్గురిని చంపేసిన పులులు
దక్షిణ కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో రెండు పులులు ముగ్గురు వ్యక్తులను చంపేశాయి. టి.సురేష్ (27) అనే ఫారెస్ట్ వాచర్ మెడ మీద పంజా గుర్తులతో చనిపోయి కనిపించాడని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ లోకేష్ మూర్తి తెలిపారు. ఓ గ్రామస్థుడు, మరో గిరిజనుడు కూడా మరో పులి చేతిలో బండిపూర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో మరణించారు. వాళ్లు పెంచుకుంటున్న పశువులను తినేందుకు ఆ పులి శుక్రవారం నాడు వాళ్ల ప్రాంతంలోకి వెళ్లిందని, అప్పుడే చెలువ (40) అనే గ్రామస్థుడు, బస్వరాజు (45) అనే గిరిజనుడు వాటి చేతిలో మరణించారని, వాళ్ల తలల మీద, శరీరాల మీద తీవ్రంగా గాయపడిన గుర్తులున్నాయని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ బెల్లియప్ప చెప్పారు.
వాస్తవానికి రెండు అడవుల మధ్య 120 కిలోమీటర్ల మేర ఫారెస్టు గార్డులు ఉచ్చులు ఏర్పాటుచేశారు. అయితే ఇంతవరకు మనుషులను చంపుతున్న పులలు ఏవన్న విషయం మాత్రం తెలియరాలేదు. సురేష్‌ను చంపిన తర్వాత అతడి మృతదేహాన్ని పులి కొద్దిదూరం లాక్కెళ్లి అక్కడ వదిలేసింది. క్యాంపులో అతడు కనిపించకపోయేసరికి ఇతర గార్డులు వెతకగా, మృతదేహం దొరికింది. అడవిలో కట్టెలు తెచ్చుకోడానికి అతడు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. పులుల జనాభా పెరిగినప్పుడు ఏ ప్రాంతంలో ఏవి వేటాడాలన్న విషయమై వాటిమధ్య పోరాటం జరుగుతుందని, సగటున 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 12 పులులు మాత్రమే సంచరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.