నడి సముద్రంలో ఓ బోటు. అందులోనే రెండున్నర గంటల సినిమా అంటే.. హా ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ 'కొండల్' అనే డబ్బింగ్ బొమ్మ నిజంగానే ఆశ్చర్యపరిచింది. చూస్తున్నంతసేపు సముద్రం మధ్యలో బోటులో ఉన్నామా అనేంతలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?
'కొండల్' కథ విషయానికొస్తే.. అదో సముద్ర తీర ప్రాంతం. ఎందరో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లలో ఒకడే ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్). ఎలాంటి వాడితోనైనా సరే ఢీ కొట్టే రకం. ఓసారి కొత్త బృందంతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు. తమ బోటులోకి కొత్తగా వచ్చిన ఇతడిపై జూడ్ (షబీర్) గ్యాంగ్ కన్నేసి ఉంచుతారు. కొన్నిరోజులకు ఇమ్మాన్యుయేల్ గురించి ఓ సీక్రెట్ తెలుస్తుంది. కాదు కాదు అతడే చెబుతాడు. దీంతో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు? ఇమ్మాన్యుయేల్ ఎవరు? డేనియల్ అనే వ్యక్తితో ఇతడికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)
'కొండల్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో రివేంజ్ స్టోరీతో తీసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. రెండున్నర గంటల సినిమాలో దాదాపు రెండు గంటల పాటు కథంతా సముద్రం మధ్యలో ఓ బోటులోనే ఉంటుంది. అసలు బోటులో ఏం స్టోరీ చెప్పగలరు? మహా అయితే ఏం చూపిస్తారులే అని మనం అనుకుంటే పప్పులే కాలేసినట్లే.
మత్స్యకారులు జీవితాలు ఎలా ఉంటాయి? రోజుల తరబడి వేటకు వెళ్లిన వాళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు? ఒకవేళ వేటకు వెళ్లిన వాళ్లలో గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాలని చాలా నేచురల్‌గా చూపించారు. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటాయి. మరోవైపు రివేంజ్ డ్రామా నడిపిన విధానం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
ఫస్టాఫ్ అంతా స్టోరీ సెటప్ కోసం వాడుకోగా.. ఇంటర్వెల్‌కి హీరో గురించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో vs విలన్ అన్నట్లు సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్‌లో షార్క్ ఫైట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంకా చెప్పాలంటే షార్క్ ఫైట్ అనేది 'దేవర'లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త రిచ్‌గా చూపించారు.
సినిమాలోని సీన్స్‌తో పాటు ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నటీనటులెవరు అనే విషయం పక్కనబెడితే తెరపై పాత్రల స్వభావం మాత్రమే కనిపిస్తుంది. మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండరు. కానీ సినిమా మొదలైన కాసేపటికే లీనమైపోతాం. ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే 'కొండల్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment