lakshmidevi
-
ఆగని మరణాలు
= వడదెబ్బకు మరో ముగ్గురి మృత్యువాత = అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య = పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్న కుటుంబాలు సూర్యుడు భగబట్టినట్లున్నాడు. వడదెబ్బ రూపంలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. రోజుకు కనీసం ముగ్గురు, నలుగుర్ని చొప్పున బలవుతున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు చనిపోయారు. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు వడదెబ్బతో అకాల మృత్యువాతపడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, బజారున పడుతున్నాయి. నల్లమాడ(పుట్టపర్తి): నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బి.ఓబులేసు(58) వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, గ్రామ కమిటీ అ«ధ్యక్షుడు టీడీ కేశవరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు నాగప్ప, పట్టణాధ్యక్షుడు షంషీర్ తదితరులు ఓబులేసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మారెంపల్లి తండాలో మరొకరు గుమ్మఘట్ట(రాయదుర్గం): గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాలో లల్యానాయక్(61) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖరీఫ్ దగ్గరపడుతుండడంతో పొలంలోని కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడని వివరించారు. విషయం తెలియగానే వైద్యాధికారి రమేశ్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. వై.టి.చెరువులో ఇంకొకరు గుంతకల్లు రూరల్: మండలంలోని వై.టి.చెరువులో లక్ష్మీదేవి(58) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వంట చెరుకు కోసం అడవికి వెళ్లిన ఆమె వడదెబ్బకు గురైనట్లు వివరించారు. ఒక్కసారిగా వాంతులతో పాటు నీరసపడిపోవడంతో గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. -
మొండి‘చెయ్యి’
అనంతపురం: రాష్ట్ర విభజనతో ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. అరకొరగా పోటీ చేసిన వారికీ ఆపార్టీ అన్ని విధాలా మొండిచేయి చూపింది. పార్టీపై ఉన్న అభిమానంతో అనంతపురం కార్పొరేషన్‌లోని 18వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థినిగా కూరగాయల వ్యాపారి లక్ష్మీదేవి పోటీకి దిగారు. రూ. మూడు లక్షలు పార్టీ ఫండ్‌గా ఇస్తామని పార్టీ నాయకులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆ డబ్బు వస్తుందనే భరోసాతో సొంత డబ్బు రూ. 20 వేలు ఖర్చు పెట్టుకుని పది రోజుల పాటు ప్రచారం చే స్తే.. తీరా పార్టీ పెద్దలు చేతులెత్తేశారని ఆమె వాపోయారు. ఆదివారం ఉదయం కాసేపు పోలింగ్ సరళి గమనించాక.. ఇక గెలవడం కష్టమని భావించి ‘కూరగాయలమ్మో..’ అంటూ బండి తోసుకుంటూ వీధుల్లోకెళ్లారు. -
కబలించిన కరెంట్
బనగానపల్లెటౌన్, న్యూస్‌లైన్ : జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ మహిళను పని చేస్తున్నచోటే కరెంట్ కబలించింది. షాక్ తగిలిన మరుక్షణమే ఆమె విగతజీవిగా మారింది. తీగలకు వేలాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బనగానపల్లె 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న వాటర్‌ప్లాంట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీటిని అందించేందుకోసం బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం తలపెట్టారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో తెలుగుపేటకు చెందిన వెంకటలక్ష్మమ్మ, రమణమ్మ, బి.లక్ష్మిదేవి సోమవారం సున్నం వేసేందుకు వెళ్లారు. ప్లాంట్‌పై సున్నం వేస్తుండగా పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి లక్ష్మిదేవి(38) అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్న కూలీలు ప్రాణభయంతో పరిగెత్తారు. తీగలకు ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసిననప్పటికీ అవి విద్యుత్ తీవ్రతను నిరోధించలేకపోయాయి. ఫలితంగా ఓ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధిత కుటుంబీకులను ఓదార్చారు. తీగలపై ఉన్న మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త శ్రీనివాసులు స్థానిక ఫైర్ స్టేషన్లో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగం పర్మినెంట్ కావడంతో నంద్యాలకు బదిలీ అయ్యాడు. లక్ష్మిదేవి మరణంతో కూతురు మౌనిక, కుమారుడు అశోక్‌తోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి.