మిస్టర్ కూల్
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మెజార్టీలో ముందుంటే తీవ్ర హైరానా పడిపోతారు. ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతారు. అయితే కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ మాత్రం గురువారం నిర్వహించిన ఎన్నికల కౌం టింగ్‌లో ప్రత్యర్థి అభ్యర్థి టీజీ భరత్ ము ందంజలో ఉన్నా గెలుపు తననే వరిస్తుందన్న ధీమా కనబర్చడం ఆశ్చర్య పరిచింది. ఇండియా క్రికెట్ టీంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిలాగా తన గెలుపుపై ఏ మాత్రం ఆందోళన చెందకుండా చివరకు మూడు రౌండ్లు ఉండగానే విజయాన్ని అందుకున్నారు.
తీవ్ర ఉత్కంఠగా సాగిన లెక్కింపు...
కర్నూలు అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి హఫీజ్‌ఖాన్, టీడీపీ నుంచి టీజీ భరత్ బరిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ప్రతి రౌండు ఫలితం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లో టీజీ భరత్ ఆధిక్యాన్ని కనబరిచారు. తరువాత కొన్ని రౌండ్లలో హఫీజ్‌ఖాన్, మరికొన్ని రౌండ్లలో టీజీ భరత్ అధిక్యాలను కనబరచారు. ఇలా మొత్తం 27 రౌండ్లలో 8వ రౌండ్ వరకు టీడీపీ 271 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండేది. తరువాత 11వ రౌండ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 157 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు 16వ రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో ఉండడంతో కొన్ని టీవీ చానళ్లు టీజీ భరత్ విజయం సాధించినట్లు బ్రేకింగ్‌లు ఇచ్చారు. అయితే 17వ రౌండ్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తరువాత నుంచి ఆ మెజార్టీ తగ్గలేదు. మరో మూడు రౌండ్లు మిగిలి ఉండగానే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం కావడంతో టీజీ భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హఫీజ్‌ఖాన్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆది నుంచి విజయంపై ధీమా
కర్నూలు అసెంబ్లీలో 27 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది. ఇందులో 16 రౌండ్ల వరకు టీడీపీ స్వల్ప అధిక్యం సాధిస్తూ వచ్చింది. దీంతో టీడీపీనే గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, హఫీజ్‌ఖాన్ ఏ మాత్రం హైరానా పడలేదు. రోజాలో ఉన్నా ముఖంలో కళ తగ్గలేదు. ప్రార్థనలు చేస్తూ విజయం తనకే వరిస్తుందని..కౌంటింగ్ ప్రక్రియ ఒక్కసారిగా తనకు అనుకూలంగా మారుతుందని సహచరులకు చెప్పగా వారేవరూ నమ్మలేదు. ఆయన అన్నట్టుగానే 17 రౌండ్ నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల అధిక్యం వచ్చింది. అప్పటి నుంచి ఆయన మెజార్టీ పెరగడమే కానీ తగ్గలేదు. మూడు రౌండ్లు మిగిలి ఉండగానే విజయం సాధించారు.