కర్నూలు అసెంబ్లీ బరిలో అత్యధిక మంది పోటీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.111 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో భన్వర్ లాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో 25 లోక్సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 175 అసెంబ్లీ స్థానాలకు 2,243 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
మొదటి దశ ఎన్నికల ప్రచారం ఈ నెల 28 సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుందన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. అలాగే పార్టీలు, అభ్యర్థులు గుర్తులపై ఓటర్ స్లిప్పులను పంపిణి చేయకూడదని చెప్పారు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను హెచ్చరించారు. మాజీ మంత్రులు అధికారిక నివాసాల్లో ఉంటూ ఎన్నికలకు సంబంధించిన పనులు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోసం 7 హెలికాప్టర్లు, 2 ఎయిర్ అంబులెన్స్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 71,222 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.