ఎల్అండ్టీ లాభం 14% డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మౌలికరంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 978 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 1,137 కోట్లు. అప్పట్లో అసాధారణంగా సుమారు రూ. 267 కోట్లు రావడం వల్ల లాభం ఎక్కువగా కనిపించిందని, తాజాగా అలాంటి అంశాలేమీ లేవని కంపెనీ తెలిపింది. మరోవైపు ఆదాయం సుమారు 10 శాతం వృద్ధితో రూ. 14,510 కోట్లకు పెరిగినట్లు వివరించింది. విద్యుత్, హైడ్రోకార్బన్, మెటలర్జికల్ తదితర విభాగాలు కాస్త మందగించినప్పటికీ.. ఇన్ఫ్రా వంటి కొన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో ఆదాయం పెరిగిందని ఎల్అండ్టీ తెలిపింది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం ద్వారా ఆదాయం సుమారు 31 శాతం పెరిగి రూ. 7,198 కోట్లుగా నమోదైంది. సమీకృత ఇంజనీరింగ్ సేవలు, నౌకల నిర్మాణం, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి వ్యాపార విభాగం 53 శాతం పెరిగి రూ. 527 కోట్లుగా నమోదైంది.
మరోవైపు, ఆర్డర్లు 27%(సుమారు రూ. 26,533 కోట్లు) పెరిగాయని ఎల్అండ్టీ వివరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో భారీ ప్రాజెక్టుల వల్ల విదేశీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని, మొత్తం ఆర్డర్లలో 43% వాటా వీటిదేనని పేర్కొంది. సెప్టెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,76,036 కోట్లని ఎల్అండ్టీ తెలిపింది. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడాలని, ఇటీవలి ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడగలవని ఎల్అండ్టీ వివరించింది.