దర్శకుడిగా నాన్న దగ్గరే ఎక్కువ నేర్చుకున్నా
తెలుగు సినిమాకు 82 ఏళ్ళు.అందులో దాదాపు 75 ఏళ్ళుగా ఈ రంగంతో మమేకమైన కుటుంబం కోవెలమూడి వారిది.నటుడిగా మొదలై, నిర్మాతగా మారి, దర్శకుడిగా, స్టూడియోఅధినేతగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పేరు తెచ్చుకున్న ఘనత - స్వర్గీయ కె.ఎస్. ప్రకాశరావుది.ఆయన కుమారుడు కె. రాఘవేంద్రరావు శతాధిక చిత్ర దర్శకుడై, తెలుగు సినిమా వాణిజ్య విశ్వరూపాన్ని చూపెట్టారు.
మరో కుమారుడు కె. కృష్ణమోహనరావు నిర్మాతగా భారీ చిత్రాలు అందించారు.ఇంకో కుమారుడు స్వర్గీయ కె.ఎస్. ప్రకాశ్ కెమేరామన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక, తాత పేరే పెట్టుకున్న మనుమడుసూర్యప్రకాశ్ కోవెలమూడి అచ్చంగా తాత లాగే ఇప్పుడు నటుడు, నిర్మాత, దర్శకుడు.ఇవాళ కె.ఎస్. ప్రకాశరావు శతజయంతి. తండ్రిది నూరేళ్ళు.1964లో సినీ రంగానికి వచ్చిన కుమారుడు రాఘవేంద్రరావు
సినీ కెరీర్‌కు సరిగ్గా యాభయ్యేళ్ళు. ఈ శతజయంతి వేళకోవెలమూడి సినీ వారసుల నోట తొలితరం దర్శక, నిర్మాణ దిగ్గజం కె.ఎస్. ప్రకాశరావు జ్ఞాపకాల ‘ట్రిపుల్ ధమాకా’ .... ఇన్నేళ్ళుగా భేటీలకు దూరంగా ఉన్న దర్శకేంద్రుడు తొలిసారిగా పెదవి విప్పి, ఓ పత్రికకు ఇచ్చిన సాధికారిక ఇంటర్వ్యూ...
‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం.
కె.ఎస్. ప్రకాశరావు గారి పుట్టుపూర్వోత్తరాలు ఇప్పటి తరానికి తెలియవు. ఆయన సినీ రంగంలోకి ఎలా వచ్చారు?
కె. కృష్ణమోహనరావు: నూరేళ్ళ క్రితం 1914 ఆగస్టు 27న మా నాన్న గారు జన్మించారు. ఆయన పుట్టింది విజయవాడకు 12 మైళ్ళ దూరంలోని కోలవెన్నులో. ప్రాథమిక చదువు కేసరపల్లిలో. గన్నవరంలో హైస్కూల్‌తో చదువు ఆగింది.
కె. రాఘవేంద్రరావు: ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారుగా! అందుకే, మా నాన్న గారు పై చదువులు చదవలేకపోయారు. మా అమ్మ కోటీశ్వరమ్మకూ, నాన్నకూ ముడిపెట్టేశారు. పెళ్ళయ్యాక, విజయవాడకు మకాం మార్చారు.
కృష్ణమోహనరావు: మా అమ్మ వాళ్ళు చెబుతుంటే విన్నదేమిటంటే, మా నాన్న గారు అక్కడ మొదట్లో ఒక చిన్న బంగారు నగల దుకాణంలో పనిచేశారట. అక్కడ కొద్ది నెలలు చేశాక, ఒక బ్రిటీషు ఇన్స్యూరెన్స్ సంస్థలో మేనేజర్ స్థాయిలో వ్యవహరించారు. తరువాతి రోజుల్లో ప్రముఖ సినీ గీత రచయితగా పేరు తెచ్చుకున్న కొసరాజు రాఘవయ్య చౌదరి మా నాన్న గారి దగ్గర బీమా ఏజెంట్‌గా వ్యవహరించారట.
గూడవల్లి రామబ్రహ్మంకూ, మీకూ చుట్టరికముందని విన్నా!
రాఘవేంద్రరావు: అసలు మా నాన్న గారికి సినిమా రంగం మీద పెద్ద ఆసక్తి లేదు. అయితే, అప్పట్లో దర్శక - నిర్మాత రామబ్రహ్మం గారి ‘మాలపిల్ల’ (1938) సినిమా చూసి, పత్రికలో దాని మీద వ్యాసం రాశారట. అది రాసిందెవరా అని ఆరా తీసి, మా నాన్న గారి స్ఫురద్రూపం, కంఠం లాంటివన్నీ చూసి, రామబ్రహ్మం బలవంతాన ఆయనను సినీ రంగానికి తీసుకువచ్చారట. ‘అపవాదు’ (1941)లో హీరోగా నటింపజేశారు. ఆ వెంటనే, ప్రసిద్ధ తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ ఆధారంగా తీసిన ‘పత్ని’ (’42)లో హీరో కోవలన్ పాత్ర చేయించారు. అలా మా నాన్న గారు, ఆయన చాలా సన్నిహితులయ్యారు. ఈ క్రమంలో మాకూ, రామబ్రహ్మం గారికీ చుట్టరికంగా ఉందన్న సంగతి బయటపడింది. ఆ రోజుల్లో ప్రజానాట్యమండలితో నాన్న గారికి సంబంధం ఉండేదట.
నటించిన చాలాకాలానికి నాన్న గారు నిర్మాతయ్యారే?
కృష్ణమోహనరావు: 1946లో కుటుంబంతో సహా నాన్న గారు మద్రాసుకు మకాం మార్చారు. రామబ్రహ్మం జబ్బునపడడంతో సారథీ వారి ‘పల్నాటి యుద్ధం’ సగంలో ఆగింది. ఇక, తాను కోలుకోవడం కష్టమని గ్రహించి, ‘దర్శకత్వ బాధ్యత చేపట్టి, ఆ సినిమా పూర్తి చేయి’ అని నాన్న గారిని కోరారట. కానీ, ఆయన, ‘ప్రతిభా’ శాస్త్రి, ఇతర మిత్రులు బొంబాయి వెళ్ళి, ఎల్.వి. ప్రసాద్‌ను తీసుకువచ్చి, ‘పల్నాటి యుద్ధం’ (’47) పూర్తి చేయించారు. ‘గృహప్రవేశం’ (’48)కి కూడా ఎల్.వి. ప్రసాదే దర్శకులు.
దానికి నాన్న గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగే, ఇన్సూరెన్స్ వ్యవహారాల ద్వారా మా నాన్న గారికీ, చల్లపల్లి రాజా గారికీ బాగా పరిచయం. ఆయన చైర్మన్‌గా, కోవెలమూడి భాస్కరరావు, కంచర్ల నారాయణరావు డెరైక్టర్లుగా ‘స్వతంత్ర ఫిలిమ్స్’ పేరిట లిమిటెడ్ కంపెనీని నాన్న గారు పెట్టారు. తాను, జి. వరలక్ష్మి హీరో హీరోయిన్లుగా, కోన ప్రభాకరరావు విలన్‌గా ‘ద్రోహి’ (’48) తీశారు. అలా నిర్మాణంలోకొచ్చారు.
ప్రకాశ్ ప్రొడక్షన్స్ పెట్టడం... దర్శకుడిగా మారడం...?
రాఘవేంద్రరావు: ‘స్వతంత్ర’ తరువాత 1949లో సొంతంగా ‘ప్రకాశ్ ప్రొడక్షన్స్’ స్థాపించారు. సముద్రంలో నౌకలకు దారి చూపే లైట్ హౌస్ దానికి లోగోగా పెట్టడంలోనే ఆయన అభ్యుదయ భావన అర్థం చేసుకోవచ్చు. ‘మొదటి రాత్రి’ (’50)తో దర్శకుడిగానూ అవతారమెత్తారు. మద్రాసులో ‘ప్రకాశ్ స్టూడియో’ కట్టి, దర్శక, నిర్మాతగా ఎదిగారు.
మీరెంతమంది? నాన్నతో అనుబంధమెలా ఉండేది?
కృష్ణమోహనరావు: నేను అందరి కన్నా పెద్ద. 1940లో పుట్టా. నాకూ, రాఘవేంద్రరావుకూ రెండేళ్ళు తేడా. ఆ తరువాత మా చెల్లెళ్ళు స్వతంత్ర, మంజుల. మరో సోదరుడైన కెమేరామన్ స్వర్గీయ కె.ఎస్. ప్రకాశేమో మంజుల తోటివాడు.
రాఘవేంద్రరావు: ఆయన ఫ్రీగా, ఓపెన్‌గా ఉండేవారు. కానీ, మేము చనువుగా ఉండలేకపోయేవాళ్ళం. చివరి వరకు ఆయనంటే మాకు భక్తి, గౌరవం, అభిమానం.
ఆయన సినీ వారసత్వాన్ని పిల్లలుగా మీరంతా అందిపుచ్చుకున్నారు. మిమ్మల్ని నాన్నగారు ప్రోత్సహించేవారా?
కృష్ణమోహనరావు: అందరి కన్నా ముందు మా పెద నాన్న గారబ్బాయి కె. బాపయ్య, తర్వాత తమ్ముడు రాఘవేంద్రరావే సినిమాల్లోకి వచ్చారు. నేనేమో బి.ఎస్సీ చదివా. నాకేమో పై చదువులు చదువుకోవాలనీ, కెమేరామన్ కావాలనీ ఉండేది. నాన్న గారేమో అన్నదమ్ములిద్దరూ సినిమాల్లో ఉండడమెందుకంటూ, నన్ను ఉద్యోగం చేయమన్నారు.
రాఘవేంద్రరావు: ఆదుర్తి సుబ్బారావు, వి. మధుసూదనరావు, కె.బి. తిలక్ తదితరులంతా నాన్న గారి శిష్యులే. అప్పుడే నన్ను మొదట ఆదుర్తి దగ్గర పెడదామనుకున్నారు. ముందుగా, ఎడిటర్ సంజీవి దగ్గర చేర్చారు. వెనక్కొచ్చేసి, బి.ఏ. చేశా. 1964లో కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర ‘పాండవ వనవాసం’కి సహాయకుడిగా చేరా. అలా సరిగ్గా 50 ఏళ్ళ క్రితం నా సినీయానం మొదలైంది. అప్పటి నుంచి ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (’71) దాకా నాన్న గారి దగ్గరే చేశా. నాన్న గారే కథ రాసిన ‘బాబు’ (’75)తో దర్శకుడినయ్యా.
కృష్ణమోహన్ గారూ! బయట ఉద్యోగం చేయమన్నాక మరి మీరు నిర్మాత ఎప్పుడు, ఎలా అయ్యారు?
కృష్ణమోహనరావు: మా నాన్న గారి మిత్రులైన పారిశ్రామికవేత్త పి. ఓబుల్‌రెడ్డి గారి సంస్థలో పన్నెండేళ్ళు పనిచేశా. అక్కడ పైకొచ్చే అవకాశాలు లేవని గ్రహించి నాన్న గారు చివరకు నన్నూ సినిమాల్లోకి రమ్మన్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత చిత్ర నిర్మాణం ప్రారంభిస్తూ, స్వీయదర్శకత్వంలో ‘సుప్రభాతం’ (’75) తీస్తూ, నన్ను నిర్మాతను చేశారు. కానీ, తీసిన చిత్రాలాడలేదు. దాంతో, నిర్మాణానికి దూరమయ్యారు. దర్శకుడిగా కొనసాగారు. దర్శకుడిగా ఆయన ఆఖరు చిత్రం ఏయన్నార్ నటించిన ‘ముద్దుల మొగుడు’.
అన్నదమ్ములిద్దరూ కలిసి నిర్మాతలైందెప్పుడు?
కృష్ణమోహనరావు: రాఘవేంద్రరావుకు మొదటి నుంచీ ప్రొడక్షన్ అంటే భయం. కానీ, మా అన్నదమ్ములిద్దరినీ నిర్మాతలుగా కొనసాగమన్నది నాన్నగారే. అప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు జోరు మీదున్నాడు. ‘ఎప్పుడూ బయటవాళ్ళకు సినిమాలు తీయడమే కాదు. యేటా మన సొంతానికి ఒక సినిమా అయినా తీసుకోవాల’ని నాన్న గారు చెప్పారు. ఆర్.కె.ఫిల్మ్ అసోసియేట్స్ పెట్టి, ‘భలే కృష్ణుడు’(’80)తో నిర్మాణం చేపట్టాం. నేను ప్రొడక్షన్ చూస్తే, రాఘవేంద్రరావు దర్శకత్వంపై దృష్టి పెట్టేవాడు. అలా ‘పాండురంగడు’ (’08) దాకా చాలా తీశాం.
రాఘవేంద్రజీ! నూటికి పైగా చిత్రాలు తీసిన మీరు నాన్న గారి నుంచి నేర్చుకున్న మెలకువలేమిటి?
రాఘవేంద్రరావు: దర్శకుడిగా నేను ఎక్కువ నేర్చుకున్నది నాన్న గారి దగ్గర నుంచే. ఆయన మంచి స్క్రీన్‌ప్లే రచయిత. ఒక కథను తెరపై ఎలా చూపాలన్నది ఆయనకు బాగా తెలుసు. ఆయన తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే సహాయకులకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి, వారితో సీన్లు కూడా తీయించేవారు. మేము తీసినవి చూశాక, అందులో తప్పొప్పుల గురించి మాకు చెప్పేవారు. అలాగే, ‘ప్రేక్షకులను ఎక్కువ విసిగించకూడదు. సన్నివేశాల నిడివిని తగ్గించుకోవడానికి మమకారం చంపుకోవాలి’ అని నాకు చెప్పేవారు. మొదట్లో కష్టపడి సీన్ తీసినా, కట్ చేస్తున్నారేమిటి అనేవాణ్ణి. క్రమంగా అర్థం చేసుకున్నా. నిర్మాత లేనిదే దర్శకులం లేమన్న గ్రహింపు ఆయన నుంచే నాకొచ్చింది. నిర్మాతతో ఎలా వ్యవహరించాలన్నదీ ఆయన్నుంచే నేర్చుకున్నా.
అసిస్టెంట్‌గా మీ సలహాలు ఆయన తీసుకొనేవారా?
రాఘవేంద్రరావు: తప్పకుండా! ‘బందిపోటు దొంగలు’ (’68) సినిమా బ్లాక్ అండ్ వైట్. కాకపోతే, మైసూర్ బృందావన్ గార్డెన్స్‌లో ఏయన్నార్, జమున మీద తీసిన ‘విన్నానులే ప్రియా...’ పాట కలర్లో తీశాం. అప్పుడు పై నుంచి వచ్చే నీళ్ళలో రంగు పౌడర్లు కలిపితే, రంగునీళ్ళతో కలర్లో బాగుంటుందని అనిపించి, ఆ మాటే చెప్పా. ఒప్పుకొన్నారు. ఇక, ‘కోడెనాగు’(’74) లో లక్ష్మి, శోభన్‌బాబు మీద వచ్చే ‘సంగమం అనురాగ సంగమం’ పాట చిత్రీకరణ లోనూ నా మాటకు విలువిచ్చారు. అలాంటి సంగతులు చాలా ఉన్నాయి.
మీ చిత్రాలు చూసి, ఆయన మీకిచ్చిన ఉత్తమ ప్రశంస, విమర్శ?
(రాఘవేంద్రరావు ఆలోచనలో పడగానే... అందుకుంటూ...)
కృష్ణమోహనరావు: మా సినిమాలే కాదు... ఏ సినిమా చూసి వచ్చినా సరే, ఆయన తన డైరీలో ఆ సినిమా గురించి తన అభిప్రాయాలు, కథలోని బలాబలాలు, చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల లాంటివన్నీ రివ్యూ రాసుకొనేవారు. ఇక, సంతానం పైకి రావడం పట్ల ఆనందం, సంతోషం ఉన్నా, లోలోపలే ఉంచుకొనేవారు. తమ్ముడు తీసిన సినిమా చూశాక తనకు అనిపించినవి ఏదైనా ఉంటే, చిన్నగా సలహా రూపంలో చెప్పేవారు. వాణిజ్య అంశాల గురించి తనకున్న భిన్నాభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేస్తూనే, ‘ఇవాళ మీ సినిమాలకు ఇవే కావాలేమోలే’ అనేవారు.
రాఘవేంద్రజీ, రూపకల్పనలో మీ నాన్న గారికీ, మీకూ ఉన్న తేడా?
రాఘవేంద్రరావు: అంతా పేపర్ మీద పెట్టడం ఆయనకు అలవాటైతే, నేనేమో దానికి పూర్తి విరుద్ధం. ఒకసారి సీన్ పేపర్ చూసుకొన్నాక, అంతా మైండ్‌లోనే ఉంటుంది. ఫలానా షాట్ ఫలానా లాగా తీయాలని అనుకొని, చేసుకుంటూ పోతుంటా. ఆయనలో విశేషం ఏమిటంటే, ఆర్టిస్టులతో ఆయన బాగా స్నేహంగా ఉండేవారు. ఎంతటి హీరో, హీరోయిన్లతోనైనా చిటికెలో స్నేహం పెంచుకొనేవారు. ఇబ్బంది కలగకుండా, జాగ్రత్తగా చూసుకుంటూనే తనకు కావాల్సిన నటన రాబట్టుకొనేవారు.
కృష్ణమోహనరావు: ఆర్టిస్టులను సుకుమారంగా డీల్ చేస్తూ, పని రాబట్టడమనే కళ ఆయన నుంచి మా తమ్ముడికీ అబ్బింది (నవ్వులు...)
టాలెంట్ చూసి, తొలి అవకాశాలివ్వడంలోనూ నాన్న గారిది రికార్డే!
రాఘవేంద్రరావు: పెండ్యాల గారిని ‘ద్రోహి’తో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఆత్రేయ గారిని ‘దీక్ష’తో పాటల రచయితను చేశారు. ఈ సినిమాతోటే నటులు రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడలూ పరిచయమయ్యారు. ‘కన్నతల్లి’తో పి. సుశీల గారిని నేపథ్యగాయనిగా, రాజసులోచనను నటిగా పరిచయం చేశారు.
ఒక దర్శకుడిగా ఆయనలోని గొప్పదనం ఏమిటంటారు?
రాఘవేంద్రరావు: నాన్న గారు బాగా క్రియేటివ్. ఎప్పుడూ ఏవో కథలు రాసేవారు. సీన్ పేపర్లో ఎడమపక్కన ఆయనే స్వయంగా రాసుకొనే యాక్షన్ పార్ట్, షాట్ డివిజన్ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఆ సీన్ పేపర్ చూస్తూ, ఎవరైనా ఇట్టే దర్శకత్వం వహించవచ్చు.
దర్శకుడిగా మీ నాన్న గారు చేసిన ప్రయోగాల మాటేమిటి?
రాఘవేంద్రరావు: దర్శకుడిగా, నిర్మాతగా మొదటి నుంచి ఆయన చేసినవన్నీ ప్రయోగాలే. హీరోగా నటిస్తున్న రోజుల్లోనే, సిహెచ్. నారాయణరావును హీరోగా పెట్టి, తాను విలన్‌గా నటిస్తూ ‘మొదటి రాత్రి’ (’50) స్వీయదర్శకత్వంలో నిర్మించారు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాలూ తీశారు. పిల్లలను పాత్రధారులుగా పెట్టి, ‘కొంటె కృష్ణయ్య’, ‘బూరెల మూకుడు’ అనే సాంఘికాలు, ‘రాజయోగం’ అనే జానపదం కలిపి ‘బాలానందం’గా విడుదల చేశారు. క్లైమాక్స్‌లో పాట ఉండకూడదని ఎవరెంతగా వారించినా, ‘ప్రేమనగర్’లో ‘ఎవరి కోసం...’ పాట పెట్టారు. ఆ ప్రయోగం హిట్టయ్యాక, అనేక చిత్రాల్లో క్లైమాక్స్‌లో పాటలు వచ్చాయి.
కథాకథనంలో కె.ఎస్.ది ప్రత్యేక శైలనేవారు. మీ స్వీయ అనుభవం?
కృష్ణమోహనరావు: ఏ కథ తీసుకున్నా మనసుకు హత్తుకొనేలా, సాఫీగా తెరపై చెప్పేవారు. కథాకథనంలో ఫ్లాష్‌బ్యాక్‌లు బాగా వాడేవారు. ఒక దశలో ఆయనను ‘ఫ్లాష్‌బ్యాక్‌ల దర్శకుడు’ అని ఛలోక్తిగా పిలిచినవారూ ఉన్నారు. కానీ, ఎన్ని ఫ్లాష్బ్యాక్లున్నా సినిమాలో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఉదాహరణకు, ‘తాసీల్దార్ గారి అమ్మాయి’ తీసుకుంటే, అందులో ఏకంగా 8 ఫ్లాష్బ్యాక్లున్నాయి. అయినా సరే, ఆ కథ తెరపై ఎంత బాగా చెప్పారన్నది ఇవాళ్టికీ ఒక మంచి స్క్రీన్‌ప్లే పాఠం.
ఆయన సినిమాగా తీయాలనుకొని, తీయని కథల మాటేమిటి?
రాఘవేంద్రరావు: రాయడం ఆయన హాబీ. ఉదయం లేస్తే చాలు... పెన్ను పట్టుకొని కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. ఖాళీగా ఉండేవారు కాదు. 8 నుంచి పది పేజీల్లో కథ రాసేసుకొనేవారు. అందులో బాగా నచ్చిన కథను మాత్రం ఇంకా వివరంగా రాసుకొనేవారు. అలా ఆయన రాసుకున్న స్క్రిప్టుల్లో ‘సౌందర నందనం’, ‘శాంతల’ (మైసూర్ మహారాజా ఆస్థానంలోని డ్యాన్సర్ కథ), చాలా వివరంగా రాసుకున్న ‘కృష్ణభక్తి’ లాంటివి నాలుగైదు ఉండాలి. అలాగే, ‘ప్రేమనగర్’ చిత్రానికి ఆచార్య ఆత్రేయ స్క్రిప్టు నాన్న గారు తన ముత్యాల లాంటి దస్తూరీలో రాసుకున్నది చాలారోజుల పాటు ఇంట్లో ఉండేది.
కృష్ణమోహనరావు: ఆయన చదివింది ఎస్.ఎస్.ఎల్.సి అయినా, బి.ఏ (లిటరేచర్)వాడు కూడా రాయలేనంత చక్కటి ఇంగ్లీషు రాసేవారు. రోజూ ఆయన డైరీ రాసేవారు. బీమా సంస్థలో పనిచేసే రోజుల నుంచి అది ఆయన అలవాటు. ఆయన డైరీలు కొన్ని భద్రంగా ఉంచాం.
జి. వరలక్ష్మితో, ఆమె కుమారుడైన ప్రకాశ్‌తో మీ అనుబంధం...
కృష్ణమోహనరావు: (అందుకుంటూ..) మేమంతా సఖ్యతగా ఉండేవాళ్ళం. కెమేరామన్ విన్సెంట్ దగ్గర మా కె.ఎ్స్. ప్రకాశ్, నవకాంత్, జయరామ్ శిష్యులు. రాఘవేంద్రరావు దర్శకుడయ్యాక తన నూటికి పైగా చిత్రాల్లో 70 దాకా చిత్రాలకు తమ్ముడు ప్రకాశే కెమేరామన్. వరలక్ష్మి గారు ‘పెద్దాడా, చిన్నాడా’ అంటూ మాతో ఆప్యాయంగా ఉండేవారు. ‘అక్కయ్యా’ అంటూ చొరవగా మా అమ్మతో మాట్లాడేవారు.
నాన్నగారు కట్టిన ప్రకాశ్ స్టూడి యో సంగతులు గుర్తున్నాయా?
కృష్ణమోహనరావు: మొదట్లో ఆయన అభ్యుదయ చిత్రాలే ఎక్కువ తీశారు. డబ్బు కోసం చూడలేదు. 1953లో స్టూడియో కట్టినా, ఇబ్బందులు చుట్టుముట్టాయి. 1960 నుంచి 67 దాకా ఏడేళ్ళు గడ్డుకాలం.
రాఘవేంద్రరావు: చిన్నప్పుడు మాకు ఏడు కార్లున్నా, నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్ళిన రోజులున్నాయి. స్కూల్ ఫీజుకు డబ్బు కట్టలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. క్రమంగా పరిస్థితి మారింది. చేతులు కాలాక, నాన్న గారు కొద్దిగా పంథా మార్చి, వాణిజ్య విజయం మీద కూడా దృష్టిపెట్టి, ‘విచిత్ర కుటుంబం’ (’69), ‘ప్రేమనగర్’ (’71), ‘సెక్రటరీ’ (’76) లాంటి బయటి చిత్రాలు తీశారు.
ఆయనకు ఇష్టమైన దర్శకులు ఎవరు?
రాఘవేంద్రరావు: (నవ్వుతూ...) నా కన్నా అవతలివాళ్ళను ఎక్కువ మెచ్చుకొనేవారు. నటుడు మోహన్‌బాబును ‘నా పెద్దకొడుకు’ అనేవారు. కె.వి. రెడ్డి తరం తరువాత తారల ప్రాబల్యం పెరిగిన రోజుల్లో ‘సినిమాకు దర్శకుడే కెప్టెన్ అన్నది మరోసారి చాటిచెప్పిన వ్యక్తిరా - దాసరి’ అని నాన్న గారు ఎప్పుడూ మెచ్చుకొనేవారు.
రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాశ్ దర్శకుడయ్యాడు. మనుమడు ఇలా సినిమాల వైపు వస్తాడని తాతయ్య ఊహించారా?
కృష్ణమోహనరావు: (సూర్యప్రకాశ్‌ను చూపిస్తూ...) మా నాన్న గారు జీవించి ఉండగా వీడు చాలా చిన్నవాడు. అప్పటికింకా చదువుకుంటున్నాడు. సినిమాల్లోకి రాలేదు. రఘుపతి వెంకయ్య పురస్కార ప్రదాన సమయానికి (1997 యేప్రిల్) నాన్న గారు చనిపోవడంతో, ఆయన పేరే మేము పెట్టుకున్న వీడి చేతులకు ఆ పురస్కారం అందించారు. ఆ తరువాత ఊహించని విధంగా వీడూ దర్శకుడయ్యాడు. ‘మార్నింగ్ రాగా’ లాంటి మంచి చిత్రాల్లో నటించాడు. ‘బొమ్మలాట’ (2005)తో తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్నాడు.
సూర్యప్రకాశ్! తాత గారి లాగే మీరూ నటుడు, నిర్మాత, దర్శకుడయ్యారు. ఆయన సంగతులు మీకేమైనా గుర్తున్నాయా?
సూర్యప్రకాశ్: తాత గారు బతికున్న రోజుల్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచన నాకు లేదు. అయితే, వ్యక్తిగతంగా నా ఎదుగుదల మీద అంతర్లీనంగా ఆయన ప్రభావం ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, వినయంగా ఉండడం లాంటివన్నీ ఆయనను చూసి నేర్చుకున్నవే.
రాఘవేంద్రరావు: వీడు సినిమాల్లోకి రావాలనీ, నాన్న గారి వారసత్వం కొనసాగించాలనీ అందరి కన్నా ఎక్కువ అన్నయ్యకి ఉండేది.
సినీ రంగంలో తాత ఎంతో గొప్ప వ్యక్తని అప్పట్లో మీకు తెలుసా?
సూర్యప్రకాశ్: ఇంట్లో అందరూ చెప్పుకోవడం వల్ల తెలుసు. సినిమాల్లోకి వచ్చాక ఆయన సినిమాలు ‘ప్రేమనగర్’, ‘కొత్త నీరు’ (’82) లాంటివి సీడీల్లో చూశాను. ఆయనకు మనుమడినైనందుకు గర్విస్తున్నా!
రాఘవేంద్రరావు: తన పేరే వీడికి పెట్టినందుకు నాన్న గారు ఆనందించారు. పేరుకు తగ్గట్లే స్క్రీన్‌ప్లే, స్క్రిప్టు రాసుకోవడం లాంటివన్నీ వీడికి నాన్న గారి నుంచి వారసత్వంగా వచ్చింది. నాన్నగారు రాసినట్లే వీడూ అన్నీ పకడ్బందీగా రాస్తాడు.
సూర్యప్రకాశ్: నేనింకా మూడు, నాలుగు సినిమాల అనుభవమే ఉన్నవాణ్ణి. రాబోయే రోజుల్లో ఆ పేరు నిలబెట్టేలా, నాకు లభించిన ఈ వారసత్వానికి న్యాయం చేసేలా మరింత మెరుగైన సినిమాలు చేయాలి.
అవకాశం వస్తే, నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారు?
రాఘవేంద్రరావు: ‘ప్రేమనగర్’ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నేను, నాగార్జున, రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్ చేయాలని ఉంది.
మీ నాన్న గారి గురించి చాలామందికి తెలియని సంగతులు...
కృష్ణమోహనరావు: ఆయనకు సాహిత్య పిపాస ఎక్కువ. నటుడు జగ్గయ్య, ఆయన మంచి సాహితీ ప్రియులు. ఒకప్పుడు నాన్న గారి రచనలు ‘భారతి’ మాసపత్రికలో కూడా వచ్చాయట.
రాఘవేంద్రరావు: అలాగే, పేక ముక్కలతో ఆడే బ్రిడ్జి ఆటలో ఆయన అద్భుతమైన ఆటగాడు. నిర్మాత, దర్శకుడిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాక, ఉదయం పూట స్క్రిప్టులు రాసుకుంటూ, సాయంత్రం పూట కాలక్షేపం కోసం యాభయ్యో పడికి కొన్నేళ్ళ ముందు బ్రిడ్జి మొదలుపెట్టారు.
కొద్దిరోజుల్లోనే జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగిన మేధావి ఆయన.ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా, మూడు తరాలుగా సినీ రంగంలో కృషి చేస్తుండడం మీ కుటుంబానికి దక్కిన అరుదైన అదృష్టమేమో!
రాఘవేంద్రరావు: అవును. మూడు తరాలుగా మా కుటుంబమంతా సినీ రంగంలోనే నిర్మాణ, దర్శకత్వ, సాంకేతిక విభాగాల్లో కృషి చేస్తూనే ఉంది. ఇది ఎల్.వి. ప్రసాద్, ఏయన్నార్, ఎన్టీఆర్, రామానాయుడు గారు - ఇలా కొన్ని కుటుంబాలకే అది దక్కింది.
ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ