అవయవదానంపై కాలినడకన ప్రచారం
గుంటూరు : ప్రజల్లో అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొవ్వూరు రమేష్‌రెడ్డి కాలినడకన మంగళవారం గుంటూరు వచ్చారు. ఫిబ్రవరి 12న తిరుపతిలో బయలుదేరిన ఆయన 460 కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు రావడంతో మంగళవారం పలువురు వైద్యులు రమేష్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2003లో లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని, నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. 2009లో కిడ్నీమార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకున్నానని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, ప్రజలు అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు తొలిసారి 2014 సెప్టెంబర్ 4న ప్రొద్దుటూరు నుంచి తిరుపతి వరకు 230 కిలోమీటర్లు కాలినడకన ప్రజలకు అవయవదానంపై అవగాహన పత్రాలను అందజేసి వివరించానన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లక్షలాది మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, వారందరినీ అవయవదానం ద్వారా బతికించవచ్చని వెల్లడించారు. సన్మాన కార్యక్రమంలో వేదాంత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ చింతా రామకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.