ఆలయాలకు నిలయం ఆ గ్రామం
ఆలయాలకు నిలయం ఆ గ్రామం ఒకప్పుడు దేవతలు రక్షించిన ప్రాంతం. ఆసక్తి కలిగించే పురాణ ప్రాశస్య్తం. అగస్త్య మహాముని నడయాడిన నేల. శ్రీనాథుడి రచనల్లో ప్రస్థావన సర్వమత సమ్మేళనంగా జైనుల మందిరం. ఆ గ్రామం పేరులోనే దైవం ఉంది.. ఇక గ్రామంలో దేవతలకు కొదవేముంది.. సాక్షాత్తు కుమారస్వామి క్షేత్రపాలకుడిగా ఉన్న ప్రాంతమది.. అగస్త్య మహాముని వంటివారు దర్శించుకున్న నేల.. శ్రీనాథ కవి కొనియాడిన ధరణి
ఒకవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు పచ్చని చెట్లతో అలరారే ప్రకృతి.. ఇలా నిత్యం ఆధ్యాత్మిక సౌరాభాలతో అలరారే ఆ గ్రామమే కుమారదేవం.. ఈ ఊరిలో దేవతలంతా ఒక చోట కొలువై ఉండటం విశేషం. ఒకప్పుడు గోదావరి మధ్యలో ప్రారంభమైన గ్రామ ప్రస్థానం.. క్రమక్రమంగా గట్టుకు చేరిన వైనం ఆసక్తికరం.. రాతి కట్టడాలతో ప్రారంభమైన గ్రామ చరిత్ర.. నేడు శిలాశాసనాలుగా వర్థిల్లుతోంది.
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం అనేక ఆలయాలు కలిగి ఆధ్యాత్మిక సౌరభంతో వర్ధిల్లుతోంది. శతాబ్దాల క్రితం రాతి కట్టడాలతో నిర్మితమైన గ్రామం పూర్వం గోదావరి లంక భూముల్లో ఉండేదని చెబుతారు. మహాకవి శ్రీనాథుడు ఈ గ్రామాన్ని సందర్శించాడంట. తన రచనల్లో ఆ గ్రామం పేరును ప్రస్తావించారని ప్రతీతి. అగస్త్య మహాముని శైవక్షేత్రాల సందర్శనలో భాగంగా పట్టిసీమ వీరభద్రుడిని దర్శించుకుని వెళ్తూ ఈ గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి సమేత అనంతభోగేశ్వరస్వామిని దర్శించుకుని కుండళేశ్వరం వెళ్లారని పురాణ ప్రాశస్త్యం.
గ్రామం పేరు ఎలా వచ్చిందంటే..!
ఆది దేవుడు విఘ్నేశ్వరుడి సోదరుడు కుమారస్వామి క్షేత్రపాలకుడిగా గ్రామాన్ని రక్షించేవాడని అందుకే కుమారదేవం అని పేరు వచ్చిందని నానుడి. డివిజన్ కేంద్రమైన కొవ్వూరు నుంచి పోలవరం వెళ్లే గోదావరి ఏటిగట్టు రోడ్డులో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి తూర్పున గోదావరి నది, గ్రామం చుట్టూ పచ్చని పంటపొలాలతో అలరారుతోన్న ఈ గ్రామంలో పురాతన దేవాలయాల సమూహం ఆకట్టుకుంటుంది. రాతితో చెక్కబడిన శిల్పాలు, రాతితోనే కట్టబడిన ఆలయ గోపురాలు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.
విశ్వభారతి నవలలో ప్రస్తావన
రచయిత పోణంగి శ్రీరామ అప్పారావు తను రాసిన విశ్వభారతి అనే నవలలో కుమారదేవం గురించి చెబుతూ ‘‘అది మహైశ్వర్యముతో తులతూగు గ్రామ రాజ్యం.. పంటలు సమస్తమును సమృద్ధిగా నచ్చడ బండును. అచ్చట గోసమృద్ధి మెండు. ఆ గ్రామ సౌభాగ్యమునకు మూలమైన కారణములతో ముఖ్యముగా జారచోరాది భయములా గ్రామమెఱుంగదు. కారణము లేమి లేకపోవుడ, నిత్య సంతృప్తి, అధర్మభయము. ఆ గ్రామ మేర్పడిన మొదటి రోజులలో కుమారస్వామి దైవముగా గొల్వబడెనట.. అందుచే దానికి కుమారదేవమని పేరు వచ్చెను’’ అని ప్రస్తుతించినారు.
అప్పట్లో.. గోదావరి మధ్యలో..
సుమారు 500 ఏళ్ల క్రితం కుమారదేవం గ్రామం ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా ఏటిగట్టుకు ఆవల గోదావరి నది మధ్య ఉండేదని పెద్దలు చెబుతారు. గోదావరి వరదల సమయంలో వరద ఉద్ధృతికి ఊరు చుట్టూ మట్టి కోతకు గురవుతూ గ్రామం నదిలో కలిసిపోయిందని నానుడి. అయితే అనంతరం గ్రామస్తులంతా ఏకమై గోదావరి ఏటిగట్టుకు ఇవతల గ్రామాన్ని చక్కటి వీధులతో పునర్నిర్మించుకున్నారు. అంతేకాకుండా కులాల ప్రాతిపాదికన ఒకరి తరువాత ఒకరుగా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని పెద్దలు చెబుతుంటారు.
ఆలయ మండపంలో శిలాశాసనాలు
ఆలయ ప్రాంగణంలో విశేషంగా చెప్పుకునే ఆలయం వేంకటేశ్వరస్వామి ఆలయం. ప్రధాన ద్వారానికి ముందు రాతి స్తంభాలతో నిర్మితమైన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాతి స్తంభాలపై అప్పటి ఆలయ నిర్మాణకర్తలు రాయించిన శిలాశాసనాలు దర్శనమిస్తాయి. అయితే ఆలయాలు ఏ కాలంలో నిర్మితమైనవి అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్నేళ్ల క్రితం పురావస్తు శాఖ వారు వచ్చి శిలాశాసనాలను పరిశీలించి వెళ్లారని ఆలయ పూజారి పెద్దింటి వెంకట నరశింహాచారి తెలిపారు. ఈ ఆలయానికి ఒక పక్క ఆంజనేయస్వామి వారు, మరో పక్క లక్ష్మీదేవి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉండటం విశేషం.
ఆలయ ప్రాంగణంలో జైనమత ఆనవాళ్లు
గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో జైన మత ఆనవాళ్లు ఉన్నాయి. జైన మతస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ముని సుప్రతస్వామి విగ్రహం ఆలయ ప్రాంగణంలో దొరికింది. ఆ విగ్రహం అక్కడికి ఎలా వచ్చిం ది అనేదానికి చారిత్రక ఆధారాలు లేవు. అయితే జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న జైన మతస్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని కోరినా గ్రామస్తులు నిరాకరించడంతో చాలా ఏళ్లు ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయింది. రెండేళ్ల క్రితం కొవ్వూరు, రాజమహేంద్రవరానికి చెందిన జైన మతస్తుల సంకల్పంతో గ్రామస్తులు ఆలయ సమీపంలో స్థలాన్ని కేటాయించడంతో వారు ఆలయాన్ని నిర్మించి సప్రతస్వామి విగ్రహాన్ని అందులో పునః ప్రతిష్ఠించి కొలుస్తున్నారు.
చారిత్రక ప్రసిద్ధ అనంత భోగేశ్వరస్వామి ఆలయం
కుమారదేవంలోని పంచాయతీ సమీపంలో ఉన్న ఆలయ సమూహంలో రాజరాజేశ్వరి సమేత అనంత భోగేశ్వరస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయం ఉంటాయి. ఇవి రాతి కట్టడాలు కావడం విశేషం. అనంతభోగేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్టలో ఓ కథ ప్రచారంలో ఉంది. నదిలో కుమారదేవం కలిసిపోవడంతో స్థానికులు కొత్త గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం పాత గ్రామంలో ఉన్న ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. రాజరాజేశ్వరి సమేత అనంతభోగేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలయంలో ప్రతిష్ఠ చేసేందుకు అవసరమైన స్వామివారి శివలింగాన్ని తీసుకు వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉంచారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు భోగేశ్వరస్వామి వారు కలలో కనిపించి “మీరు తీసుకు వచ్చిన శివలింగం ప్రతిష్ఠకు పనికిరాదు.. నేను గోదావరిలోనే ఫలానా ప్రాంతంలో ఉన్నాను. నేను ఉన్న చోట తూనీగలు తిరుగుతూ ఉంటాయి. అదే మీకు గుర్తు తీసుకు వెళ్లి ప్రతిష్ఠించండి’’ అని చెప్పడంతో గ్రామస్తులు తెల్లవారగానే పడవలతో విగ్రహాన్ని వెదకడానికి వెళ్లారు.
విగ్రహాన్ని వెతికే క్రమంలో వెదురు కర్రలతో నదిలో పొడుస్తుండగా విగ్రహ జాడలు కనిపించాయని చెబుతారు. ఈ సమయంలో వెదురు కర్రలతో నీటిలో పొడిచినపుడు శివలింగాన్ని కర్ర తగిలి తలపై చిన్న పెచ్చు ఊడడంతో ఆ ప్రాంతంలో నీటిలో రక్తం కనిపించిందని అంటారు. అంతట ఆ శివలింగాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ దెబ్బ తగిలిన చోట విగ్రహం తడిగా ఉంటుందని ఆలయ పూజారి వెలవలపల్లి నరసింహమూర్తి చెప్పారు. అయితే ప్రతిష్ఠకు తీసుకువచ్చిన శివలింగం నేటికి ఆలయం ప్రాంగణంలో భక్తుల పూజలు అందుకుంటూనే ఉంది.
తరతరాలుగా స్వామిసేవలో..
గ్రామలోని రాజరాజేశ్వరి సమేత అనంత భోగేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే మా తరం నాలుగో తరం. స్వామివారు చాల మహిమ గల దేవుడు. ఆలయానికి పురాణ ప్రాశస్త్యం ఉందని పూర్వీకులు చెప్పేవారు. గోదావరి నదిలో తాను ఉన్నానని, తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని స్వామి భక్తులకు కళలో కన్పించి చెప్పారని కథ ప్రచారంలో ఉంది. శ్రీనాథ మహాకవి తన రచనల్లో ఈ ఆలయ విశేషాలను వర్ణించారు.
– వెలవలపల్లి నరసింహమూర్తి, ఆలయ అర్చకులు, కుమారదేవం
ఆలయాల సమూహం భోగేశ్వరస్వామి ప్రాంగణం
అనంత భోగేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ రామచంద్రమూర్తి, ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి ఆలయాల ఉన్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఆలయాలు పూర్వం గోదావరి నది మధ్య భాగంలో ఉండేవని, గోదావరి కోతతో గ్రామం కనుమరుగవ్వడంతో గట్టు ఇవతల నిర్మాణాలు జరిపారని పెద్దలు చెప్పేవారు. మూడు తరాలుగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో వా వంశీకులం పనిచేస్తూ వస్తున్నాం.
– పెద్దింటి వెంకట నరసింహచారి, అర్చకులు, కుమారదేవం
180 ఏళ్ల క్రితం గ్రామం
కుమారదేవం గ్రామం ఏర్పడి 180 ఏళ్లు అయి ఉండవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం సమయంలో గ్రామం పునర్నిర్మాణం అయ్యిందని పెద్దలు చెబుతారు. మా నాన్న ఈ గ్రామంలోనే పుట్టారు. ఆలయ నిర్మాణ సమయంలో శివుడు కలలో కనిపించి గోదావరి పలాన ప్రాంతంలో ఉన్నానని, నా విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పడంతో అప్పట్లో గోదావరిలో పడవలతో వెదుకుతుండగా వెదురు కర్ర తగిలి విగ్రహం తలపై చిన్న పెచ్చు ఊడిందని, అప్పుడు గోదావరిలో రక్తపు మరకలు కనిపించాయని పెద్దలు చెప్పేవారు.
– నీరుకొండ భూపతిరావు, గ్రామస్తులు, కుమారదేవం
ఇలవేల్పుగా భోగేశ్వరస్వామి
మా గ్రామంలో ప్రజలు రాజరాజేశ్వరి సమేత అనంత భోగేశ్వరస్వామి వారిని ఇలవేల్పుగా పూజిస్తారు. మా గ్రామం సర్వమతాలకు ప్రతీక అని చెప్పడానికి, ఇక్కడ జైనమత ఆనవాళ్లు ఉన్నాయి. మా ఆలయ ప్రాంగణంలో జైనులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మునిసుప్రత్ స్వామి వారి విగ్రహం ఉండేది. ప్రస్తుతం గ్రామంలోనే జైనులు ఒక ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు.
– యండపల్లి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు, కుమారదేవం