దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే
క్యాష్ రిచ్ లీగ్‌గా పేరు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆటగాళ్ల టాలెంట్‌కు కొదువ లేదు. ప్రతీ ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ ద్వారా ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సహా మిగతా స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. తాజాగా ఐపీఎల్ 2022 ప్రారంభమై కొన్ని రోజులే అయినప్పటికి ఒక ముగ్గురు టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మాత్రం సత్తా చాటుతున్నారు. వారే ఆయుష్ బదోని, తిలక్ వర్మ, లలిత్ యాదవ్. భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్న ఈ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
-సాక్షి, వెబ్‌డెస్క్
ఎన్. తిలక్ వర్మ:
Courtesy: IPL
హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మ సభ్యుడు. దేశవాలీ టోర్నీలైన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ ధరకే అమ్ముడైన ఈ యంగ్ క్రికెటర్ ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తి న్యాయం చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ లేని లోటును తిలక్ వర్మ తీరుస్తున్నాడనే చెప్పొచ్చు.
అందుకు ఉదాహరణ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు. 33 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిసింది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌లు కలిపి 172.91 స్ట్రైక్‌రేట్‌తో 83 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన పలువురు టీమిండియా క్రికెటర్లు.. భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయుష్ బదోని:
Courtesy: IPL
ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని వయసు 22 ఏళ్లు. 2018లో జరిగిన వేలంలో ఆయుష్ బదోనిని ఎవరు కొనుగోలు చేయలేదు. నాలుగేళ్ల క్రితమే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన బదోని.. ఈసారి మాత్రం లక్నో సూపర్ జెయింట్స్‌కు రూ. 20 లక్షలకే అమ్ముడుపోయాడు. తక్కువ ధరకే అమ్ముడపోయినప్పటికి బదోని మాత్రం తన టాలెంటెడ్ బ్యాటింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ బదోని ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. అప్పటికి లక్నో స్కోరు 29/4.. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో అనుభవం లేని క్రికెటర్ చేతులెత్తేస్తాడు.
కానీ బదోని అలా చేయలేదు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన బదోని.. దీపక్ హుడాతో సమన్వయం కుదరడంతో యథేచ్చగా బ్యాట్‌ను ఝులిపించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది.. కానీ బదోని మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకటఉకున్నాడు. 3 ఇన్నింగ్స్‌లు కలిపి ఇప్పటివరకు 92 పరుగులు సాధించాడు. ఆయుష్ బదోని టాలెంట్ గుర్తించిన క్రెడిట్ మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కే దక్కుతుంది. ప్రస్తుతం గంభీర్ లక్నో జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
లలిత్ యాదవ్:
Courtesy: IPL
ఐపీఎల్లో లలిత్ యాదవ్ అడుగుపెట్టి మూడు నాలుగేళ్లు అవుతున్నప్పటికి గుర్తింపు మాత్రం గతేడాది ఐపీఎల్ సీజన్లో వచ్చింది. ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లలిత్ యాదవ్ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. మరోసారి నమ్మకముంచిన ఢిల్లీ క్యాపిటల్స్ లలిత్ యాదవ్‌ను రూ.65 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న లలిత్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 48 నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ఓ 22 బంతుల్లో 25 పరుగులు సాధించి.. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌ల్లో 73 పరుగులు సాధించాడు.