Kukunurpalli Police Station
-
వెళ్లింది పోలీస్ స్టేషన్కా? లేక ఫామ్ హౌస్కా?
గజ్వేల్ / కొండపాక : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం, సీఎం సొంత నియోజకవర్గం అయినందున సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కేసులో నెలకొన్న అనుమానాలను నిగ్గుతేల్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్, ఏసీపీలు నర్సింహారెడ్డి, శివకుమార్ కేసు ప్రగతిపై సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తోటి సిబ్బంది ద్వారా మరిన్ని వివరాలు సేకరించారు. ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలపై క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ నాలుగు రోజులే కీలకం కావడం వల్ల ఈ దిశగా విచారణ ప్రక్రియ సాగుతోంది. ఆ ముగ్గురూ ఎక్కడ? హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఘటనతో ప్రభాకర్‌రెడ్డి కేసుకు ప్రమేయముందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియో యజమాని రాజీవ్‌తో అదే సంస్థలో పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ శిరీషకు విభేదాలు తలెత్తగా ఆ వివాదాన్ని పరిష్కరించడానికి రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వారిద్దరినీ తీసుకొచ్చి ఎస్ఐతో మాట్లాడి వెళ్ళారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు సీసీటీవీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. శిరీష ఆత్మహత్య ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను కుకునూర్‌పల్లి ఘటనపై విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. తన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు ముందు వీరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారా? లేదా, పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడకండ్ల గ్రామంలోని ఫామ్‌హౌస్‌కు వచ్చారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లోని ఇతర సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరుపుతారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. సంగారెడ్డి డీఎస్పీ వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్టు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అలాంటిదేమీ లేదని సిద్దిపేట ఏసీపీ స్పష్టం చేయడంతో అంతా వెనుదిరిగారు. తెల్లవారుజామునే పోస్టుమార్టం పూర్తి బుధవారం రాత్రి 9:30 గంటల తర్వాత ఆందోళనకారులను వ్యూహాత్మకంగా నిలువరించి, కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామునే పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేసి మృతదేహాన్ని ఎస్ఐ స్వగ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు తరలించారు. అంత్యక్రియలకు కుకునూర్పల్లితో పాటు పీఎస్ పరిధిలోని సుమారు 20 గ్రామాల నుంచి ఎస్ఐతో పరిచయాలున్న నాయకులు తరలివెళ్ళారు. అంతేగాకుండా గతంలో ప్రభాకర్‌రెడ్డి పనిచేసిన శామీర్‌పేట ప్రాంతం నుంచి కూడా భారీగా అతని సన్నిహితులు అంత్యక్రియలకు వెళ్ళి కడసారి వీడ్కోలు పలికారు. -
‘శిరీష- ప్రభాకర్ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం
హైదరాబాద్: సంచలనం రేపిన బ్యుటీషియన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసుల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ కీలకంగా మారిన ఫొటో స్టుడియో యజమాని రాజీవ్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం కుకునూర్‌పల్లికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. గురువారం ఉదయం బంజారాహిల్స్(హైదరాబాద్) పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిరీష ఆత్మహత్య కేసులో లభించిన ఆధారాలు, రాజీవ్, శ్రావణ్‌ల వాగ్మూలం తదితర విషయాలను బంజారాహిల్స్ పోలీసులు తిరుపతన్నకు వివరించారు. ఆత్మహత్యలు జరగడానికి ముందు కుకునూర్‌పల్లిలోని ప్రభాకర్‌రెడ్డికి చెందిన క్వార్టర్స్‌లో శిరీష, రాజీవ్, శ్రావణ్‌లు కలిసిఉన్నందున అప్పుడేం జరిగిందో బతికున్న ఇద్దరికే తెలుసుకాబట్టి ఆ మేరకు రాజీవ్, శ్రావణ్‌లనుంచి విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శిరీషపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడా? లేదా? అనే విషయం ఇప్పటిదాకా వెల్లడికాలేదు. ఇదిలాఉంటే బుధవారం సొంత స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వస్థలం టంగుటూరు(యాదాద్రి జిల్లా ఆలేరు మండలం)కు తరలించారు. నేటి సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక బ్యూటీషియన్ శిరీష అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లాని ఆమె స్వస్థలం ఆచంటలో బుధవారమే నిర్వహించారు. (చదవండి: రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు) -
ప్రాణాలే పణం
⇔ కుకునూర్‌పల్లిలో ఉద్యోగం సవాలే.. ⇔కలకలం రేపిన ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ⇔ రోజంతా అట్టుడికిన కుకునూర్‌పల్లి ⇔ తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళన, ధర్నాలు ⇔ నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి ⇔ అదే క్వార్టర్... అదే కణత ⇔ మరణం తీరు ఒకటే ⇔ ఇద్దరు ఎస్ఐల విషాదాంతం గజ్వేల్/కొండపాక/గజ్వేల్‌రూరల్/దౌల్తాబాద్: ఒకే పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్ఐల ఆత్మహత్యలు... అది కూడా ఒకే తరహాలో... నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ వ్యవహారం తాజా ఘటనతో మరోసారి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇలాకాలో ఇది మూడో ఘటన. మార్చి 3న దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు దంపతుల ఆత్మహత్య ఉదంతం కూడా తెలిసిందే.కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి.. 10 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి తరహాలోనే బలవన్మరణానికి పాల్పడడమే ఇందుకు కారణం. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన వత్సల రామకష్ణారెడ్డి (38)1996లో పదవ తరగతి పూర్తికాగానే కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత 2006–07లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అదే సమయంలో ఎస్ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, లక్డీకాపూల్, గజ్వేల్, తొగుట పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. 2015 మార్చిలో కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టాడు. 2016 ఆగస్టు 16కు ముందు రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన వేధింపులను ఎదుర్కొని... ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన క్వార్టర్లో రామకృష్ణారెడ్డి మాదిరిగానే కుడి కణతపైనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మరణించడం విషాదాన్ని నింపింది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పని చేయడం పెద్ద సవాల్ అనే విషయం మరోసారి బయటపడింది. మావోయిస్టు కోటలో ‘పోలీస్’ మావోయిస్టు ఉద్యమానికి ఆకర్శిత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరులో ప్రభాకర్‌రెడ్డి తాను పోలీసు ఉద్యోగం చేయాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాడు. ముందుగా కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో ఉద్యోగం సంపాదించి కొద్ది రోజుల పాటు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత రాతపరీక్ష ద్వారా ఎస్ఐగా నియామకమై తన కలను నెరవేర్చుకున్నాడు. ఏడాదిన్నర క్రితం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రచనను వివాహం చేసుకోగా... ఈ దంపతులకు ఐదు నెలల కిత్రం బాబు జన్మించాడు. జీవితంలో స్థిరపడ్డ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే మార్చి 3న దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం పెద్ద ఎత్తున దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీనికి పరంపరగానే ప్రభాకర్‌రెడ్డి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ‘పక్కదారి’పై ఆగ్రహం 2012లో ఉద్యోగంలో చేరిన ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల గల మల్కాజ్గిరి, శామీర్‌పేట ఠాణాల్లోనూ, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మరికొంత కాలం పనిచేశారు. రామకృష్ణారెడ్డి మరణానంతరం కుకునూర్‌పల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రభాకర్‌రెడ్డితో స్నేహమున్న సన్నిహితులు ఆయన మరణవార్తను తెలుసుకుని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. టీవీ ఛానళ్లలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనుక మరో కోణముందంటూ... హైదరాబాద్‌కు చెందిన బ్యూటీషియన్ ఆత్మహత్యతో సంబంధముందని ప్రచారం జరగడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇదే క్రమంలో సన్నిహితులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్‌ను దహనం చేశారు. రాత్రి 9:30కి మృతదేహం తరలింపు ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి శవాన్ని రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటికే ఆందోళన కొనసాగుతుండగా... ఆందోళనకారులను డీసీఎంలో ఎక్కించి శవాన్ని తరలించారు. ఈ సందర్భంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తానికి పోలీసులు శవాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించారు.