అది ప్రభుత్వ హత్యే: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో లంచం ఇవ్వనందుకు వైద్యమందక కృష్ణానాయక్ మృతి చెందాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణానాయక్ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కృష్ణానాయక్‌ను లంచం కోసం పొట్టనబెట్టుకున్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తీరు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనితీరుకు నిదర్శనమని అన్నారు. కేవలం 150 రూపాయల కోసం నిండుప్రాణాన్ని బలితీసుకునే స్థాయిలో అవినీతి రాజ్యమేలుతుంటే తెలంగాణలో అవినీతి రహితపాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
ప్రాణం ఖరీదు రూ. 150!
ప్రభుత్వాస్పత్రుల్లో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం పెరిగిపోయాయని ఎన్నిసార్లు చెప్పినా, పలు సంఘట నలు జరిగినా సీఎంకు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఒక గిరిజనుడు బలైపోతే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనే కనీస భయం కూడా ముఖ్యమంత్రికి, మంత్రికి లేదని, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే శాసనసభ నుంచి తనను అన్యాయంగా సస్పెండ్ చేసిందన్నారు.
మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరి హారం ఇవ్వాలని, నలుగురు పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్టించుకోకుంటే గిరిజనులను అవమానించినట్టేనన్నారు. మృతుడు కృష్ణానాయక్ కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.