సమైక్య శంఖారావం పూరించండి
సాక్షి, కడప : వైఎస్సార్ సీపీ ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. కలసపాడు మండలం ముద్దంవారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు ఈనెల 26వ తేదీన హైదరాబాదులో జరిగే సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని విభాగాల అనుబంధ సంస్థలు, సర్పంచులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ అభిమానులు సభకు తరలి రావాలన్నారు. పార్టీలకు అతీతంగా సమైక్య సభ జరగనున్న నేపథ్యంలో సమైక్యతకు కట్టుబడిన పార్టీలతోపాటు సమైక్యవాదులందరూ హాజరు కావాలని వారు కోరారు. పార్టీ ప్రతిష్టగా తీసుకుని సభను జరుపుతున్నందున ప్రతి నియోజకవరం్గం నుంచి ఐదు వేలకు తగ్గకుండా సభకు ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
ఇది కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కాదా?
రాష్ట్రంలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నా టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. దీనికితోడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలుగుదేశం పార్టీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. పచ్చకామెర్ల రోగిగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయలేదని, ఇందులో నలుగురు టీడీపీ ఎంపీల రాజీనామాలు కూడా లేవని స్పీకర్ కార్యాలయమే స్పష్టం చేసిందన్నారు. ఇక్కడ మాత్రం రాజీనామాలు చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని పార్టీలు సమైక్య శంఖారావం సభలో పాల్గొంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే అధికార పార్టీకి అనుకూలంగా విప్ జారీ చేసి ఓట్లు వేసింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లాలో నాలుగు సింగిల్‌విండో అధ్యక్ష స్థానాలను గెలుచుకుంటే వారు కాంగ్రెస్‌పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని, సమైక్యానికే కట్టుబడి ఉన్న వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీగా వైఎస్సార్ సీపీ అందరి గుండెల్లో నిలిచిపోయిందన్నారు.
ఏ పార్టీ సహకరించకపోయినా, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా హైదరాబాద్‌లో సభ జరపాలని నిర్ణయించడం పార్టీ నిబద్ధతకు చిహ్నమని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సైతం సభను విజయవంతం చేయాలని ముఖ్య నేతలందరికీ వ్యక్తిగతంగా సూచించారన్నారు. ఈ సమావేశంలో బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్, కలసపాడు మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు అంకన గురివిరెడ్డి, కాశినాయన మాజీ మండలాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, నాయకులు బాలమునిరెడ్డి, చిత్తా రవిప్రకాష్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, సింగనమల వెంకటేశ్వర్లు, పులి సునీల్ కుమార్, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.