మాటల పాట.. కొండల్ ఆట
పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ ..ఎంతో మంది కవులు, కళాకారులకు పుట్టినిళ్లుగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసింది. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగించిన ఘనత కళాకారులదే. గజ్జెకట్టి తెలంగాణ ధూంధాంతో హోరెత్తించి ప్రజా చైతన్యంతో పాలకులను మేలుకొల్పింది కళాకారులే. రేయింబవళ్లు పాటే ప్రాణంగా బతికిన ముద్దు బిడ్డ ఈ నాగిళ్ల కొండల్.
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : నిరుపేద కుటుంబంలో నాగిళ్ల కొండలు జన్మించాడు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు.. జానపదాలు అంటే.. ఆ యువకుడికి ప్రాణం. తన మాటలే పాటలుగా వినిపిస్తాయి. ‘పల్లెకు వందనం.. కన్నతల్లికి వందనం... పాట నేర్పిన పల్లెకు వందనం...’ అంటూ పుట్టిన పల్లెకు ..కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. రచయితగా.. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలోని అన్ని జిల్లాల్లో సుమారు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కాలుకు గజ్జకట్టి భూజాన గొంగడి వేసుకొని రాత్రనక, పగలనక తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వెనుకబాటు తనం, తెలంగాణ యాస, భాష, గోసలపై తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాడు త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్నరావు క్యాంపుకు చెందిన నాగిళ్ల బక్కయ్య–బుచ్చమ్మల దంపతులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. వీరికి రెండవ సంతానం అయిన నాగిళ్ల కొండలుకు చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో పాటలను పాడుతూ ఆకట్టుకునే వాడు.
నల్లగొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ‘తల్లి నీ ఒడినిండా .. త్యాగాల మూట... పల్లె నీ బతుకంతా...ఉద్యమాల బాట...గాయాలు గుండెనిండా..ఎత్తేను పోరాట జెండా...అలుపన్నది ఎరుగకుండా కదిలేను నా.. నల్లగొండా...’ అనే జిల్లా చరిత్ర పాటలను వరంగల్‌లో జరిగిన ధూం ధాంలో పాడితే ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి దగాపడ్డా తెలంగాణపై దండు కదలాలని తమ వంతుగా పాత్రను పోషించి.. పాటమ్మ..నాకు ప్రాణా మా.. అంటూ ఉర్రూతలూగించాడు. ఇతను పాటగాడే కా దు.. రాతగాడు కూడా... ప్రజల మాటలను పాట లు గా అల్లి.. పాడే ప్రజా కళా కారుడు నిరుపేద కుటుం బం నుంచి..వచ్చి... పాటే తన ప్రాణంగా.. నేటి వరకు ఎన్నో గీతాలు, పాటలను రచించి పాడాడు. చిన్నతనం నుంచే పాటలు పాడటంతో పాటు పల్లెల్లో దండోరాను మోగించేవాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై పల్లెల్లో ప్రజలకు పాటలను వినిపించేవాడు.
800 వరకు ప్రదర్శనలు
ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలకు అడుగులు కలిపినా... విమలక్క ధూంధాం జాతరలో దుముకులాడిన... ఫైలం సంతోష్, గిద్దె రామనర్సయ్య పాటలతో గొంతు కలిపినా...అన్నీ తెలంగాణ జన సైన్యం కోసమే. ప్రజా కళాకారుడిగా గత 10 ఏళ్లుగా సుమారు 800 వరకు ప్రదర్శనలను ఇచ్చి ప్రజలందరి మన్ననలను పొందాడు. తెలం గాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిన ఇతను పలు జిల్లాలతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పట్ట ణాల్లో తన ఆట పాటలను ప్రదర్శించారు. మిత్ర రాసే పాటలను మితిమీరంగా అభిమానించే కొండలు విమలక్క ఆటా పాటలకు జతకట్టాడు. ఉద్యమాలకు పుట్టినిళ్లు నల్లగొండ వెలుగొందుతున్న నాగిళ్ల కొండలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాంçస్కృతిక కళా వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశాడు.
కలంనుంచి జాలు వారిన పాటల ఒరవడి
తన కలం ..గళం నుంచి వెలువడిన పాటలు పేదోళ్ల బతుకు చిద్రంను చూపించేవి. పేదోళ్ల వెతలపై అతని కలం కవాతు చేసేది. ‘పల్లె యాడికొస్తుందంటూ’ చిన్నతనంలో తన గ్రామంలో పద్దులు, ఉయ్యాల పాటలను పాడి అమ్మలక్కలను. బాగోతం చెప్పే పెద్దమనుషులను, సారా తాగి ఊగోళ్ల తంతును నమ్మకాలు, జానపదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలతో పాటు అనేక అంశాలపై పాటలను రాసి ఆల్బం తయారు చేశాడు. తెలంగాణ సాంస్కృతిక సారధిగా పని చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పతకాలపై పాటలను రాసి బంగారు తెలంగాణ కోసం పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేశాడు. ఈ సంక్షేమ పథకాలపై ఆల్భంను తయారు చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతే కాకుండా హరితహారం వంటి కార్యక్రమాలకు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసలు పొందాడు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం
ప్రస్తుతం కనుమరుగు అవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సి ఉంది. నాడు జనపదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ నేటి కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలను కూడా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన ప్రతి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.
– నాగిళ్ల కొండల్