ఇరవై నెలల్లోగా ఆరో యూనిట్ పూర్తి
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు ఇరవై నెలల్లో పూర్తి చేసి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ పేర్కొన్నారు. బుధవారం ఆర్టీపీపీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ఆర్టీపీపీ పరిసర గ్రామాల సర్పంచ్‌లు, కార్మిక నాయకులు, స్ధానికులతో సమావే శం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీపీపీలోని ఆరో యూనిట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. అయినా ఇప్పటి నుంచి 20 నెలల్లోగా పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో ఇది వరకే మాట్లాడి పనులు వేగంగా చేయాలని ఆదేశించామన్నారు. బాయిలర్ , ఈఎస్పీ పనులు బాగా జరుగుతున్నాయని, ఇంకా జరగని పనులపై దృష్టి సారించి వాటిని వేగంగా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. కూలింగ్ టవర్ డిజైన్‌లో ఏర్పడిన సమస్య కారణంగా టవర్ నిర్మాణం కొంత ఆలస్యమవుతోందన్నారు.
మార్చికి కృష్ణపట్నంలో 1600 మెగా వాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి
2014 జనవరి నాటికల్లా కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దశ పనులు పూర్తి చేస్తామని, అలాగే మార్చి నాటికి మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఎండీ విజయానంద్ తెలిపారు. అలాగే భూపాల్పల్లిలోని 600 మెగావాట్ల పనులను 2014 మే నాటికి పూర్తి చేస్తామన్నారు.
కొత్త ప్రాజె క్టులకు అనుమతులు
విజయవాడ, కొత్తగూడెం, కృష్ణపట్నంలలో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని విజయానంద్ తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని నాలుగు సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామన్నారు.
ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌కు వినతుల వెల్లువ
ఏపీజెన్కో ఎండీ కె. విజయానంద్‌కు ఆర్టీపీపీ చుట్టు ప్రక్కల గల ఎనిమిది గ్రామాల సర్పంచ్‌లు వినతిపత్రాలు అందజేశారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం కార్మిక నాయకులు కలిసి మెయింటైన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, గ్రేడింగ్‌ల ప్రకారం వేతనం అందించాలని కోరారు. ఈ వినతులపై ఎండీ విజయానంద్ సానుకూలంగా స్పందించారు.
ప్లాంట్ పరిశీలన..
ఆర్టీపీపీలోని యూనిట్లను ఎండీ విజయానంద్ పరిశీలించారు. అనంతరం ఆర్టీపీపీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు, ఎస్ఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.