Kona Raghupathy
-
హ్యాట్రిక్ వీరుడు ‘కోన’
సాక్షి, బాపట్ల : బాపట్ల నియోజకవర్గంలో కోన కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. కోన ప్రభాకరరావు బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అంతేకాకుండా ఆయన తనయుడు కోన రఘుపతి కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి ఒక సారి గెలుపొంది రెండో సారీ పోటీలో ఉన్నారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరావు పోటీ చేసి 32,344 ఓట్లు సాధించగా ప్రత్యర్థి కె.వి.రావు సీపీఎం నుంచి పోటీ చేయగా 17,117 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తం 15,227 ఓట్లు తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరరావు పోటీపడి 33,314 ఓట్లు సాధించగా, ముప్పలనేని శేషగిరిరావు స్వతంత్ర అభ్యర్థిగా 31,025 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో 2,289 ఓట్ల తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. ఈ సారి 1978లో జరిగిన ఎన్నికల్లో 40,332 ఓట్లు సాధించగా ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుకు 40,143 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కోన పోటీలో ఉండగా జనతా పార్టీ నుంచి ముప్పలనేని పోటీపడ్డారు. నువ్వా...నేనా అనే విధంగా సాగిన ఈ పోటీలో 189 ఓట్ల మెజార్టీతో కోన గెలుపొందారు. అనంతరం ఆయన వారసుడిగా 2014లో జరిగిన ఎన్నికల్లో కోన రఘుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 71,076 ఓట్లు సాధించగా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి అన్నం సతీష్ ప్రభాకర్‌కు కేవలం 65,263ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 5,813 ఓట్లు మెజార్టీతో కోన రఘుపతి గెలుపొందారు. -
‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న తన తండ్రి కోన ప్రభాకర్‌రావు మాదిరిగా తాను కూడా చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉండి పూర్తి స్థాయిలో సేవలందిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను రంగులు మార్చే రాజకీయ నాయకుడున్నికానని, పార్టీలు మారే సంస్కృతి తన రక్తంలోనే లేదని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరటం దురదృష్టకరమని, పార్టీ మారకుండానూ ప్రజాసేవ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తాను కూడా పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకప్పడు రఘుపతి సేవలు తమ పార్టీకి అవసరం లేదని చెప్పిన పాలక పక్ష నే తలే ఇప్పుడు తనపై బురద చల్లడం ఎంత వరకు సబబో వారి విజ్ఞతకే వదలి వేస్తున్నానని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఎమ్మెల్యేగా తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తాను జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు. -
పెట్రో డీలర్లకు న్యాయం చేయాలి
-ఏపీఎఫ్పీటీ రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని పెట్రోలియం ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ (ఏపీఎఫ్పీటీ) రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ అన్నారు. మంగళగిరికి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లోఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న ఔట్లెట్లను తగ్గించడంతో పాటు ప్రస్తుతం వున్న ఔట్లెట్ల మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే అపూర్వచంద్ర కమిటీ నివేదికను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు లీటరుకు రెండు రూపాయిల నుంచి ఏడు రూపాయల వరకు తక్కువగా ఉండడంతో ఆంధ్ర రాష్ట్రంలోని డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఒకే విధానం ఉండాలన్నారు. పెట్రోలు డీలర్లు 24 గంటలు విధుల్లో ఉంటారని, రాత్రి వేళల్లో డీలర్లు, సిబ్బందిపై దాడులు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గతంలో 125 డాలర్లు ఉండగా ప్రస్తుతం 30 డాలర్లకు పడిపోయిందని చెప్పారు. పెట్రో ధరలు తగ్గించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని, ఇందుకోసం ఏడాది నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవకపోవడం బాధాకరమన్నారు.ఈ సమావేశంలో బాపట్ల, పలాస ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గౌతు శ్యామ్‌సుందర్ తో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 మంది పెట్రో డీలర్లు పాల్గొన్నారు.