కోరుకొండ సైనిక పాఠశాల
విజయనగరం రూరల్: ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు అరుదైన సువర్ణావకాశం. కోరుకొండ సైనిక పాఠశాలలో 2018–19 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను పాఠశాలలో అందజేయనున్నారు.
► ప్రవేశ పరీక్ష, కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్ పరీక్ష కేంద్రాల్లో 2018 జనవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
► దరఖాస్తు చేసే విధానం
దరఖాస్తు, ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు, గతేడాది ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు, ప్రాస్పెక్టస్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో లభిస్తాయి. జనరల్ అభ్యర్థులు రూ.450 డీడీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీని ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, కోరుకొండ, విజయనగరం జిల్లా, పిన్–535214 చిరునామాపై ఎస్‌బీఐ సైనిక్ స్కూల్ బ్రాంచి, కోడ్ నంబర్ 2791కు చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు రూ.250 డీడీ తీసి స్కూల్ వెబ్‌సైట్ డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎస్‌ఎఐఎన్‌ఐకెఎస్‌సిహెచ్‌ఒఒఎల్‌కెఒఆర్‌యుకెఒఎన్‌డిఎ.ఒఆర్‌జి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో ఒరిజినల్ డీడీని జతపరచి డిసెంబర్ 5 లోగా కోరుకొండ సైనిక పాఠశాలకు పోస్టులో పంపాలి. మనియార్డర్లు, పోస్టల్ ఆర్డర్లను అంగీకరించమని అధికారులు తెలిపారు.
► పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు
సైనిక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరవుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మించకపోతే పాఠశాల పథకం ద్వారా, ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలను మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా వారికి ఉచిత విద్య, ట్యూషన్ ఫీజు, దుస్తులు, భోజన ఖర్చులు లభిస్తాయి.
► రిజర్వేషన్లు
ఎస్సీ కేటగిరికి 15 శాతం, ఎస్టీ కేటగిరికి 7.5 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తారు. డిఫెన్స్ కేటగిరిలో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 67 శాతం సీట్లను, 33 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించనున్నారు.
► 100 సీట్లకు దరఖాస్తులు
వచ్చే విద్యాసంవత్సరంలో కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు సుమారు 80 సీట్లు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 20 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. పాఠశాలలో పదో తరగతి, 12వ తరగతుల వరకు సీబీఎస్‌ఈ విధానంలో బోధన జరుగుతుంది.
► పరీక్ష విధానం
ఆలిండియా సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు ప్రశ్నల మల్టిపుల్ చాయిస్ విధానం ఉంటుంది.
► అర్హతలు
ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 02–07–2007 నుంచి 01–07–2008 మధ్య జన్మించి ఉండాలి. తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 02–07–2004 నుంచి 01–07–2005 మధ్య జన్మించి ఉండాలి. ఇతర వివరాలకు 08922–246119, 246168 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సైనిక పాఠశాల అధికారులు తెలిపారు.
► ప్రతిభకే పట్టం
ప్రవేశ పరీక్ష మార్కులు, ఇంటర్వూ్య, వైద్య పరీక్షల ఆధారంగానే ఎంపిక చేస్తాం. కోచింగ్ సెంటర్లు, ఏజెంట్లను నమ్మవద్దు. ప్రవేశ పరీక్షకు కనీసం రెండు నెలలపాటు సాధన చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు సులభంగా ఉన్నట్టున్నా ఆలోచించి వేగంగా రాయాల్సి ఉంటుంది. – కల్నల్ రుద్రాక్ష అత్రి, ప్రిన్సిపల్,కోరుకొండ సైనిక పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment