korukonda sainik school
-
విజయ కాగడాకు ఘన స్వాగతం..
సాక్షి,విజయనగరం రూరల్: విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 16 నుంచి విజయ్ వర్ష్ వేడుకలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోకి ప్రవేశించిన విజయ కాగడా (విక్టరీ టార్చ్)కు కోరుకొండ సైనిక్ స్కూల్ వద్ద కలెక్టర్ ఎ.సూర్యకుమారి, స్కూల్ ప్రిన్సిపాల్, కల్నల్ అరుణ్ ఎం.కులకర్ణి, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. తూర్పు నావికాదళ అధికారులు కాగడాను ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ్ ఎం.కులకర్ణి మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల సేవలు వెలకట్టలేనివన్నారు. నాటి కథనరంగంలో విరోచితంగా పోరాడి విజయాన్ని సాధించిపెట్టిన సైనికులు, అమరవీరుల సేవలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. అప్పటి యుద్ధంలో అమరులైన అమరవీరుల గ్రామాలను పునీతంచేస్తూ తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 16 నాటికి విజయ కాగడా ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం యుద్ధ వీరులు, వీరనారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సైనిక్ స్కూల్ పరిపాలనాధికారి అమిత్ బాలేరావు, తూర్పు నావికాదళ అధికారులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: Taliban-India: భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం! -
సైనిక పాఠశాల ఫలితాలు విడుదల
సాక్షి, విజయనగరం: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ కల్నల్ అరుణ్ కుమార్ విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 180 మంది ఉత్తీర్ణత సాధించగా, తొమ్మిదో తరగతికి 60 మంది అర్హత సాధించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మార్చి మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. కాగా 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు సుమారు 60 సీట్లు, 9వ తరగతిలో ప్రవేశానికి 20 సీట్లకు దరఖాస్తు ఆహ్వానించారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5న రాతపరీక్ష నిర్వహించారు. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,043 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. పరీక్షా ఫలితాలు, మరిన్ని వివరాల కోసం సైనిక పాఠశాల వెబ్సైట్ www.sainikschoolkorukonda.org ని సందర్శించండి. -
కోరుకొండ సైనిక్‌స్కూల్ పరీక్ష ఫలితాలు
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాలలో 2018– 19 సంవత్సరానికి గాను ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి గత నెల 7వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను www. sainikschoolkorukonda. org వెబ్సైట్లో పొందుపరిచినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ కల్నల్ రుద్రాక్ష అత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఇంటర్యూలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు కాల్‌లెటర్ పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 08922–246119, 246168 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ప్రతిభావంతులకు సువర్ణావకాశం
విజయనగరం రూరల్: ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు అరుదైన సువర్ణావకాశం. కోరుకొండ సైనిక పాఠశాలలో 2018–19 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను పాఠశాలలో అందజేయనున్నారు. ► ప్రవేశ పరీక్ష, కేంద్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్ పరీక్ష కేంద్రాల్లో 2018 జనవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ► దరఖాస్తు చేసే విధానం దరఖాస్తు, ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు, గతేడాది ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు, ప్రాస్పెక్టస్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో లభిస్తాయి. జనరల్ అభ్యర్థులు రూ.450 డీడీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీని ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, కోరుకొండ, విజయనగరం జిల్లా, పిన్–535214 చిరునామాపై ఎస్బీఐ సైనిక్ స్కూల్ బ్రాంచి, కోడ్ నంబర్ 2791కు చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. ఆన్లైన్లో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు రూ.250 డీడీ తీసి స్కూల్ వెబ్సైట్ డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎస్ఎఐఎన్ఐకెఎస్సిహెచ్ఒఒఎల్కెఒఆర్యుకెఒఎన్డిఎ.ఒఆర్జి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో ఒరిజినల్ డీడీని జతపరచి డిసెంబర్ 5 లోగా కోరుకొండ సైనిక పాఠశాలకు పోస్టులో పంపాలి. మనియార్డర్లు, పోస్టల్ ఆర్డర్లను అంగీకరించమని అధికారులు తెలిపారు. ► పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సైనిక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరవుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మించకపోతే పాఠశాల పథకం ద్వారా, ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలను మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా వారికి ఉచిత విద్య, ట్యూషన్ ఫీజు, దుస్తులు, భోజన ఖర్చులు లభిస్తాయి. ► రిజర్వేషన్లు ఎస్సీ కేటగిరికి 15 శాతం, ఎస్టీ కేటగిరికి 7.5 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తారు. డిఫెన్స్ కేటగిరిలో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 67 శాతం సీట్లను, 33 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించనున్నారు. ► 100 సీట్లకు దరఖాస్తులు వచ్చే విద్యాసంవత్సరంలో కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు సుమారు 80 సీట్లు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 20 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. పాఠశాలలో పదో తరగతి, 12వ తరగతుల వరకు సీబీఎస్ఈ విధానంలో బోధన జరుగుతుంది. ► పరీక్ష విధానం ఆలిండియా సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు ప్రశ్నల మల్టిపుల్ చాయిస్ విధానం ఉంటుంది. ► అర్హతలు ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 02–07–2007 నుంచి 01–07–2008 మధ్య జన్మించి ఉండాలి. తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 02–07–2004 నుంచి 01–07–2005 మధ్య జన్మించి ఉండాలి. ఇతర వివరాలకు 08922–246119, 246168 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సైనిక పాఠశాల అధికారులు తెలిపారు. ► ప్రతిభకే పట్టం ప్రవేశ పరీక్ష మార్కులు, ఇంటర్వూ్య, వైద్య పరీక్షల ఆధారంగానే ఎంపిక చేస్తాం. కోచింగ్ సెంటర్లు, ఏజెంట్లను నమ్మవద్దు. ప్రవేశ పరీక్షకు కనీసం రెండు నెలలపాటు సాధన చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు సులభంగా ఉన్నట్టున్నా ఆలోచించి వేగంగా రాయాల్సి ఉంటుంది. – కల్నల్ రుద్రాక్ష అత్రి, ప్రిన్సిపల్,కోరుకొండ సైనిక పాఠశాల -
3న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు
విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక్ స్కూల్లో 2016-17 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలను వచ్చే జనవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.రవికుమార్ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏపీ, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు గణితం, లాంగ్వేజ్ ఎబిలిటీ, మధ్యాహ్నం 12 నుంచి 12.50 గంటల వరకు మెంటల్ఎబిలిటీ పరీక్ష ఉంటుందన్నారు. అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు గణితం, సైన్స్ పరీక్ష, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఇంగ్లిష్, సోషల్ పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం (ఆర్సీఎం లయోలా ఇంగ్లిష్ మీడియం స్కూల్- ఇలిసిపురం), విజయనగరం (సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్), విశాఖ (ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్), రాజమండ్రి (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల- డీలక్స్ సెంటర్), విజయవాడ (కేబీసీ జెడ్పీ బాలుర హైస్కూల్- పటమ ట), గుంటూరు (మాజేటి గురవయ్య హైస్కూల్), హైదరాబాద్ (కీస్ బాలికల హైస్కూల్- సికింద్రాబాద్). కరీంనగర్ (ప్రభుత్వ పాఠశాల). -
సైనిక పాఠశాల సమావేశానికి హాజరైన వైస్ అడ్మిరల్
విజయనగరం రూరల్: విజయనగరం పట్టణంలోని కోరుకొండ సైనిక పాఠశాల 122వ పాలక మండలి సమావేశానికి తూర్పు నావికా దళ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని బుధవారం హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సైనిక పాఠశాల ఛైర్మన్ హోదాలో ఈ సమావేశానికి సతీశ్ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడాలన్నారు. రక్షణ రంగంలో విద్యార్థులు చేరేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఎన్డీఏ లక్ష్యంగా చేసుకుని అందుకు తగ్గ కృషి చేయాలని వైస్ అడ్మిరల్ సతీశ్ సోని కోరారు.