రాజకీయం సేవామార్గం కావాలి
సాక్షి, మచిలీపట్నం : ఆయన పేరు విద్యాసాగర్.. చదివింది బిట్స్పిలానీలో బీఎస్సీ నాటికల్ సైన్స్.. వృత్తిరీత్యా దాదాపు అరవై దేశాల్లో 300ఓడ రేవులను సందర్శించారు. తండ్రి, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు ఆకస్మిక మృతితో వ్యాపార రంగానికే పరిమతమై సాఫీగా వెళుతున్న ఆయన జీవన నౌక ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. అదే సమయంలో నేనున్నాంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి భరోసా ఇచ్చారు.
అంతే వ్యాపార రంగం నుంచి అనూహ్యంగా రాజకీయ రంగంలోకి వచ్చారు.. బందరు లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్తగా అనతికాలంలోనే ప్రజలతో మమేకమైన డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ రాజకీయాలు సేవామార్గంగా ఉండాలని గట్టిగా నమ్ముతున్నారు. యువతరం ప్రతినిధిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తనకు ఒక ఛాన్స్ ఇస్తే బందరు లోక్‌సభ నియోజకవర్గ భవితను బంగారంలా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. వైఎస్ ఆశయాలను నెరవేర్చే సత్తా ఉన్న జగన్మోహనరెడ్డి అండదండలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తన తండ్రి కుక్కల నాగేశ్వరరావు కలలను నిజం చేస్తానని విద్యాసాగర్ ధీమాగా చెబుతున్నారు. ఆయనతో సాక్షి ముఖాముఖి..
సాక్షి : అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన మీరెలా ఫీలవుతున్నారు?
విద్యాసాగర్ : రాజకీయాలు ఇలా ఉంటాయి.. అలా ఉంటాయని వినేవాడిని. కానీ మా తండ్రి కుక్కల నాగేశ్వరరావు మరణంతో వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదరణతో నేను రాజకీయాల్లోకి వచ్చా. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహం, ప్రజల ఆదరణతో నా తండ్రి రాజకీయాల్లో రాణించారు. వైఎస్.జగన్మోహ నరెడ్డి భరోసాతోనే రాజకీయాల్లోకి వచిన నేను ప్రజలకు వీలైనంత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఈ రంగంలో ఉందని గుర్తించా.
సాక్షి : బందరు లోక్‌సభ నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమిమిటి?
విద్యాసాగర్ : బందరు లోక్‌సభ నియోజకవర్గంలో వనరులకు, మేధస్సుకు, యువశక్తికి లోటులేదు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీలకమైన బందరు పోర్టు ఏర్పాటు, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, ఆక్వా రంగం, వ్యవసాయం వంటి ప్రధానమైన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది.
సాక్షి : ఏఏ రంగాలను ప్రధానంగా గుర్తించి అభివృద్ధి చేస్తారు ?
విద్యాసాగర్ : ఒక రంగం అని కాదు. ప్రజలందరికీ మేలు కలిగేలా ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉంది. బందరు పోర్టు ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దడం, నరసాపురం, బాపట్ల, రేపల్లే మీదుగా బందరును కలుపుతూ కోస్తా లింక్ రైలు వంటి వాటిని పూర్తి చేస్తే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి.
వీటి ఏర్పాటుతోపాటు అంతర్జాతీయ స్థాయి కార్గో హబ్ ఏర్పాటు చేస్తే మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే కృత్తివెన్ను మండలంలో గోగులేరు వద్ద సుమారు 200కోట్లతో మినీ పోర్టు ఏర్పాటు చేస్తే తీరంలోని మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుంది. చిన్నిపాటి ఎగుమతి, దిగుమతులు సైతం చేసుకోవచ్చు. మచిలీపట్నంలో ఐటీ మినీ హబ్, పెడనలో కళంకారీ పరిశ్రమకు ఊతమిచ్చేలా టెక్స్టైల్ పార్కు, చినపాండ్రాక, మంగెనపూడి ప్రాంతాల్లో కాస్టిక్ సోడా ప్యాక్టరీలు నిర్మించాల్సి ఉంది.
అలాగే పామర్రు-పెనమలూరు ప్రాంతంల్లో బీఎస్సీ అగ్రికల్చరల్, ఇతర ఉన్నత విద్యా కాలేజీలు, గుడివాడలో ఆక్వా రంగానికి ఊతమిచ్చే కాళాశాల, పరిశోధనశాల, ల్యాబలేటరీ వంటి ఎన్నో ఏర్పాటు చేయ్యొచ్చు. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగయలంక, ఘంటసాల ప్రాంతాల్లోనూ, బందరులోని మంగెనపూడి తదితర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్నా.
దీనికితోడు ప్రధానంగా సుమారు 70వేల మందికిపైగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా కృషి చేస్తాం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా వైఎస్ చేపట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయడం, వ్యవసాయ రంగం పురోగతికి అవసరమైన సాంకేతి పరిజ్ఞానం అందించేలా పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా.
సాక్షి : దశాబ్దాల కలగా మారిన బందరు పోర్టు సాధన ఎలా?
విద్యాసాగర్ : కోస్తా తీరంలో కీలకమైన మచిలీపట్నంలో బందరు పోర్టు తెస్తే దీని రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటికే ఆ దిశగా బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని విశేష కృషి చేశారు. వైఎస్ హయాంలో బందరు పోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తు వైఎస్ చనిపోవడంతో పోర్టు అక్కడే ఆగిపోయింది. వందల ఏళ్ల కిత్రం ఒక వెలుగు వెలిగిన బందరు పోర్టుకు గత వైభవం తీసుకొస్తే తీర ప్రాంతంలో ప్రగతి కెరటాలు ఎగుస్తాయి.
బందరు పోర్టు సాధించగలనన్న ధీమా నాకుంది. ఎందుకంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ చదివిన నేను దాదాపు తొమ్మిదేళ్లలో 60దేశాల్లో 300ఓడ రేవులను సందర్శించా. కొలంబో యూనివర్సిటీ నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. పోర్టు రంగంలో దాదాపు 25ఏళ్ల అనుభవం ఉన్న మా నాన్న కుక్కల నాగేశ్వరరావు నాకు అందించిన విజ్ఞానంతో ఖచ్చితంగా పోర్టు సాధించి ఓడను రప్పించేలా చేయగలనన్న ధృడ సంకల్పం ఉంది.
అదే జరిగితే తెలంగాణాకు అతి సమీపంలోని ఓడ రేవుగా బందరు పోర్టు అవుతుంది. ఇదే సమయంలో బందరు పోర్టుకు అనుసంధానంగా కోస్తా జాతీయ రహదారి, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాధించగలిగితే తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించిన పరిశోధన సంస్థలు, ఐటీ హబ్‌లు, పరిశ్రమలు, విద్యా సంస్థలు అన్నీ బందరు ప్రాంతానికి తరలిరావల్సిందే.