
వెళ్లింది పోలీస్ స్టేషన్‌కా? లేక ఫామ్ హౌస్‌కా?
గజ్వేల్ / కొండపాక : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం, సీఎం సొంత నియోజకవర్గం అయినందున సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కేసులో నెలకొన్న అనుమానాలను నిగ్గుతేల్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు.
గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్, ఏసీపీలు నర్సింహారెడ్డి, శివకుమార్ కేసు ప్రగతిపై సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తోటి సిబ్బంది ద్వారా మరిన్ని వివరాలు సేకరించారు. ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలపై క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ నాలుగు రోజులే కీలకం కావడం వల్ల ఈ దిశగా విచారణ ప్రక్రియ సాగుతోంది.
ఆ ముగ్గురూ ఎక్కడ?
హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఘటనతో ప్రభాకర్‌రెడ్డి కేసుకు ప్రమేయముందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియో యజమాని రాజీవ్‌తో అదే సంస్థలో పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ శిరీషకు విభేదాలు తలెత్తగా ఆ వివాదాన్ని పరిష్కరించడానికి రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వారిద్దరినీ తీసుకొచ్చి ఎస్‌ఐతో మాట్లాడి వెళ్ళారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు సీసీటీవీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
శిరీష ఆత్మహత్య ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను కుకునూర్‌పల్లి ఘటనపై విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. తన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు ముందు వీరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారా? లేదా, పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడకండ్ల గ్రామంలోని ఫామ్‌హౌస్‌కు వచ్చారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లోని ఇతర సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరుపుతారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. సంగారెడ్డి డీఎస్పీ వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్టు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అలాంటిదేమీ లేదని సిద్దిపేట ఏసీపీ స్పష్టం చేయడంతో అంతా వెనుదిరిగారు.
తెల్లవారుజామునే పోస్టుమార్టం పూర్తి
బుధవారం రాత్రి 9:30 గంటల తర్వాత ఆందోళనకారులను వ్యూహాత్మకంగా నిలువరించి, కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామునే పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేసి మృతదేహాన్ని ఎస్‌ఐ స్వగ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు తరలించారు. అంత్యక్రియలకు కుకునూర్‌పల్లితో పాటు పీఎస్ పరిధిలోని సుమారు 20 గ్రామాల నుంచి ఎస్‌ఐతో పరిచయాలున్న నాయకులు తరలివెళ్ళారు. అంతేగాకుండా గతంలో ప్రభాకర్‌రెడ్డి పనిచేసిన శామీర్‌పేట ప్రాంతం నుంచి కూడా భారీగా అతని సన్నిహితులు అంత్యక్రియలకు వెళ్ళి కడసారి వీడ్కోలు పలికారు.