ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి?
ఇండియన్ పాలిటీ
భారత రాష్ట్రపతి
భారతదేశ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి. ఈయన గురించి నిబంధన 52 నుంచి 62 వరకు తెలియజేస్తాయి.
అధికరణ 52: భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. వీరు దేశంలో అత్యున్నత వ్యక్తి.
అధికరణ 53: రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్య నిర్వహణ అధికారి, ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలియజేస్తుంది. రాష్ట్రపతి పేరుమీదే పరిపాలన కొనసాగుతుంది. ఈయనకు సహాయ పడేందుకు అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది.
అధికరణ 58: రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతల గురించి తెలియజేస్తుంది. అవి:
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. 35 ఏళ్లు నిండి ఉండాలి.
3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
4. ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యుల్లో కనీసం 50 మంది బలపర్చాలి.
5. రూ. 15000 డిపాజిట్‌గా చెల్లించాలి.
అధికరణ 54: రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్ నైష్పత్తిక ప్రా తినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో పార్లమెంట్‌కు ఎన్నికైన ఉభయ సభ సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు ఎన్నికైన విధాన సభ సభ్యులు ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును కల్పించారు.
ఓటుహక్కు ఉన్న ఎంపీలు 776
(లోక్‌సభ 543 + రాజ్యసభ 233)
ఓటుహక్కు ఉన్న ఎమ్మెల్యేలు 4120
(రాష్ట్రాలు 4020 + కేంద్ర పాలిత ప్రాంతాలు 100)
అధికరణ 55: ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ = రాష్ట్ర జనాభా/ఎమ్మెల్యేల సంఖ్య * 1/1000
ఈ ఓటు విలువ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ట్ర (175) రాష్ట్రాలకు, అతి తక్కువగా సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) రాష్ట్రాలకు ఉంది. దీన్ని 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్కిస్తారు.
ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ/ ఎంపీల సంఖ్య.
{పస్తుతం ఎంపీ ఓటు విలువ 708.
రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10,98,882. వీటిలో మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,478. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408.
రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటివరకు పద్నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, పద్నాలుగో ఎన్నిక 2012లో జరిగింది.
అధికరణ 56: రాష్ట్రపతి పదవి కాలం 5 ఏళ్లు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. పదవిలో కొనసాగేందుకు ఇష్టం లేకపోతే రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించి తప్పుకోవచ్చు.
అధికరణ 57: దీని ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతి పదవికి ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రెండుసార్లు పదవి నిర్వహించారు. మూడోసారి కూడా బలపర్చినప్పటికీ పోటీ చేయకుం డా రెండుసార్లు మాత్రమే పోటీ చేసే సాం ప్రదాయాన్ని నెలకొల్పారు. రాష్ట్రపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ పని చేశారు.
అధికరణ 59: రాష్ట్రపతి జీతభత్యాల గురించి వివరిస్తుంది. దీన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుత వేతనం రూ. 1,50,000. జీతభత్యాలను తగ్గించే వీలులేదు. వీటికి ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
అధికరణ 60: సుప్రీంకోర్ట ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సందర్భంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించే సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు.
అధికరణ 61: దేశ ద్రోహానికి పాల్పడిన, రాజ్యాంగాన్ని ధిక్కరించిన సందర్భాల్లో రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ పదవి నుంచి తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. దీన్ని 1/4 సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేసి ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రెండో సభకు వెళుతుంది. రెండో సభ కూడా 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఒక సభ ఆమోదించి, మరోసభ వ్యతిరేకిస్తే తీర్మానం రద్దవుతుంది. ఈ తీర్మానంపై నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 1971లో వి.వి.గిరికి నోటీస్ జారీ చేసి విరమించుకున్నారు.
అధికరణ 62: ఏదైనా కారణంతో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, ఆరు నెలల్లోపు నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.
అధికరణ 71: రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్ట్రోరల్ కాలేజ్‌లోని సభ్యుడు ఎన్నిక వివాదాలపై పిటిషన్ వేయవచ్చు. పిటిషన్‌ను ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఎన్నిక వివాదంపై కోర్టులో స్వయంగా హాజరైన రాష్ట్రపతి వి.వి.గిరి. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు.
భారత రాష్ట్రపతులు
1. డాక్టర్ రాజేంద్రప్రసాద్ (1950-62): బీహార్‌కు చెందినవారు. ఎక్కువ కాలం రాష్ట్రపతిగా కొనసాగారు. రెండుసార్లు రాష్ట్రపతి గా పనిచేసిన ఏకైక వ్యక్తి. హిందూకోడ్ బిల్లును పునఃపరిశీలన కోసం పంపారు. ఈయన ప్రధాన రచన ‘ఇండియా డివెడైడ్’.
2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962-67): తమిళనాడుకు చెందినవారు. విదేశీ రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా పని చేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధా న రచనలు ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’.
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1967-69): తక్కు వ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. పదవి లో కొనసాగుతూ మరణించిన మొదటి రాష్ట్రపతి. ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
4. వి.వి.గిరి (1969-74): ఈయన ఒడిశాకు చెందినవారు. అతి తక్కువ మెజార్టీతో ఓటు బదలాయింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కార్మిక సంఘాల నాయకుడిగా పనిచేశారు.
5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77): ఈయన అసోంకు చెందినవారు. పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి. అంతరంగిక అత్యవసర సమయంలో రాష్ట్రపతిగా పనిచేశారు.
6. నీలం సంజీవరెడ్డి (1977-82): రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. మిగతావారితో పోలిస్తే తక్కువ వయసు (62 ఏళ్లు)లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
7. జ్ఞానీ జైల్ సింగ్ (1982-87): రాష్ట్రపతి అయిన ఏకైక సిక్కు వ్యక్తి. ఈయన పంజాబ్‌కు చెందినవారు. ఈయన కాలంలోనే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జరిగింది. ‘పాకెట్ విటో’ అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ట్రపతి.
8. ఆర్. వెంకట్రామన్ (1987-92): ఈయన తమిళనాడుకు చెందినవారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే అతిపెద్ద పార్టీ నాయకున్ని ఆహ్వానించడం ప్రారంభించింది ఈయనే. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపు బిల్లు పునఃపరిశీలన కోసం పంపించారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధాన రచన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స’.
9. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ (1992-97): ఈయన మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వివాదాస్పద దళిత క్రైస్తవుల రిజర్వేషన్ బిల్లును వెనక్కి పంపారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రాష్ట్రపతి పదవిలో ఉన్నారు.
10. కె.ఆర్. నారాయణన్ (1997 - 2002): అత్యధిక మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికైనవారు. ఏకైక దళిత రాష్ట్రపతి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. అమెరికా ప్రభుత్వం నుంచి ‘బెస్ట్ స్టేట్స్‌మ్యాన్’ అవార్డు పొందారు. ఈయన కేరళకు చెందినవారు.
11. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-07): రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తి. ఈయన తమిళనాడుకు చెందినవారు. 2006లో లాభదాయక బిల్లును పునఃపరిశీలనకు పంపారు. ఈయన ప్రధాన రచన ‘వింగ్‌స ఆఫ్ ఫైర్’.
12. {పతిభాపాటిల్ (2007-12): ఏకైక మహిళా రాష్ట్రపతి. మహారాష్ట్రకు చెందినవారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి.
13. {పణబ్ ముఖర్జీ (2012): పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. తీవ్రవాదులైన కసబ్, అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించారు.
1969లో వి.వి.గిరి, మహ్మద్ హిదాయతుల్లా; 1977లో బీ.డి. జెత్తి తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేశారు. రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన మొదటి మహిళ లక్ష్మీ సెహగల్.
ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు:
1. రాజేంద్రప్రసాద్, 2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 3. నీలం సంజీవరెడ్డి, 4. జ్ఞానీ జైల్ సింగ్, 5. అబ్దుల్ కలాం,
6. ప్రతిభా పాటిల్, 7. ప్రణబ్ ముఖర్జీ.