కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్‌ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి.