సూర్యుడు భగబట్టినట్లున్నాడు. వడదెబ్బ రూపంలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. రోజుకు కనీసం ముగ్గురు, నలుగుర్ని చొప్పున బలవుతున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు చనిపోయారు. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు వడదెబ్బతో అకాల మృత్యువాతపడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, బజారున పడుతున్నాయి.
నల్లమాడ(పుట్టపర్తి): నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బి.ఓబులేసు(58) వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, గ్రామ కమిటీ అ«ధ్యక్షుడు టీడీ కేశవరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు నాగప్ప, పట్టణాధ్యక్షుడు షంషీర్ తదితరులు ఓబులేసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.