సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ
సీమాంధ్రలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 77 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం 6 గం. లోపు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో వచ్చిన వారికి ఓటేసే అవకాశం కల్పించటంతో ఆ శాతం 80కు పెరిగే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలో రెండు, మూడు చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. బుధవారం భన్వర్లాల్ హైదరాబాద్లో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా రామిరెడ్డిపల్లిలో ఫైరింగ్ జరిగిందని ఆ ఘటనపై విచారణ జరగుతుందన్నారు.
అలాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 152 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే విజయవాడ మెగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీలలో రూ. 3 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.
అయితే సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పందించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కలిపి 73.46 % పోలింగ్ జరిగిందని తెలిపింది. అక్రమ నగదు, మద్యం తరలింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం అని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 502 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయిందని వివరించింది. దేశవ్యాప్తంగా 66.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సీఈసీ వివరించింది.