కొత్త 2వేల నోటుపై మరో కలకలం
కొత్తగా మార్కెట్లలోకి వచ్చిన 2వేల రూపాయల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. నోటు వెనకాల భాగంలో 15 భాషల్లో ముద్రించినప్పుడు 'దోన్ హజార్ రూపయా' అని ఒకసారి, 'దోన్ హజార్ రుపయే' అని మరోసారి ఉందని.. ఇది స్పెల్లింగు తప్పు కావడంతో మొత్తం నోట్లన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని దుమారం రేగింది.
కానీ, దీనిపై విస్తృతంగా పరిశోధన చేయగా.. నోట్లలో ఎలాంటి తప్పు లేదన్న విషయం తేలిపోయింది. నోటులో ముద్రించిన భాషల ప్యానల్లో అసలు హిందీ లేనే లేదు. నోటుకు వెనక భాగంలో ఎడమవైపు హిందీలో రాయగా, మిగిలిన మరో 15 భారతీయ భాషలలో మాత్రమే రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా ముద్రించారు. ఆ రెండింటిలో ఒకటి మరాఠీ కాగా మరొకటి కొంకణి కావచ్చని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టంగా చెబుతున్నారు.