గురుకులంలో ‘టీ’చకుడు.!
వేధింపుల కేసులో ప్రిన్సిపాల్ అరెస్టు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సారంగాపూర్ : దేవాలయం లాంటి గురుకులంలో విద్యార్థులకు రక్షణగా నిలిచి.. వారికి విద్యాబుద్ధులు నేర్పే ప్రిన్సిపాలే తన బుద్ధిని కోల్పోయాడు. తల్లిదండ్రులకు, ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ ప్రిన్సిపాలే కీచకుడి అవతారమెత్తాడు. కంచె చేను మేసిన విధంగా.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొచ్చేలా వ్యవహరించాడు.
గురుకులంలోని విద్యార్థులను వేధించాడో ప్రిన్సిపాల్ దీంతో బాలిక తమ తల్లిదండ్రులకు విషయం చెప్పుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం సదరు ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాపాడాల్సిన వాడే..
ఇక్కడి గురుకులం జిల్లాలోనే పేరొందింది. వందల సంఖ్యలో బాలికలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి విద్యాలయంలో కీచకబుద్ధి కలిగిన ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. గత విద్యాసంవత్సరమే ఈ ఘటన జరిగినప్పటికీ ఇటీవల సదరు విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు నిర్మల్ డీఎస్పీ ఆధ్వర్యంలో గురుకులం ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. గతంలోనూ 2013ఏప్రిల్ 15న ఇదే ప్రిన్సిపాల్ హయాంలో ఇదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. మూడంతస్తుల వసతిగృహం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. తీవ్ర గాయాలతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
అప్పట్లో ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాఠశాలకు వచ్చి సంఘటన తాలూకు వివరాలు తెలుసుకున్నారే తప్ప దానికి కారణాలేమిటనేది నేటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.