హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన భూ లావాదేవీల రిజిస్ట్రేషన్లన్నీ సీజ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. భూదురాక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అండతోనే ఏపీలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతోందని ఆరోపించారు. రైతులు, దళితులను మభ్యపెట్టి వారి అసైన్డ్ భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. పెద్దల భూములు సీఆర్డీఏ పరిధిలోకి రాకుండా చాలా తెలివిగా వ్యవహరించారని విమర్శించారు. వాటిని తక్షణమే సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని ఆయన తెలిపారు.