
ప్రాణాలే పణం
⇔ కుకునూర్‌పల్లిలో ఉద్యోగం సవాలే..
⇔కలకలం రేపిన ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య
⇔ రోజంతా అట్టుడికిన కుకునూర్‌పల్లి
⇔ తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళన, ధర్నాలు
⇔ నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి
⇔ అదే క్వార్టర్... అదే కణత
⇔ మరణం తీరు ఒకటే
⇔ ఇద్దరు ఎస్‌ఐల విషాదాంతం
గజ్వేల్/కొండపాక/గజ్వేల్‌రూరల్/దౌల్తాబాద్: ఒకే పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్‌ఐల ఆత్మహత్యలు... అది కూడా ఒకే తరహాలో... నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ వ్యవహారం తాజా ఘటనతో మరోసారి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇలాకాలో ఇది మూడో ఘటన. మార్చి 3న దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు దంపతుల ఆత్మహత్య ఉదంతం కూడా తెలిసిందే.కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది.
తాజాగా ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి.. 10 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి తరహాలోనే బలవన్మరణానికి పాల్పడడమే ఇందుకు కారణం. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన వత్సల రామకష్ణారెడ్డి (38)1996లో పదవ తరగతి పూర్తికాగానే కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత 2006–07లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అదే సమయంలో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, లక్డీకాపూల్, గజ్వేల్, తొగుట పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐగా పనిచేశారు. 2015 మార్చిలో కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టాడు.
2016 ఆగస్టు 16కు ముందు రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన వేధింపులను ఎదుర్కొని... ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన క్వార్టర్‌లో రామకృష్ణారెడ్డి మాదిరిగానే కుడి కణతపైనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మరణించడం విషాదాన్ని నింపింది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పని చేయడం పెద్ద సవాల్ అనే విషయం మరోసారి బయటపడింది.
మావోయిస్టు కోటలో ‘పోలీస్’
మావోయిస్టు ఉద్యమానికి ఆకర్శిత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరులో ప్రభాకర్‌రెడ్డి తాను పోలీసు ఉద్యోగం చేయాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాడు. ముందుగా కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో ఉద్యోగం సంపాదించి కొద్ది రోజుల పాటు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత రాతపరీక్ష ద్వారా ఎస్‌ఐగా నియామకమై తన కలను నెరవేర్చుకున్నాడు.
ఏడాదిన్నర క్రితం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రచనను వివాహం చేసుకోగా... ఈ దంపతులకు ఐదు నెలల కిత్రం బాబు జన్మించాడు. జీవితంలో స్థిరపడ్డ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే మార్చి 3న దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం పెద్ద ఎత్తున దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీనికి పరంపరగానే ప్రభాకర్‌రెడ్డి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
‘పక్కదారి’పై ఆగ్రహం
2012లో ఉద్యోగంలో చేరిన ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల గల మల్కాజ్‌గిరి, శామీర్‌పేట ఠాణాల్లోనూ, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మరికొంత కాలం పనిచేశారు. రామకృష్ణారెడ్డి మరణానంతరం కుకునూర్‌పల్లి ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రభాకర్‌రెడ్డితో స్నేహమున్న సన్నిహితులు ఆయన మరణవార్తను తెలుసుకుని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. టీవీ ఛానళ్లలో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనుక మరో కోణముందంటూ... హైదరాబాద్‌కు చెందిన బ్యూటీషియన్ ఆత్మహత్యతో సంబంధముందని ప్రచారం జరగడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇదే క్రమంలో సన్నిహితులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్‌ను దహనం చేశారు.
రాత్రి 9:30కి మృతదేహం తరలింపు
ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి శవాన్ని రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటికే ఆందోళన కొనసాగుతుండగా... ఆందోళనకారులను డీసీఎంలో ఎక్కించి శవాన్ని తరలించారు. ఈ సందర్భంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తానికి పోలీసులు శవాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించారు.